Home / Inspiring Stories / కనుమరుగు కానున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్..!

కనుమరుగు కానున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్..!

Author:

భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణకు తొలి అడుగు పడింది. ఒక ప్రపంచ స్థాయి బ్యాంకుకు రంగం సిద్ధమైంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు(బీఎమ్‌బీ)ల విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్‌ ఆమోదించినా తుది అనుమతుల కోసం ఈ ప్రతిపాదన తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే కొన్ని న్యాయపరమైన సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ, అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆమోదం లభించిందా అని ప్రశ్నించగా.. పూర్తి స్థాయి వివరాల కోసం వేచిచూడాల్సిందిగా టెలికాం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

sbh

ఎస్‌బీఐకి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపుర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌.. అనే అయిదు అనుబంధ బ్యాంకులుండగా.. కేవలం మహిళల కోసం 2013లో బీఎమ్‌బీని కేంద్రం ఏర్పాటు చేసింది. దేశానికి ఎక్కువ బ్యాంకులు కాదు.. బలమైన బ్యాంకులు కావాలని ఈ ఏడాది మార్చిలో జరిగిన జ్ఞాన సంఘం సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఎస్‌బీఐ బోర్డు ప్రభుత్వం ముందుకు తన అయిదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనను తీసుకొచ్చింది. అయిదు అనుబంధ బ్యాంకులూ ఎస్‌బీఐ ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నందున వీటి విలీనం సులువేనని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విలీనానికి ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. జూన్‌ 28, 29న సమ్మె చేపట్టడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయంగానూ ఈ విలీనానికి కొంత మేర చుక్కెదురు కావొచ్చు. ఈ విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ త్వరలోనే ఒక తీర్మానం చేస్తుందని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ) ప్రధాన కార్యదర్శి ఎస్‌. సుధాకర్‌ రెడ్డి పేర్కొనడం గమనార్హం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌ కూడా విలీన జాబితాలో ఉన్నందున ఎల్‌డీఎఫ్‌ ఆధ్వర్యంలోని కేరళ ప్రభుత్వం కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇలా బ్యాంకులని విలీనం చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో మూలధనం ఒకే బ్యాంకు కిందకు వచ్చే పరిస్థితి వస్తుందని అది దేశ ఆర్థిక అభివృద్దికి చాలా అవసరం అని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు, కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఇది ప్రభుత్వ ఏక పక్ష నిర్ణయం అని దీని వల్ల ఉద్యోగులు నష్టపోతారని తెలిపారు.

Must Read: ఏటియం కార్డు లేకున్నా ఆధార్ కార్డుతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Source: Eenadu.net

(Visited 9,182 times, 1 visits today)