నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన తమ వద్ద ఉన్న ఫైల్స్‌ను బయటపెట్టాలని పశ్చిమ బెంగాల్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్ర హోంశాఖ వద్ద నేతాజీకి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ 64 వరకు
ఉన్నాయని వాటిని త్వరలో అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. కొంతమంది ఆయన వీరాభిమానులు ఆయన ఇంకా బతికే ఉన్నాడని అనుకుంటూ వుంటారు. సుభాస్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని, అదృశ్యమైపోయిన తర్వాత 1962లో చైనా యుద్ధంలో పాల్గొన్నాడని, 1964లో జవహర్లాల్ నెహ్రూ అంత్యక్రియల్లో పాల్గొన్నాడని, సాధువుగా మారువేషంతో జీవించాడని, ఇప్పటికీ బతికే వున్నాడని
చెప్పుకుంటూ ఆత్మానందాన్ని పొందుతూ వుంటారు. నేతాజీ కనిపిస్తే బ్రిటీష్ వారికి అప్పగిస్తామని అప్పట్లో భారత ప్రభుత్వం హామీ ఇచ్చినందు వల్లే ఆయన బయటకి రావడం లేదని కూడా అంటూ వుంటారు.
ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం చెన్నైలో పీటర్ రమేశ్ కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ న్యాయవాది సుభాష్ చంద్రబోస్ బతికే వున్నాడని, ఆయనని కోర్టు ముందు ప్రవేశ పెట్టడానికి సిద్ధంగా వున్నామని ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. నేతాజీ బతికున్నారన్న దానికి ఆధారమంటూ ఆయన రమేశ్ కుమార్ ఓ ఫొటోను కూడా కోర్టుకు సమర్పించారు. మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుమతిస్తే కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన బెంచ్ వివరణ ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇక, సోమవారం నాటి తదుపరి విచారణ సందర్భంగా, రమేశ్ కుమార్ భారతీయ సుభాష్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అళగుమీన తరపున మరో పిటిషన్ వేశారు. 1962లో జరిగిన చైనా యుద్ధంలోనూ , 1964లో నెహ్రూ అంతిమ యాత్రలోనూ నేతాజీ పాల్గొన్నారని తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. 1963-64 ప్రాంతంలో పశ్చిమబెంగాల్ లోని సౌల్మరి ప్రాంతంలో నేతాజీ సాధువుగా ఉన్నారన్న విషయాన్ని నిఘా విభాగం కూడా గుర్తించిందని వివరించారు. నేతాజీ యుద్ధ నేరస్తుడు కావడంతో, ఆయనను బ్రిటీషర్లకు అప్పగిస్తామని గతంలో కేంద్రం ప్రకటించిందని, ఆ ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే, నేతాజీని అప్పగించబోమని కేంద్రం స్పష్టం చేస్తేనే ఆయనను కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పిటిషనర్ తెలిపారు. ఆ తర్వాత ఆ సంగతి కూడా అందరూ మర్చి పోయారు..
తాజాగా నేతాజీ కి సంబందించిన ముఖ్యమైన 64 ఫైళ్ళు బయట పెడతామని చెప్పటం తో. దేశం మొత్తం మరోసారి సుభాష్ చంద్ర బోస్ ని తలచుకుంటోంది. ఈ ఫైల్స్ అన్నీ ఆర్చీవ్స్‌గా పశ్చిమ బెంగాల్ పోలీస్ మ్యూజియంలో ఉన్నాయన్నారు. ఇప్పటికే.. చాలా కాలంగా నేతాజీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని ఆయన కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటంతో, కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన కుటుంబీకులు భావిస్తున్నారు. నేతాజీ మరణంపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించే ఫైల్స్‌లో ఆయనకు సంబంధించిన ఎన్నో అంశాలు బయటకు వచ్చే
అవకాశం ఉంది.