Home / health / ప్రాణాలకే ప్రమాదమైన వడదెబ్బ నుంచి తప్పించుకోవటం ఎలా?

ప్రాణాలకే ప్రమాదమైన వడదెబ్బ నుంచి తప్పించుకోవటం ఎలా?

Author:

వేసవి వచ్చిందంటే చాలు, భయపెట్టించే ఆరోగ్య సమస్యల్లో వడదెబ్బ ఒకటి. ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు ఉష్ణోగ్రత అదుపు తప్పి వడదెబ్బకు గురికావచ్చు. అందుకే అవగాహనా రాహిత్యంతో సూర్యుడి తాపాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకపోవడం, చల్లని నీటిని తీసుకుంటూ శరీరాన్ని సమత్యులంగా ఉంచుకోవటం వంటి సాధారణ జాగ్రత్తలతో వడదెబ్బ నుండి రక్షించుకోవచ్చు.

precautions-to-avoid-sunstroke

వడదెబ్బ అంటే ? సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 100 నుండి 104 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు ఉంటుంది. 100కుపైగా టెంపరేచర్‌ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వచ్చినట్లు చెబుతాం. (40 డిగ్రీల సెంటిగ్రేటెడ్‌ రెక్టాల్‌ టెంపరేచర్‌ కంటే అధికంగా ఉంటే సన్‌స్ట్రోక్‌గా గుర్తిస్తారు.), ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీలకు పెరిగి నిలకడగా ఉంటే సన్‌స్ట్రోక్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. వేసవిలో ప్రధానంగా ఈ పదం తెలియని వారుండరు. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ, ఎండదెబ్బ, సన్‌స్ట్రోక్‌, హీట్‌ స్ట్రోక్‌గా పిలుచుకుంటారు. వేసవిలో సూర్యుడి తాపం అంతకంతకు పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలను నిర్లక్ష్యం చేసి ఎక్కువగా ఎండలో తిరగటంతో వడదెబ్బకు గురవుతారు.

ఎవరికి త్వరగా తగులుతుంది? సాధారణంగా ఐదేళ్ల సంవత్సరాల లోపు, 60 సంవత్సరాల పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు లోనవుతారు. ఒక్కోసారి ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. అదే విధంగా గర్భిణీలు, బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకోవటం మంచిది. మద్యపానం-మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, పొగ తాగేవారు, స్థూలకాయం, నిద్ర లేమి వంటి రుగ్మతులున్న వారు సన్‌స్ట్రోక్‌కు త్వరగా లోనవుతారు. కాబట్టి శరీరంలో వేసవిలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు సాధారణంగా వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారి తీస్తుంది.

సన్‌స్ట్రోక్‌కు గురైన వారిలో జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరగటం, శరీరంలో నీటి శాతం లోపించి డీహైడ్రేట్‌ అవ్వటం, చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్‌తో పల్స్‌ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటం, యూరిన్‌ పచ్చగా రావటం వంటి లక్షణాలు కనబడతాయి.

ఆకస్మిక మరణం వేసవిలో ఎండ ప్రభావం పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్రద్ధతో చేసే నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చు. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బను అధిగమించవచ్చు. అత్యధికంగా ఎండకు తిరగటం వల్ల హృదయ స్పందనలో కలిగే మార్పుల కారణంగాను, మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాం. ఫలితంగా అదుపు చేసే శక్తి లేకపోవటంతో సన్‌స్ట్రోక్‌ వచ్చి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దాదాపు 30 నుండి 40 శాతం మేర వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటాయి.

వడదెబ్బ చికిత్స:

  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి.
  • బట్టలు వదులు చేసి(25-30 డిగ్రీల) నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలం.
  • గజ్జల్లో, సంకల్లో, మెడ వద్ద ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
  • వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలి.
  • బాధితుల లివర్‌, కిడ్నీల పనితనం గుర్తించే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

ముందు జాగ్రత్తలు:

సన్‌స్ట్రోక్‌ నుండి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. ఒ.ఆర్‌.ఎస్‌ నీళ్ళు, కొబ్బరికాయ, గ్లూకోజ్‌ నీరు తీసుకోవటం మంచిది. విద్యార్థులు పరీక్షల సమయం కావటంతో ఎండ నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆటలు ఆడేవారు సాయంత్రం సమయంలో ఆడుకోవటం చేయాలి.

(Visited 1,060 times, 1 visits today)