ఆరవతరగతి ఫెయిల్ అయ్యాడు. అయితేనేం 100 కోట్ల విలువ చేసే కంపెనీని స్థాపించాడు. అతని సక్సెస్ స్టోరినే ఇది… కేరళలోని వయానడ్ కుగ్రామంలో పేదరిక కుటుంబంలో జన్మించాడు ముస్తఫా. తాగడానికి సరైన నీరు, నడవడానికి మంచి రోడ్లు, కరెంట్ సరిగా ఉండని గ్రామమది.. ఇక అక్కడ కేవలం అయిదవ తరగతి చదువుకునేంత వరకూ మాత్రమే స్కూల్ ఉండేది. హైస్కూల్ కి వెళ్ళాలంటే 4 KM నడిచి వేరే ఊరికి వెళ్లి చదువుకోవాలి. అయితే మొదటినుండీ చదువంటే ఇష్టం లేని ముస్తపా, తన తల్లిదండ్రులు కాఫీ చెట్లలో పనిచేస్తుంటే అక్కడికి వెళ్లి పనిచేసేవాడు. ఇలా చదువుపై ఆసక్తి తగ్గడంతో ఆరవ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ మొదటినుండి ముస్తపాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి లెక్కలైనా సరే చాలా వేగంగా చేసేవాడు. ఇతర సబ్జెక్ట్ ల మాత్రం చాలా వెనుకబడి ఉండేవాడు. ముస్తపాకు లెక్కల మాష్టారుఅంటే చాలా ఇష్టం. ఆయన చెప్పే లెక్కలు చూసి ఆయన్నే ఇన్సిపిరేషన్ గా తీసుకున్నాడు.
ఐతే మ్యాథ్స్ తప్పా ఇతర సబ్జెక్ట్ లలో అంతగా దృష్టి సారించని ముస్తపా పరిస్థితి తెలుసుకున్న లెక్కల మాష్టారు మాథ్యుస్ అతణ్ణి ఒకరోజు పిలిచి,” నువ్వు పనికి వెళ్ళే కూలీ కావాలనుకుంటున్నావా? లేక టీచర్ కావాలనుకుంటున్నావా?” అని అడిగాడు. తన తండ్రి పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూసిన ముస్తపా, మీలా గొప్ప టీచర్ ని కావాలని సమాధానం ఇచ్చాడు. అప్పటినుండి ముస్తపాను స్కూల్ పూర్తికాగానే తన ఇంటికి పిలిచి ఏ సబ్జెక్ట్ లలో వీక్ గా ఉన్నాడో అవన్నీ చెప్పేవాడు. అలా 7వ తరగతిలో క్లాస్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక అప్పటినుండీ వెనక్కి తిరిగిచేసుకోని ముస్తపా పదవ తరగతిలో నెంబర్ 1 గా స్థానాన్ని అందుకున్నాడు.
అయితే ఇంకా చదవాలని తన మనసులో ఉన్నా, తన ఇంట్లో సమస్యలు చూసి చలించిన ముస్తపా, ఎలాగైనా ఉన్నత చదువులు చదివి మ్యాథ్యుస్ లా గొప్ప టీచర్ కావాలని ఫిక్స్ అయి,అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొదటిసారి తన తల్లిదండ్రులనూ, తన ఊరిని వదిలి, కేరళలోని కోజిక్కోడ్ కి వెళ్లి ఇంటర్ చదివాడు. ఆ తర్వాత రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కాలేజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలవబడుతోంది. 1995లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ముస్తపాకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్ద వ్యాపారవేత్తగా, పారిశ్రామిక వేత్త కావాలని అనుకోలేదు. కాలేజ్ లో జరిగిన ప్లేస్ మెంట్ లలో, యుఎస్ లోని మాన్ హాటన్ అసోసియేట్స్ లో ఉద్యోగం సంపాదించాడు.
ఉద్యోగంలో మంచి సంపాదన, మంచి పేరు సంపాదించుకున్న ముస్తపాకు, పెద్ద పెద్ద కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చాయి. అలా ఐదేళ్ళపాటు దుబాయ్, ఐర్లాండ్ లలో పెద్ద సంస్థలలో ఉద్యోగం చేశాడు. ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా సరే, మనసు మాత్రం తల్లిదండ్రుల మీదే ఉంది. వెంటనే ఇండియాకు ఫ్లైట్ బుక్ చేసుకొని బయలుదేరాడు. ఇండియా రావడానికి మూడు ముఖ్య కారణాలున్నాయని చెబుతాడు ముస్తపా. మొదటిడి తన తల్లిదండ్రులతో ఉండాలని, ఇంకా చదవాలని , అలాగే మనకు ఎంతో సమాజం కోసం కొంతైనా తిరిగిచ్చేయాలని చెబుతాడు ముస్తపా.
అయితే తన సొంత ఊరికి వచ్చిన ముస్తపాకు ఇంకా ఏం చేయాలో అన్న క్లారిటీలేదు.ఒకరోజు వీకెండ్ లో తన కజిన్ ఇంటికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు ముస్తపా. అక్కడే తన జీవితాన్ని మార్చిన రోజు. తన బావమరిది అయిన షాంసుద్దీన్ ఆ రోజు దగ్గరలోని షాప్ కు వెళ్లి, దోశపిండిని తీసుకువచ్చాడు. అ దోశపిండిని ఒక చిన్న సంచిలో ఉంచి,పైన రబ్బర్ బ్యాండ్ తో ముడివేశారు. చాలా సింపుల్ గా ఈ పని చేస్తున్నారని, నువ్వు ఇలాంటి బిజినెస్ ను మొదలుపెట్టొచ్చు కదా సూచించాడు. మొదట తన కజిన్ చెప్పిన మాట విని నవ్వినా, ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఆలోచించాడు. అలా దోశపిండితో పాటు ఇడ్లీ పిండిని తయారుచేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముస్తపా, షాంసుద్దీన్, ఇంకా తన కజిన్స్ నాజర్, జాఫర్, నౌషద్ లను అందులో భాగం చేసుకున్నాడు. అందులో తన వాటాగా రు. 25000 కంపెనీని మొదలుపెట్టడానికి ఇచ్చాడు ముస్తపా. తనది ఆ కంపెనీలో 50 శాతం వాటా కాగా, మిగిలిన వారిది 50 శాతంగా ఐడి (id) అనే కంపెనీని మొదలపెట్టారు. ఐడి అంటే ఇడ్లి, దోశ పిండిని సప్లై చేసేదిగా నామకరణం చేశారు. ఇంకా దానికి ముందు ఫ్రెష్ ఇడ్లి, దోశ పిండిగా పేరుపెట్టి, 550 చదరపు అడుగుల రూంలో రెండు గ్రైండర్లు, ఒక మిక్సీ, ఒక సీలింగ్ మిషిన్ ను బిగించారు.
ఆ వ్యాపారం మొదలుపెట్టిన రోజున 20 షాపులకు, 100 ప్యాకెట్లు ఇడ్లి, దోశ పిండిని అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నారు. వారు అనుకున్న దానికంటే ఎక్కువ బిజినెస్ జరిగింది. తమ సంస్థ నుండి మరింత ఉత్పత్తి చేయాలని వచ్చిన డబ్బుకు ఇంకొంచెం కలిపి ఎక్కువ ప్యాకెట్లను తయారుచేశారు. వారు అనుకున్న లక్ష్యాన్ని కేవలం 9 నెలలలోనే సాధించారు. వారు తయారుచేస్తున్న ఆ పిండికి మరింత డిమాండ్ పెరిగింది. 400 స్టోర్స్ కు తమ ప్రాడక్ట్ కు కస్టమర్స్ గా ఉన్నారు. 2008లో మరో 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి, రోజుకు 3500 కేజీల ప్రాడక్ట్ ను పంపేవారు. అందులో పనిచేసే వారి సంఖ్య 30కి చేరింది. తనతో పాటు చేయి కలిపిన ఆ నలుగురూ అందులో ఇన్ ఛార్జ్ లు మాత్రమే కానీ ఎవరూ ఉద్యోగులు కాదు. ఇలా ఒకవైపు తన సంస్థ పనులు చూసుకుంటూనే ఎంబిఏ పూర్తి చేశాడు ముస్తపా. అప్పటి వరకూ కేవలం పాట్నర్ గానే ఉన్న ముస్తపా, సంస్థ సీయీవో గా మారాడు.
తమ ప్రొడక్ట్ కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తమ సంస్థ పరిధిని పెంచాలనుకున్నాడు. 2012లో తమ ప్రాడక్ట్ కు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో చెన్నై, బెంగళూర్, హైదరాబాద్, పూణే, ముంబై వంటి నగరాలకు సప్లై చేశారు. ఇక 2013లో దుబాయ్ కి తమ ప్రాడక్ట్ ను సప్లై చేసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందినా, అక్కడి నుండి ఎక్కువ డిమాండ్ ఉండేది కాదు.అందుకే అంతర్జాతీయ మార్కెట్ గురించి ఆలోచించకుండా మనదేశంలో తమ ప్రాడక్ట్ ను విస్తీర్ణించాలనుకున్నారు. ప్రస్తుతం రోజుకు 50, 000 కేజేల ప్రాడక్ట్ అ సంస్థ నుండి ఉత్పత్తి అవుతుండగా, 4 కోట్లు ఖర్చు పెడుతుంటే, 100కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నాడు సంస్థ సీయీవో అయిన ముస్తపా. 100 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు చాలా గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారట. 2005లో ఒక వ్యక్తితో 10 ప్యాకెట్లను రిలీజ్ చేయగా,గడచిన పదేళ్ళలో 50,000 ప్యాకెట్లు, 1,100 మంది ఉద్యోగులు తమ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపాడు ముస్తపా. వచ్చే ఐదేళ్ళలో తమ సంస్థ ఆదాయాన్ని 1000 కోట్లు చేయాలని, 5000 మందికి ఉపాధి కల్పిస్తూనే, ఎప్పటిలాగే నాణ్యతమైన సరుకును అందించడమే తమ లక్ష్యమని తన భవిశ్యత్ ప్రణాళిక గురించి చెబుతున్నాడు ముస్తపా. ఇందులో పనిచేసే ఉద్యోగులను పేదవాళ్ళను, గ్రామాల నుండి వచ్చిన వారిని తీసుకొని క్రమశిక్షణతో ఉండేలా తమ సంస్థను ఏర్పాటుచేసుకున్నాడు.
ఇది ఒక కుగ్రామం నుండి ఆరవ తరగతి ఫెయిల్ అయి 100 కోట్ల కంపెనీకి సీయీవో అయిన మన ముస్తపా సక్సెస్ స్టొరీ. ” మీకు ఏదైనా చేయాలని అనిపిస్తే,ఆ మంచి పనిని వెంటనే ఆచరణ లో పెట్టండి. రేపటి గురించి ఆలొచించకండని చెబుతాడు” 40 ఏళ్ళ ముస్తపా.