దక్షిణాది సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మణిరత్నం కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోతున్నారు. మధ్యలో ఆయన నుంచి వచ్చిన ‘ఓకే బంగారం’ పర్వాలేదనిపించినా.. తర్వాత ‘చెలియా’ నిరాశ పరిచింది. ఇప్పుడాయన భారీ తారాగణంతో ‘నవాబ్’ను తీర్చిదిద్దాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
సమయం వృధా చేయకుండా భూపతిపై (ప్రకాష్‌రాజ్) జరిగే హత్యాప్రయత్నంతో ‘యాక్షన్’లోకి వెళ్లే కథ అక్కడ్నుంచి ముఖ్య పాత్రలు ఒక్కోటిగా పరిచయం చేస్తుంది. భూపతికి ముగ్గురు కొడుకులు… మొదటి వాడు తండ్రి కిందే వుంటూ వ్యవహారాలు చక్కబెట్టే వరద (అరవింద్ స్వామి), దుబాయ్‌లో బిజినెస్ చేసే త్యాగు (అరుణ్ విజయ్), సెర్బియాలో అక్రమ ఆయుధ రవాణా చేసే రుద్ర (శింబు). తండ్రిపై హత్యాప్రయత్నం జరగడంతో ముగ్గురు కొడుకులు వస్తారు. అది ఎవరు చేసారనేది తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది హతమవుతారు కానీ అసలు వాడు బయటపడడు. ఆ అటెంప్ట్ చేసింది తన కొడుకుల్లో ఒకడేనంటాడు భూపతి. కొన్ని సంఘటనల తర్వాత అన్నదమ్ముల పోరులో ఎవరు పైచేయి సాధించారు.. భూపతి స్థానాన్ని ఎవరు తీసుకున్నారు అనేది మణిరత్నం తనదైన శైలిలో చూపిస్తారు.
అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబుల నటన చిత్రానికి ప్రధానబలం. అరవింద్ స్వామి పోషించిన వరద పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆయన భార్యగా జ్యోతిక చక్కటి అభినయం ప్రదర్శించారు. వరద ప్రేయసిగా అదితి రావు హైదరి నటించారు. అరుణ్ విజయ్, శింబులు పోషించిన తమ్ముళ్ల పాత్రలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఐశ్వర్య రాజేష్, డయానా పాత్రల పరిధి తక్కువే. ప్రకాష్‌రాజ్, జయసుధ, త్యాగరాజన్ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. విజయ్ సేతుపతి స్నేహితుడిగా, ఇన్‌స్పెక్టర్‌గా చక్కటి అభినయం ప్రదర్శించాడు.చివరి వరకు ఆయన పాత్ర పలు సందేహాల్ని రేకెత్తిస్తూ, చివర్లో ఓ రకమైన అనుభూతిని పంచుతుంది. మణిరత్నం మార్క్ సాంకేతికత సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. సంతోష్ శివన్ కెమెరా మాయాజాలం వల్ల ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం కథలో ఫీల్‌ని పెంచింది. నేపథ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. మణిరత్నం కవితాత్మకతకి ఏమాత్రం అంతరాయం కలిగించలేదు. దాంతో సినిమా సుదీర్ఘంగా సాగినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మణిరత్నం రచన, దర్శకత్వంలోని పస అడుగడుగునా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ ;
మైనస్ పాయింట్స్;
పంచ్ లైన్: నవాబ్.. మణిరత్నం మార్క్ చిత్రం!