మహారాష్ట్రలోని నాసిక్ లో భార్యలు బతికి ఉండగానే వారి భర్తలు గోదావరి నదిలో పిండ ప్రదానం చేసి..నదిలో తర్పణాలు వదిలారు.ఈ కార్యక్రమం మొత్తం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 100 మంది భర్తలు పాల్గొన్నారు. భార్యలు బతికి ఉండగానే భర్తలు ఇలాంటి పని చేయడంపై సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది.
ఫౌండేషన్ అధ్యక్షులు అమిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ ‘పెళ్లి సందర్భంగా నవ దంపతులు ఏడడుగులు వేసి కలిసి నడుస్తామని ప్రమాణం చేస్తారు. అయితే చాలా జంటలు పెళ్లయిన స్వల్ప వ్యవధిలోనే వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇవి చివరకు విడాకులకు దారి తీస్తున్నాయి. ఫలితంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో చాలా సందర్భాల్లో మహిళలకు మద్దతు లభిస్తోంది. అందుకే బాధిత భర్తలకు భరోసా కల్పించాలనే భావనతో వాస్తవ్ ఫౌండేషన్ ఏర్పాటుచేశామన్నారు. గతంలో ఫౌండేషన్ వారణాసిలోనూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించిందన్నారు. చాలామంది భర్తలు తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ జైలుకు సైతం వెళ్లాల్సి వస్తోందని’ వాపోయారు.