జగిత్యాల: సంచలనం సృష్టించిన ఇద్దరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సూసైడ్ పై కీలక విషయాలు వెల్లడించారు జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ. నిన్న రాత్రి విజయపురి కాలనీకి చెందిన మహేందర్, రవితేజ అనే ఇద్దరు విద్యార్థులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ గొడవపడి.. ఒకరిపై మరొకరు పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నారా లేక.. మరెవరైనా ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు.ఈ ఘటనపై నిన్న రాత్రి నుంచి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
మహేందర్, రవితేజ ఇద్దరు వేర్వేరు బాలికలతో రోజూ చాటింగ్ చేస్తుండేవారని DSP చెప్పారు. మైనర్ బాలికలతో చాటింగ్ విషయంపై తల్లిదండ్రులు మందలించారన్నారు. ప్రేమ వ్యవహారం అమ్మాయిల ఇండ్లలో తెలుస్తుందన్న ఆందోళనతోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని డీఎస్పీ చెప్పారు. ఇద్దరు కలిసి మందు కొట్టి.. తర్వాత బంక్ లో పెట్రోల్ కొనుక్కుని.. ఇద్దరూ కలిసే పెట్రోల్ కొనుగోలు చేసి.. మద్యం తాగాక ఈ దారుణానికి పాల్పడ్డారని వివరించారు. అలాగే, విద్యార్థుల ఆత్మహత్య ఘటన వెనుక సినిమాల ప్రభావం కూడా ఉందని వెల్లడించారు.
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా మాదిరిగా ప్రేయసి కోసం హీరో చనిపోయినట్టుగా వీరిద్దరూ ప్రయత్నించారని వివరించారు. ఘటన జరిగినప్పుడు వీరిద్దరు మాత్రమే ఉన్నారని, ఈ ఘటనపై విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవాలని వీరిద్దరూ ముందు నిర్ణయించుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఘటనా స్థలంలో బీరు సీసాలు ఉండటంతో మూడో వ్యక్తి ఉన్నారనే చర్చ జరగ్గా.. వారిద్దరే ఉన్నారని పోలీసులు తేల్చారు.గతంలో మహేందర్, రవితేజలిద్దరూ మత్తు పదార్థాలు వాడుతుంటే… పోలీసు స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు పోలీసులు. ఘటన స్థలంలో మూడో వ్యక్తి లేడని.. స్పాట్ లో స్ట్రాంగ్ బీర్ సీసాలున్నాయని చెప్పారు.