Home / Latest Alajadi / కాలా సినిమా రివ్యూ & రేటింగ్.

కాలా సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

సూపర్ స్టార్ రజనీకాంత్-పా.రంజిత్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘కబాలి’ ప్రేక్షకుల్ని ఎంత నిరాశకు గురి చేసిందో తెలిసిందే. అయినప్పటికీ రజనీ మళ్లీ.. అదే దర్శకుడితో జట్టు కట్టి ‘కాలా’ సినిమా చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ముంబయిలోని మురికివాడ ధారావిలో స్థిరపడ్డ బడుగు జీవుల కోసం పోరాడే నాయకుడు కాలా (రజనీకాంత్). మిగతా ముంబయి నగరం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న రాజకీయ నేత హరి దాదా (నానా పటేకర్)కు ధారావి మాత్రం చేజిక్కదు. అక్కడ కాలా ఆధిపత్యాన్ని అతను సహించలేకపోతాడు. రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా ధారావిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తాడు. అతడికి కాలా అడ్డు తగులుతాడు. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలవువుతుంది. మరి వీళ్లిద్దరి ఎత్తులు పై ఎత్తులు ఎలా సాగాయి.. చివరికి ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా కథ.

Kaala-1528364109-1050

అలజడి విశ్లేషణ:

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి అభిమానులు ప్రధానంగా ఆశించేది వినోదం. అభిమానులనే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం రజనీ ఎలాంటి కథతో సినిమా చేసినా.. ఆయన వీరోచిత అవతారాన్ని చూడాలనే కోరుకుంటారు. సామాజికాంశాలతో ముడిపడ్డ సినిమా అయినా సరే.. అందులో రజనీ మార్కు వినోదానికి ఢోకా ఉండకూడదని భావిస్తారు. ఐతే లార్జర్ దన్ లైఫ్ హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్ అయిన రజనీని ‘కబాలి’లో చాలా సామాన్యంగా.. నీరసంగా చూపించడం ద్వారా అభిమానుల్ని నిరాశకు గురి చేశాడు పా.రంజిత్. అతను ఎంచుకున్న కథ మంచిదే అయినా.. అతడి ఆలోచనలూ ఉన్నతమైనవే అయినా.. రజనీని అలా నీరసంగా చూడటం ప్రేక్షకులకు.. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కు నచ్చలేదు. అందుకేనేమో ‘కాలా’ మీద మనవాళ్లు ముందు నుంచి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐతే  ఒక దశ వరకు ‘కాలా’ను చూస్తుంటే  రంజిత్‘కబాలి’లో జరిగిన తప్పుల్ని గుర్తించాడని.. వాటిని దిద్దుకునే ప్రయత్నం చేశాడని అర్థమవుతుంది.

ఈసారి కూడా సామాజికాంశాలతో ముడిపడ్డ కథనే ఎంచుకున్నప్పటికీ అందులోనే రజనీ మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి రంజిత్ చేసిన ప్రయత్నం కొంతవరకు మెప్పిస్తుంది. తాను చెప్పాలనుకున్న విషయం పక్కకు పోనివ్వకుండానే.. రజనీ నుంచి ఆశించే వినోదాన్ని కూడా అందిస్తూ రంజిత్ సమతూకం పాటించిన తీరు ఓకే అనిపిస్తుంది. సగం వరకు ‘కాలా’లో ఈ బ్యాలెన్స్ చక్కగా కుదిరి.. సినిమా సరైన దారిలో సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ రెండో అర్ధానికి వచ్చేసరికి రజనీని రంజిత్ కమ్మేశాడు. మళ్లీ ‘కబాలి’ మత్తు అతడిని ఆవహించింది. సమాజంలో అణగదొక్కబడిన వర్గాల సమస్యల్ని చాలా సిన్సియర్ గా చెప్పడంలో.. సినిమాల్లో సైతం ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న జనాల గురించి బలంగా వాయిస్ వినిపించడంలో రంజిత్ తపన కనిపిస్తుంది. అతడి ఉద్దేశాలు గొప్పగా కనిపిస్తాయి. కానీ సినిమా చూసేవాళ్లకు ఇవన్నీ ఎంత వరకు కనెక్టవుతాయన్నది కూడా చూసుకోవాలి.

కానీ ప్రధమార్ధంలో చూపించిన సమతూకాన్ని రంజిత్ రెండో అర్ధంలో మరిచిపోయాడు. రజనీ మార్కు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో విఫలమయ్యాడు. ప్రథమార్ధంలో ‘హీరో’లా కనిపించే రజనీ.. ద్వితీయార్ధంలో ‘సామన్యుడి’గా మారిపోవడంతో వస్తుంది ఇబ్బంది. సమస్య గురించి చెబుతూ ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా అనొచ్చు. కానీ రజనీ నుంచి జనాలు ప్రధానంగా ఆశించేది అదే. విరామానికి ముందు ఆ విషయంలో రంజిత్ చూపించిన ప్రతిభ.. తర్వాత కొరవడింది. గొడవలు.. అల్లర్లు.. కష్టాలు.. కన్నీళ్లు.. ఇలా సాగిపోయే ద్వితీయార్ధం చూసి ఒక అలజడికి లోనయ్యే ప్రేక్షకులు అదే మూడ్ తో.. ఒకింత నిరాశతోనే బయటికి వస్తారు. ఈ అలజడిని అందరు ప్రేక్షకులూ భరించలేరు.

‘కాలా’లో ఇంటర్వెల్ ముంగిట ఒక సీన్ ఉంటుంది. హీరో దగ్గరికి విలన్ వచ్చి అతడిని హెచ్చరించి అక్కడి నుంచి బయల్దేరతాడు. అప్పుడు హీరో అంటాడు.. నా ఏరియాకు రావడం నీ ఇష్టం.. వెళ్లడం మాత్రం నా చేతుల్లో ఉంటుంది అని. ఆ తర్వాత నడిచే వ్యవహారం చూస్తే ఎవ్వరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. యాక్షన్ ఎపిసోడ్ కూడా ఏమీ లేకుండానే అక్కడ రజనీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరుకు ఫిదా అవుతాం. కానీ సినిమాలో ఇలాంటి ఎపిసోడ్లు మరిన్ని పడి ఉంటే ‘కాలా’ రేంజే వేరుగా ఉండేది. ఆద్యంతం తమిళ వాసనలు గుప్పుమంటుంటే.. దానికి తోడు రజనీ రాజకీయ ఉద్దేశాలు.. రంజిత్ ఐడియాలజీ కూడా తోడై తెలుగు ప్రేక్షకులకు ‘కాలా’ రుచించని విధంగా తయారైంది. ప్రథమార్ధంలో రజనీ చరిష్మాను చక్కగా వాడుకుంటూ ఎలివేషన్లతో అభిమానుల్ని అలరించినప్పటికీ.. ద్వితీయార్ధంలో అంచనాలు అందుకోలేకపోయాడు రంజిత్.

ఐతే ద్వితీయార్ధంలోనూ రజనీ-నానా పటేకర్ ముఖాముఖి సన్నివేశాల వరకు బాగానే తీర్చిదిద్దిన రంజిత్.. మిగతా వ్యవహారాన్ని చాలా సాధారణంగా నడిపించేశాడు. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు చాలా సాధారణంగా అనిపిస్తాయి. రిపిటీటివ్ గా అనిపించే సీన్లు విసిగిస్తాయి. జనాలతో కలిసి రజనీ పోరాటం మొదలయ్యాక ‘కాలా’ ఒక సాధారణ సినిమాలాగే కనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా నిరాశ పరుస్తుంది. బేసిగ్గా ‘కాలా’ కథ కొత్తదేమీ కాదు. అధికారం డబ్బు మదం ఉన్న ఒక విలన్.. అణగారిన వర్గాలకు ప్రతినిధి అయిన హీరో.. వీరి మధ్య పోరు.. అంతిమంగా చెడుపై మంచి గెలుపు.. దశాబ్దాలుగా చూస్తున్న కథే ఇది. ఐతే ఆకాశమంత రజనీ ఇమేజ్ ను ఉపయోగించుకుని… ఈ కథను ‘రా’గా.. వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేశాడు రంజిత్. కాకపోతే ఈ ప్రయత్నంలో పూర్తిగా విజయవంతం కాలేదు. ‘కబాలి’తో పోలిస్తే ఇది కొంచెం మెరుగనిపిస్తుంది కానీ దాని ఛాయల నుంచి బయటికి రాలేదు. రజనీ నుంచి ఆశించే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ.. మొత్తంగా ఆయన నుంచి ఆశించే సినిమా కాదిది.

ప్లస్ పాయింట్స్:

  • సూపర్ స్టార్ రజనీకాంత్
  • నానా ప‌టేక‌ర్

మైనస్ పాయింట్స్:

  • క‌థ‌
  • స్క్రీన్ ప్లే

పంచ్ లైన్: కాలా.. మధ్యలో దారి తప్పాడు

(Visited 1 times, 1 visits today)