ఒక సినిమా 22 రాష్ట్రాలు, 44 పట్టణాలు, 50 ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. ఐతే ఇది గెలిచే హీరో కథ కాదు. వేటకొడవలితో తలల్ని ఎగరేసిన కథే గానీ తెలుగు ఫ్యాక్షన్ కథ కాదు. భారతదేశం లోని మతోన్మాద రాజకీయాలని ఎండగట్టిన చిత్రం. అధికారం కోసం ఒక జాతి నే నిర్మూలించేంత గా వెంటాడి మరీ వాళ్ళని చంపారు. వాళ్ళు చేసిన నేరం వాళ్ళు ముస్లిములు గా పుట్టడమే. ఈ నిజాన్ని కెమెరా కంటితో చూడటమే నేరమైంది. జరిగే ధారుణాన్ని దేశంలో అందరికీ చెప్పటం కూడా తప్పే అనిపించింది డిల్లి లోని ఏ బీ వీ పీ కార్య కర్తలకి. ఈ ఆగస్టు ఒకటిన ” ముజఫర్ నగర్ బాకీ హై ” అన్న డాక్యుమెంటరీ ప్రదర్శనని అడ్డుకున్నారు.
ఇండియన్ డాటర్ లా ముజఫర్ నగర్ బాకీ హై సినిమానీ బ్యాన్ చేయాలనీ, ముజఫర్ నగర్ బాకీ హై ఎక్కడ ప్రదర్షించినా అడ్డుకుంటాం అనీ బెదిరించారు. అదే ఆ చిత్రాన్ని మరిన్ని ప్రదర్శనలకు ఉసిగొలిపింది. ఒక ఉద్యమంలా ముజఫర్ నగర్ బాకీ హై చిత్ర ప్రదర్శనని ఒకే రోజు ఆగస్టు 25 న 22 రాష్ట్రాల్లో 50 ప్రదర్శనలు చేసారు. హిందూత్వ ఉన్మాద శక్తుల దాడికి బలైన వందలాది ముస్లిం ల దీన గాదలని ఈ చిత్రం ప్రపంచానికి చూపించింది. ఈ దేశం లో అనధికారికంగా రాజ్యమేలే మతాన్ని గుర్తించేలా చేసింది. హైదెరాబాద్ ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) లోనూ, లామకాన్ లోనూ ముజఫర్ నగర్ బాకీ హై ప్రదర్శింపబడింది . లామకాన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్యుమెంటరీ ప్రదర్శన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మతరాజకీయాలపై సుదీర్ఘ చర్చ చేశారు. దేశానికి హిందూత్వ అనే పదన్ని వేరుగా చూపించి వేరే మతాలపైకి ఉసిగొలిపే అవకాశం పెరుగుతోందనీ, పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.