Home / Latest Alajadi / నోటా :మూవీ రివ్యూ

నోటా :మూవీ రివ్యూ

Author:

నెలన్నర కిందటే ‘గీత గోవిందం’తో పలకరించాడు విజయ్ దేవరకొండ. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న విజయ్.. ఇప్పుడు ‘నోటా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతను నటించిన తొలి ద్విభాషా చిత్రమిది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ రోజే విడుదలైన ఈ పొలిటికల్ థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్ కొడుకు. వాసుదేవ్ ఒక కేసులో జైలుకు వెళ్లాల్సి రావడంతో అప్పటిదాకా విదేశాల్లో ఉండి ఇండియాకు తిరిగొచ్చిన తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాడు. అతడికి రాజకీయాలపై ఏమాత్రం అవగాహన.. ఆసక్తి ఉండదు. కానీ విపత్కర పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రి పాత్రను సీరియస్ గా తీసుకుంటాడు. ఆ తర్వాత అతడికి అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఎన్నో సవాళ్లను ఛేదించాల్సి వస్తుంది. మరి వీటిని వరుణ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర ఎలా వేశాడు అన్నది మిగతా కథ.

Nota-Movie-Review

అలజడి విశ్లేషణ:

జీవితాన్ని స‌ర‌దాగా గ‌డిపేసే ఓ కుర్రాడు, అస‌లు రాజ‌కీయాల‌కు సంబంధం లేని ఓ యువ‌కుడు – అనుకోకుండా సీఎం అవుతాడు.. `ఒకే ఒక్క‌డు`కి ముందు వ‌ర‌కూ ఇదో కొత్త పాయింట్‌. అదే పాయింట్‌తో `లీడ‌ర్‌`, `భ‌ర‌త్ అనే నేను` వ‌చ్చాయి. కాబ‌ట్టి `నోటా` కోసం ద‌ర్శ‌కుడు అనుకున్న పాయింట్ ఏమీ కొత్త కాదు. సినిమాకి హీరో ఎంత ముఖ్య‌మో విల‌న్ కూడా అంతే ముఖ్యం. రాజ‌కీయాల‌కూ అంతే. ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉండాలి. కానీ.. `నోటా`లో స్వ‌ప‌క్ష‌మే ప్ర‌తిప‌క్షంగా మారుతుంది. ప్ర‌తిప‌క్షం అనే మాట‌కే ఈ సినిమాలో చోటు లేదు. అది ఈ క‌థ‌లో ప్ర‌ధాన‌మైన లోపం.రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు కొంత అవ‌గాహ‌న కొండంత ఆశ‌లూ ఉంటాయి. `ఇలాంటి సీఎమ్ ఉంటే బాగుణ్ణు` అనుకుంటుంటారు. క‌నీసం తెర‌పైనైనా త‌మ క‌ల‌ల ముఖ్య‌మంత్రిని చూసుకోవాల‌నుకుంటారు. కానీ `నోటా` దానికీ ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఆ పాత్ర‌ని తీర్చిదిద్ద‌డంలో ఉన్న లోప‌మో, క‌థ‌లోని వైప‌రిత్య‌మో తెలీదు గానీ… తొలి స‌గం వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి నిజంగానే `డ‌మ్మీ`గా ఉండిపోవాల్సివ‌స్తుంది. `మూడు రోజుల పాటు మా పార్టీ కార్య‌క‌ర్త‌లెవ‌రూ బ‌య‌ట తిర‌క్కూడ‌దు` అనే ప్రెస్ మీట్ సీన్లోనే కాస్త ఉత్సాహం ఉద్వేగం వ‌స్తుంది. దానికి ముందూ వెనుకా.. `నోటా`లో జోరు క‌నిపించ‌దు. ఇది పూర్తిగా త‌మిళ రాజ‌కీయాల‌కు సంబంధించిన క‌థ‌. అక్క‌డి ప‌రిస్థితులు తెలిసిన వాళ్ల‌కు ఈ క‌థ ద్వారా ద‌ర్శ‌కుడు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడో అర్థ‌మ‌వుతుంది. లేదంటే… ఓ ఫ‌క్తు రాజ‌కీయ డ్రామాలా అనిపిస్తుంటుంది. రిసార్ట్ రాజ‌కీయాలు, ఆసుప‌త్రిలో వ్య‌వ‌హారాలు ఇవ‌న్నీ జ‌య‌ల‌లిత ఎపిసోడ్‌ని గుర్తు తెస్తాయి. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ఇవన్నీ కిక్ ఇవ్వొచ్చు గాక‌.. తెలుగు వాళ్ల‌కు మాత్రం అచ్చ‌మైన అర‌వ డ‌బ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకొస్తుంది.

`రౌడీ సీఎమ్‌` అనేది ఈ ముఖ్య‌మంత్రికి ఉన్న ట్యాగ్ లైన్‌. నిజంగా దానికైనా విలువ ఇస్తూ ముఖ్య‌మంత్రి చేసిన రౌడీ ప‌నుల వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం మంచి జ‌రిగింది? అనేది చూపిస్తే.. ఓ కొత్త ముఖ్య‌మంత్రిని తెర‌పై చూశామ‌న్న భావ‌న క‌లిగేది. దాన్ని వ‌దిలేసి అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌పై దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత సుదీర్ఘంగా సాగిన వ‌ర‌ద‌ల ఎపిసోడ్ లో ద‌ర్శ‌కుడి బ్రిలియ‌న్స్ ఏమాత్రం బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఆ సీన్ చాలా సాదా సీదాగా ఉంది. నాజ‌ర్ ల‌వ్ ట్రాక్‌, స‌త్యరాజ్ ఎపిసోడ్ మ‌రీ సుదీర్ఘంగా సాగుతాయి. వాటిని చూస్తున్న‌ప్పుడే క్లైమాక్స్ ఏమిట‌న్న‌ది ప్రేక్ష‌కుడికి చూచాయిగా అర్థ‌మైపోతుంటుంది. కాబ‌ట్టి ప‌తాక స‌న్నివేశాల్లో ఇచ్చిన ట్విస్టు కూడా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి కిక్కూ ఇవ్వ‌దు. ల‌వ్‌, రొమాన్స్‌, ఎంట‌ర్‌టైన్ మెంట్స్‌కి `నోటా` ఆమ‌డ దూరం ఉంటుంది. సీరియ‌స్ స‌బ్జెక్ట్‌లో కామెడీకి, రొమాన్స్‌కీ అవ‌కాశం ఉండ‌క‌పోవొచ్చు.కానీ మ‌రీ ఇంత `రా`గా కూడా ఉండ‌కూడ‌దు. మ‌నం ముందే ఉద‌హ‌రించుకున్న `ఒకే ఒక్క‌డు`లోగానీ, `భ‌ర‌త్ అనే నేను`లోగానీ క‌మ‌ర్షియాలిటీని ఎంత అందంగా మౌల్డ్ చేశారు ద‌ర్శ‌కులు..? ఆ లోపం ఈ సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపించింది. స్వామీజీల గురించి ఏదో బ‌ల‌మైన సెటైర్ వేశాడ‌నుకుంటే.. దాన్ని కూడా పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేశారు. ప‌నామాలో ప్రియ‌ద‌ర్శిన్ చేసే ఆప‌రేష‌న్ కూడా… ఆషామాషీగానే సాగింది. ప‌ది వేల కోట్ల వ్య‌వ‌హారం… ఓ హ్యాక‌ర్‌కి అప్ప‌గించ‌డం, మ‌ర్డ‌ర్ కేసులో ఏ1గా ఉన్న ముఖ్య‌మంత్రి క‌నిపించ‌కుండా మాయ‌మ‌వ్వ‌డం… ఇవ‌న్నీ లాజిక్ కి అంద‌ని విష‌యాలు.

ప్లస్ పాయింట్స్:

  • విజయ్ దేవరకొండ
    

మైనస్ పాయింట్స్:

  • క‌థ‌
  • స్క్రీన్ ప్లే

పంచ్ లైన్: నోటా.. ఓట్లు పడడం కష్టమే! 

(Visited 1 times, 1 visits today)