Home / Inspiring Stories / ఇలా వచ్చే డబ్బుకు మీరు ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఇలా వచ్చే డబ్బుకు మీరు ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

Author:

ఏ దేశ ప్రభుత్వం అయినా ప్రజలు కట్టే పన్నులతోనే నడుస్తుంది. ప్రజల నుండి పన్నులు వసూలు చేసే విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల పద్దతులు పాటిస్తున్నాయి కాని అన్ని దేశాలు తప్పకుండా వసూలు చేసే పన్ను ఒకటుంది అదే ఆదాయపు ప‌న్ను. మన దేశంలో కూడా ఆదాయ ప‌న్ను ప‌రిమితిని మించి సంపాదిస్తున్న వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఆదాయపు ప‌న్ను రూపం లో చెల్లించాలి. కాని మన దేశంలో కొన్ని రంగాల ద్వారా సంపాదించే ఆదాయానికి పన్ను కట్టనవసరం లేదు. ఆ ఆదాయ మార్గాల గురించి తెలుసుకుందాం.

income tax waivers
1. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం: మన దేశం లో వ్యవసాయం ద్వారా ఎన్ని డబ్బులు సంపాదించిన దానికి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి దాని ద్వారా లభించే ఆదాయాన్ని ఆదాయ పన్ను నుంచి మినహాయించారు.

2. వారసత్వంగా లభించే ఆదాయం: మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభించిన సంపద, నగదుకు కూడా ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంది. ఇలా మీరు వారసత్వం గా పొందిన ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

3. సేవింగ్స్ ఖాతాలోని డబ్బులకు వచ్చే వడ్డీ: బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోని డబ్బుల ద్వార లభించే వడ్డీకి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కాని అది సంవత్సరానికి 10,000 రూపాయలకు మించకుండా ఉండి దానిని దీనిని ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంగా చూపించాలి.

4. భాగస్వామ్య సంస్థ నుండి వచ్చే వాటా: మీరు ఏదైనా భాగస్వామ్య సంస్థలో భాగస్వామి అయితే, ఆ సంస్థ యొక్క మొత్తం ఆదాయంలో మీరు కలిగి ఉన్న వాటా ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరంలేదు. వాటా ద్వారా కాకుండా ఆ సంస్థ ద్వారా లభించే జీతం మరియు ఇతర ఆదాయానికి మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది.

5. దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వచ్చే లాభాలు: దీర్ఘ కాలిక పెట్టుబడి రాబడులకు అంటే ఈక్విటీ వాటాల అమ్మకం మరియు మూచ్యువల్‌ ఫండ్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను నుండి మినహాయించబడుతుంది, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన ఈక్విటీ వాటాల విక్రయాల నుండి వచ్చిన ఏ లాభాలకు అయిన పన్ను కట్టవలసిన అవసరం లేదు.

6. విదేశాలలో భారతీయులు సంపాదించే ఆదాయం: భారతీయ పౌరులెవరైనా విదేశాలలో నివసిస్తూ అక్కడ సంపాదించే ఆదాయానికి భారతదేశంలో పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

7. ఉద్యోగి దీర్ఘ కాలిక సేవలకు లభించే గ్రాట్యుటీ: ఉద్యోగి దీర్ఘకాలిక సేవలను గుర్తించి ఆ సంస్థ ఉద్యోగికి ఇచ్చే గ్రాట్యుటీ ఆదాయ పన్ను నుండి మినహాయించబడింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పూర్తి మినహాయింపు ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం చివరిసారిగా అందుకున్న వేతనం ప్రాతిపదికగా ప్రతి సర్వీసు సంవత్సరానికి 15 రోజుల వేతనం, లేదా రూ. 10 లక్షలు, లేదా అందుకున్న మొత్తం గ్రాట్యుటీ ఈ మూడింట్లో ఏది తక్కువైతే దానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

8. స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా లభించే డబ్బు: స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగికి లభించే ఆదాయంలో 5 లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

9. ఉపకార వేతనం లేదా అవార్డుల ద్వారా వచ్చే ఆదాయం: ఒక అర్హత గల విద్యార్థి చదువు కోసం అందుకునే ఉపకార వేతనాలకు, మరియు విద్యార్ధులకు వచ్చే బహుమతుల ద్వారా లభించే ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

ఇలా సక్రమ పద్దతుల్లో వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరంలేదు, అంతే కాకుండా ఆదాయపు పన్ను పరిమితి లోపు సంపాదించే వారు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

(Visited 6,170 times, 1 visits today)