బట్టలు కొనాలంటే మనం ఏం చేస్తాం. షోరూమ్‌కు వెళ్లి నచ్చిన బట్టలను ఎంచుకొని.. సరిపోతాయో లేదోనని ట్రయల్ వేసుకొని కొంటాం! సేమ్.. క్యాండిడ్ నాట్స్‌లోనూ అంతే. కాకపోతే ఇక్కడ కొనాల్సిన పనిలేదు. అద్దెకు తీసుకుంటే చాలు! అంతేకాదు దుస్తులే కాదు టైలు, బెల్టులు, కళ్లద్దాలు, పర్సులు పురుషులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాషన్ ఉత్పత్తులనూ అద్దెకివ్వటమే దీని ప్రత్యేకత.
క్యాండిడ్‌నాట్స్.కామ్ ఫౌండర్ శ్వేత పొద్దార్ తమిళనాడు.ఆమె వీఐటీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అకామాయ్ టెక్నాలజీస్, హెచ్‌ఎస్‌బీసీ వంటి కంపెనీల్లో పనిచేసింది. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుండటంతో మీటింగ్ లేక పార్టీ ఇతరత్రా ప్రత్యేక సందర్భాలు కామన్‌గా జరుగుతుండేవి. ప్రతిసారీ ఖరీదైన బట్టలు కొనాలంటే ఇబ్బంది. దీంతో స్థానికంగా అద్దెకు తీసుకునేదాన్ని. ఇదే పరిస్థితి ఆమె తోటి సహోద్యోగులదీనూ. కాకపోతే పురుషుల ఫ్యాషన్స్ అద్దెకు దొరకటం చాలా తక్కువ. ఇదే క్యాండిడ్‌నాట్స్ స్టార్టప్‌కు బీజం వేసింది. 2016 ఆగస్టులో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా క్యాండిడ్‌నాట్స్‌ను ప్రారంభించింది.
8 కేటగిరీలు; వెయ్యి ఉత్పత్తులు..జోధ్‌పురీ సూట్స్, బ్లేజర్స్, జాకెట్స్, కుర్తా అండ్ పైజామా, శేర్వాణీ, వెస్ట్రన్, డిజైనర్ అండ్ ఎత్నిక్ వేర్ దుస్తులుంటాయి. వీటితో పాటు టై, బెల్ట్‌లు, పాదరక్షలు, కళ్లద్దాలు, గడియారాలు, పర్సులు వంటి పురుషుల ఫ్యాషన్‌కు సంబంధించిన అన్ని రకాల యాక్ససరీలుంటాయి. సంజయ్ షానీ, సోలా ఫ్యాషన్స్, మాక్రో ఇటలీ వంటి 6 డిజైనర్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆయా డిజైనర్ దుస్తులను అద్దెకిస్తాం. మొత్తంగా 8 కేటగిరీల్లో 1,000 రకాల ఉత్పత్తులుంటాయి. ఏడాది కాలంలో 2 వేల ఉత్పత్తులకు చేర్చాలన్నది లక్ష్యం.
త్వరలో హైదరాబాద్‌లో.. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 12 వేల మంది కస్టమర్లు మా యాక్ససరీలను అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం నెలకు 800 ఆర్డర్లు వస్తున్నాయి. సూట్లు ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారు. ఉత్పత్తుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ)లో 10–15% అద్దె ఉంటుంది. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ఏటా రూ.80 లక్షల ఆదాయం వస్తుంది. త్వరలో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభమవుతుంది. ఏడాదిలో ఆఫ్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తాం. 2020 నాటికి ఢిల్లీ, ముంబై, పుణే నగరాలకు విస్తరించాలన్నది క్యాండిడ్‌నాట్స్.కామ్ లక్ష్యం.
రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. పెళ్లి ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలు, మీటింగ్స్, సమావేశాలు, ఇంటర్వ్యూలు, కార్పొరేట్ ఈవెంట్లకు, కాలేజ్ ఫేర్‌వెల్, కాన్వొకేషన్స్, వార్షికోత్సవాలకు అద్దెకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం క్యాండిడ్‌నాట్స్.కామ్ సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. 4 నెలల్లో రెట్టింపు ఉద్యోగుల నియామకం. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం లక్ష్యం. వీటితో మహిళలు, పిల్లల దుస్తులు, యాక్ససరీల అద్దె విభాగంలోకి విస్తరణ.