తాజ్ మహల్ ప్రేమకు మారుపేరు. అమర ప్రేమకు అద్భుత చిహ్నం. ఎప్పుడో శతాబ్దాల క్రితం షాజాహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం తాజ్ మహల్ ను నిర్మించాడు. ఆగ్రాలోని ఆ తాజ్ మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా నిలిచి ప్రేమ గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పింది.ప్రపంచంలోని ఏ ములనున్న ప్రేమికులైనా జీవితం లో ఒక్కసారైనా చూడాలనుకునే అపురూప కట్టడం ఈ తాజ్ మహల్. అయితే ఇలాంటిదే మరో తాజ్ మహల్ వెలుగులోకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కసేర్ కలాన్ గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఫైజుల్ ఖాద్రి 1953వ సంవత్సరంలో తాజాముల్లి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితం లోకి క్యాన్సర్ మహమ్మరి ప్రవేశించింది. దాంతో ఆయన భార్య 2011లో గొంతుకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధితో మరణించింది.ఆమె మరనాన్ని తట్టుకోలేని ఖాద్రి తన ప్రేమని అజరామరం చేయాలని నిర్ణయించుకున్నాడు. 80 ఎళ్ల ఖాద్రి భార్యపైనున్న ప్రేమకు గుర్తుగా ఆమెకోసం మరో తాజ్ మహల్ నిర్మించాలనుకున్నాడు. అయితే, ఆగ్రాలో ఆనాడు షాజాహాన్ నిర్మించిన ఆ తాజ్ మహల్ అంత గొప్పగా నిర్మించే స్థోమత లేకపోయినప్పటికీ, ప్రేమ మాత్రం గుండెల నిండా ఉన్నది. అదే సంకల్పంతో, తన వద్ద ఉన్నదంతా.. నగలను, కొంత భూమిని అమ్మగా వచ్చిన 11 లక్షల రూపాయలతో తాజ్ మహల్ నిర్మించడం మొదలు పెట్టాడు.అయితే,ఈ డబ్బుతో కొంతవరకే నిర్మాణం జరిగింది. నిర్మాణం పూర్తికావాలి అంటే ఇంకో 6-7 లక్షల రూపాయల వరకు అవసరమవుతాయి. అంత డబ్బు లేకపోవడంతో,నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అయితే, ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రజలు అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇక, ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ఉత్తరప్రదేశ్ సిఎం వరకు వెళ్ళింది. 80 సంవత్సరాల వయసులో ఖాద్రి చేస్తున్న కృషిని మెచ్చుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారట. ప్రేమా మజకా..ఎంతటోడైనా ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే అని మళ్ళీ ప్రూవ్ అయింది.