Home / General / యువకుడి ప్రాణాలు తీసిన స్కానింగ్ మెషీన్…!

యువకుడి ప్రాణాలు తీసిన స్కానింగ్ మెషీన్…!

Author:

ఎమ్మారై స్కానింగ్ మెషీన్ లో ఇరుక్కొని ఒక యువకుడు చనిపోయిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో జరిగింది, ముంబయిలోని బీఐఎల్ నాయర్ చారిటబుల్ హాస్పిటల్‌లో శనివారం(జనవరి27) సాయంత్రం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కోసం వచ్చిన వృద్ధురాలుకి సహాయకుడిగా ఉన్న రాజేష్ అనే యువకుడు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు, అసలు ఏం జరిగిందంటే…

jh_rajeshmaru

ఎమ్మారై స్కానింగ్ కోసం వెళ్లిన మహిళ వెంట ఆక్సిజన్ సిలిండర్ ని స్కానింగ్ రూమ్ లోకి రాజేష్ తీసుకెళ్లాడు, సాధారణంగా ఎమ్మారై స్కాన్ రూమ్‌లో మెటల్ వస్తువులను అనుమతించరు. అయితే అక్కడి వార్డు బాయ్ మెషీన్ ఆఫ్ చేసి ఉందని, ఏమీ కాదని చెప్పడంతో రాజేష్ ఆక్సిజన్ సిలిండర్‌తో లోపలికి వెళ్లాడు. అయితే మెషీన్ ఆన్ చేసే ఉండటంతో రాజేష్ అడుగుపెట్టగానే సిలిండర్ దానంతట అదే లీకవడం మొదలైంది. ఎమ్మారై మెషీన్‌లోని అయస్కాంత క్షేత్రం సిలిండర్‌తోపాటు రాజేష్‌ను కూడా లోపలికి లాక్కున్నది. చెయ్యి పూర్తిగా మెషీన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే అక్కడే ఉన్న రాజేష్ బంధువులు, వార్డు బాయ్స్ అతన్ని ఎలాగోలా మెషీన్ నుంచి బయటకు తీశారు.

అయితే అప్పటికే తీవ్రంగా రక్తం పోవడంతో వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. పది నిమిషాల్లోపే రాజేష్ మృతి చెందినట్లు అతని బావ హరీష్ సోలంకి తెలిపాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే తమ అనుమతి లేకుండానే రాజేష్ ఆ ఆక్సిజన్ సిలిండర్‌ను లోనికి తీసుకెళ్లాడని ఆసుపత్రి వాళ్లు చెప్పగా, వార్డు బాయ్ సూచన మేరకే అతను వెళ్లాడని, అక్కడున్న డాక్టర్లు కూడా ఏమీ అడ్డు చెప్పలేదని హరీష్ సోలంకి తెలిపాడు. హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే రాజేష్ చనిపోయాడని సోలంకి తెలిపాడు.

(Visited 506 times, 1 visits today)