Home / Devotional / 9 రోజుల పాటు శ్రీవారి దర్శనం బంద్..!

9 రోజుల పాటు శ్రీవారి దర్శనం బంద్..!

Author:

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు, ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ ప్రకటించారు, తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సభ్యులు, అధికారుల సమావేశంలో తెలిపారు.

మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండడం.. భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువ సమయం ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల కొండపై 12వ తేదీ నుంచి వైదిక కార్యక్రమాలు జరపాల్సి ఉండగా 9వ తేదీ నుంచే భక్తుల రాకను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. దీనిపై ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో సింఘాల్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అప్పట్లో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని తెలిపారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఒకవేళ పరిమితంగా అనుమతించినా.. రోజుకు 20 వేలమందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందని, మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి తోడు 10, 11 తేదీల్లో ఒకవేళ భక్తులకు దర్శనానికి అనుమతిస్తే రెండు రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేసినట్లు తెలిపారు.

(Visited 1 times, 1 visits today)