సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ కన్నా చాలా రోజుల ముందే ఆన్‌లైన్ లో రిలీజ్ కావటంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..?
శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లలో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసమని హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగాలు చేసి.. చివరికి వాటన్నిటికంటే మెరుగైందని భావించి క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అతడి దగ్గరున్న తక్కువ డబ్బులకు పాతికేళ్ల ముందు నాటి పాత కారు మాత్రమే వస్తుంది. దాన్నే బాగు చేయించుకుని క్యాబ్ సర్వీస్ మొదలుపెడతాడు శివ. అదొచ్చాక శివకు బాగా కలిసొస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కారులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులో దయ్యం ఉందని తెలుసుకుంటాడు విజయ్. ఇంతకీ ఆ దయ్యం కథేంటి.. దానికి కారుకు సంబంధమేంటి.. ఈ దయ్యం గొడవ నుంచి బయట పడటానికి శివ ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.
తెలుగు తెరకు పరిచయమున్న కథే ఇది. ఈమధ్య తక్కువయ్యాయి కానీ… ఇదివరకు ఇంట్లో దెయ్యం, బంగళాలో దెయ్యం అంటూ వాటి చుట్టూ నడిచే కథలు తరచుగా ప్రేక్షకుల ముందుకొచ్చేవి. ఇలాంటి కాన్సెప్ట్‌లు తెలుగులో మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దెయ్యం టాక్సీలో ఉండటం. దాని చుట్టూ కొత్తగా హాస్యం పండించే ప్రయత్నం చేశారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటూ ఆత్మని శరీరంతో వేరు చేయొచ్చనే విషయాన్ని జోడించి ఈ చిత్రానికి సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చిన విధానం కూడా బాగుంది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు కథని నడిపిన విధానం బాగుంది. హాస్యం కోసమని, హీరోయిజం కోసమని కథని విడిచి ఎక్కడా సాము చేయలేదు. తొలి సగభాగం కథంతా కూడా హాస్యంతో సాగుతుంది. అక్కడక్కడా సన్నివేశాలు కాస్త నిదానంగా సాగుతున్నట్టు అనిపించినా… క్రమం తప్పకుండా హాస్యం పండించడం మాత్రం మరిచిపోలేదు. దాంతో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. కారులో ఉన్న దెయ్యం ఎప్పుడైతే విజృంభించడం మొదలుపెడుతుందో అప్పట్నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధంలో కారులో దెయ్యం ఎందుకుందనే విషయాలతో పాటు.. శిశిరగా మాళవిక నాయర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. విజయ్ దేవరకొండ, మధునందన్‌తోపాటు, హాలీవుడ్ పాత్ర కలిసి చేసే సందడి నవ్విస్తుంది. ద్వితీయార్థంలో కారు యజమాని ఇంట్లోనూ, మార్చురీ గది నేపథ్యంలోనూ వాళ్లు చేసే హంగామా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. కథానాయకుడు, ఆయన కుటుంబం నేపథ్యంలో వచ్చే పతాక సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.
విజయ్ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
పంచ్ లైన్: ‘ట్యాక్సీవాలా’ ఒక రైడ్ సాఫీ ప్రయాణము వేస్కోవచ్చు
రేటింగ్ : 3.25/5
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
‘ట్యాక్సీవాలా’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి ?