Home / Inspiring Stories / శక్తి పీఠం లేని జ్యోతిర్లింగ క్షేత్రమా? ……శివ శివా…..

శక్తి పీఠం లేని జ్యోతిర్లింగ క్షేత్రమా? ……శివ శివా…..

Author:

శ్రీశైలం లో అర్చక వర్గాల పోరు

చదవేస్తే ఉన్న మతి పోయిందట! సరిగ్గా అలానే ఉంది శ్రీశైలం దేవస్థానంలో కొలువుదీరిన పండిత వరేణ్యుల పరిస్థితి. వీరశైవులు, స్మార్తుల మధ్య గడిచిన ఆరు దశాబ్దాలుగా నడుస్తున్న ఆగమ వివాదాల్లోకి ఏకంగా అక్కడ కొలువు దీరిన దేవతలను కూడా లాగే దాకా పరిస్థితి దిగ జారిందంటే, సహజంగా భక్తకోటి కి ఆందోళన కలుగుతుందిగా……సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది…..ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరిన జ్యోతిర్లింగ , శక్తిపీఠ క్షేత్రంగా యుగాలతరబడి పూజలందుకుంటున్నశ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో తాజాగా బయల్దేరిన వివాదం ఏమిటంటే..అక్కడున్న అమ్మవారు భ్రమరాంబ కాదట….అసలు అది శక్తి పీఠమే కాదట…..ఆది శంకరులు ఈ క్షేత్ర సందర్శనమే చేయలేదట..అలా అని జంగమ పురోహిత , మేధావి వర్గం ఏకంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ ఒక లేఖ కూడా రాసేసింది. అంతే కాదు, తాము పైన చెప్పిన అంశాలన్నిటికీ సంబంధించి తమ దగ్గర చారిత్రిక ఆధారాలు కూడా ఉన్నాయని బల్ల గుద్ది మరీ దబాయిస్తున్నారు జంగమ పురోహితులు, వీర శైవ ఆగమ పండితులు.  అసలు శ్రీశైలం లో భ్రమరాంబా దేవి శక్తి పీఠం లేదనే దాకా వివాదం ముదరటానికి కారణం ఏమిటి? దీని వెనుక ఉన్నది ఎవరు? సహజంగా భక్తులందరికీ కలిగే సందేహమే ఇది. అమ్మ వారి ఆలయంలో స్మార్తులు అవలంబించే ఆగమ రీతికీ, మల్లన్న ఆలయంలో వీర శైవ పురోహితులు ఆచరించే ఆగమ రీతికీ నడుమ నెలకొన్న తేడాల కారణంగా, ఆలయ ప్రాంగణంలో  ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాల్లో స్మార్త పురోహిత వర్గానికీ, జంగమ పురోహిత వర్గానికీ మధ్య తరచూ వృత్తిపరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ముదురు పాకాన పడ్డాయనే ప్రచారం మల్లన్న కొండ మీద విశేషంగా నడుస్తోంది. శ్రీశైలంలో ఉన్నది వీర శైవ సంప్రదాయమని ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయల్పడిన ఆధారాలను ,శాసనాలను అధ్యయనం చేసిన తర్వాత , అధికారులు సూత్రీకరించారనిన్నీ, అందువల్లనే మల్లన్నకు శీతల బంధనం, కుంభాభిషేకం జరపాలనిన్నీ కూడా జంగమ సంఘం తమ లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది. స్మార్త పురోహిత వర్గానికీ, జంగమ పురోహిత వర్గానికీ నడుమ నెలకొన్న `ఇగో క్లాషెస్’ ను అధికారులు సమర్ధవంతంగా వినియోగించుకోవటంతో పాటు, జంగమ మేధావి వర్గాన్ని ఎగ దోయటం వల్లనే వారు అసలు ఇక్కడ శక్తి పీఠం లేదనే దాకా వెళ్లారనే వారూ లేకపోలేదు.

వీర శైవ మత స్థాపకుల్లో మూల ఆచార్యులు నేరుగా మల్లికార్జున లింగం నుంచే అవతరించినట్టుగా వీర శైవ ఆగమ ప్రమాణాలు చెపుతున్నాయనేది జంగమ ల వాదన. స్మార్త బ్రాహ్మణులు చెపుతున్నట్టుగా 1947 లో శ్రీ శైల క్షేత్రంలో వీర శైవులు పుసుక్కున పుట్టలేదనీ, అంతకు పూర్వం నుంచే వారు మల్లికార్జునుడి సేవలో ఉన్నారనటానికి ఆధారాలున్నాయనీ జంగమలు ట్రస్ట్ బోర్డు కు రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. క్రీస్తు శకం 13 శతాబ్దంలోనే ప్రతాప రుద్ర దేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామి పూజాదికాల నిమిత్తం ఇచ్చిన 70 గ్రామాల వివరాలున్న శాసనం కూడా అధికారుల అధ్యయనంలో బయల్పడినట్టుగా కూడా జంగమలు చెపుతున్నారు. ఇటీవలి కాలంలో ఒక నాలుగైదు కార్యక్రమాలను రెండు దేవాలయాల్లో నిర్వహించినంత మాత్రాన స్మార్త బ్రాహ్మణులకే దేవస్థానం లో నిర్వహించాల్సిన యావత్ పూజాదికాల అధికారాన్నిఎలా కట్టబెడతారని కూడా జంగమలు నిలదీస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో జరిగిన శ్రీ భ్రమరాంబా దేవి ఆలయ విమాన గోపుర మహా సంప్రోక్షణా కార్యక్రమానికి స్థానిక వీర శైవ పీఠాధిపతులను ఆహ్వానించలేదనీ, బ్రాహ్మణేతరులు అమ్మవారి ఆలయగోపురం ఎక్కరాదంటూ అవమానించారనీ కూడా జంగమలు వాపోయారు. స్మార్త ఆగమోక్త విధానంలో అమ్మవారి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం జరిగినప్పుడు తామేవ్వరమూ అభ్యంతరం చెప్పలేదనీ, స్వామి వారి ఆలయంలో  వీరశైవ ఆగమోక్తంగా కుంభాభిషేకం తాము నిర్వహించదలచుకున్నప్పుడు స్మార్త బ్రాహ్మణ పురోహిత వర్గం ఎందుకు అడ్డు పడుతోందనీ జంగమలు తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు.

ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే, ఒక్క విషయం మాత్రం స్పష్టం గా అర్ధమవుతుంది. శ్రీశైలం దేవస్థానం లో స్మార్త బ్రాహ్మణ అర్చక వర్గానికీ, జంగమ అర్చక వర్గానికీ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు కారణంగానే ఈ పరస్పర అభియోగాలు, అలాగే సంప్రదాయ దూషణలు నడుస్తున్నాయని ఆలయ వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వారు అంటున్న మాట. ఆ మాట కొస్తే, అసలు రెండు అర్చక వర్గాలనుఎగదోస్తున్నది అధికారులనే ఆరోపణ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్మార్త బ్రాహ్మణుల పైత్యం, గుత్తాధిపత్యం ఇలాగే కొనసాగితే, వీరశైవం కూడా భవిష్యత్తులో హిందూ ధర్మం నుంచి విడిపోతుందనీ, హిందూ ధర్మం ఇలా అడ్రెస్ కూడా లేకుండా పోవటానికి స్మార్త బ్రాహ్మణులే కారణమనీ కూడా జంగమలు ఆ లేఖలో దుమ్మెత్తిపోశారు.

 

 

srishilam temple

 

ఇవన్నీ ఒక ఎత్తయితే, స్మార్తులు మాత్రమే పూజించే శ్రీ భ్రమరాంబాదేవి 15 వ శతాబ్ధం తర్వాతే పుట్టుకొచ్చినదంటూ జంగమలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యే ప్రస్తుతం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్ ను సైతం ఇరుకున పడేలా చేసింది.  వాస్తవానికి  జంగమలు ఇ.ఓ. అండ చూసుకునే ట్రస్ట్ బోర్డు కు రాసిన లేఖలో అమ్మవారిపై అపచార పూర్వక వ్యాఖ్యలు చేశారని భజరంగ దళ్ సమన్వయ కర్త అరవింద్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. 15 వ శతాబ్ధానికి పూర్వం శ్రీ శైలం లో భ్రమరాంబాదేవి ఊసే లేదనీ, పురాణాల్లో కూడా ఈ అమ్మవారి గురించి అనేక తికమకలున్నాయనీ, ఇహ ఆ లెక్కన చూస్తే ఆ అమ్మవారి ఆలయంలో శ్రీ చక్రం కూడా ఆది శంకరులు ప్రతిష్టించింది కాదనీ చెపుతూ జంగమలు కొత్త వివాదానికి తెర లేపారు. ఆలయ నిర్మాణమే 15 వ శతాబ్దంలో జరిగిందనీ, ఆ కాలంలో అక్కడున్న అమ్మవారిని వీరశైవులే పూజించారని చెపుతున్న జంగమలు అక్కడ ఆ సమయంలో ఉన్న అమ్మవారి పేరు గురించి మాత్రం ప్రస్తావించలేదు. 12 వ శతాబ్దానికి పూర్వమే వీరశైవ భక్తులు ఇక్కడ చేసిన మల్లికార్జున ఆరాధన గురించి పాల్కురికి సోమనాధుడు రాసిన పండితారాధ్య చరిత్ర లాంటి పటిష్టమైన ఆధారాలున్నాయి కాబట్టే అధికారులు వీరశైవులకు పెద్దపీట వేసిన విషయాన్ని స్మార్త బ్రాహ్మణులు గుర్తు పెట్టుకోవాలని కూడా జంగమ అర్చక ప్రముఖులు సెలవిస్తున్నారు.

ఆది శంకరుల శ్రీశైల ఆలయ సందర్శనం తో సహా ఏవీ వీర శైవుల చరిత్రలో ప్రస్తావన కు రాలేదని చెబుతున్న జంగమలకు, స్మార్త బ్రాహ్మణులకు మధ్య నడుస్తున్నరగడ— కేవలం ఆలయం పై సంపూర్ణంగా హక్కులను పొందేందుకే అనేది జంగమల అభియోగాలను బట్టి అర్ధమవుతోంది. అయితే, ఆ రెండు అర్చక వర్గాల మధ్య ఆధిపత్య పోరును కేవలం వారికే పరిమితం చేయకుండా, శక్తి పీఠం ఉనికిని ప్రశ్నించే దాకా పరిస్థితి దిగజారటానికి కారణమేవ్వరనే దాని మీదే ఈ రోజున సర్కార్ దృష్టి పెట్టాల్సిన సందర్భం ఏర్పడింది.

(Visited 429 times, 1 visits today)