Home / Latest Alajadi / కోటి మొక్కలని నాటిన మన రామయ్యకి పద్మశ్రీ వచ్చింది.

కోటి మొక్కలని నాటిన మన రామయ్యకి పద్మశ్రీ వచ్చింది.

Author:

దరిపల్లి రామయ్య ఈ పేరు మనలో చాలామందికి తెలియకపోవచ్చు కానీ అది చరిత్రలో నిలిచిపోయే ఒక వ్యక్తి పేరు, మన చుట్టూ ఉన్న ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోవాలని ఊహా తెలిసినప్పటి నుండి మొక్కలని నాటుతూ వాటిని మహా వృక్షాలుగా పెంచిన ఒక గొప్ప వ్యక్తి పేరు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధరిపల్లి రామయ్య మొక్కల పెంపకాన్నే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆరు పదుల వయసు దాటినా ముందు తరాల కోసం శ్రమిస్తున్నారు. పచ్చదనంతో పుడమి పులకించి పోవాలని తన భార్య జానమ్మతో కలసి విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు.

దరిపల్లి రామయ్య

వేసవి వచ్చిందంటే వీరు అడవులు తిరుగుతూ రకరకాల విత్తనాలు సేకరిస్తుంటారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేస్తారు. తొలకరి చినుకులు పడగానే ఆ గింజలను నాటేపని ప్రారంభిస్తారు. ఈ మొక్కలను పది మందికీ పంచి హరితహారం ఏర్పాటు చేస్తున్నారు. రామయ్యకు కాసింత సమయం దొరికిందంటే చాలు వృక్షో రక్షతి… రక్షితః అని రాసి ఉండే అట్ట ముక్కలను తలకు తగిలించుకుని ప్రచారం చేస్తుంటారు. ఎక్కడ చిన్నబోర్డు కనిపించినా, పాత రేకులు కనిపించినా ఈ సూక్తి రాయందే రామయ్యకు మనసొప్పదు. రామయ్య ఇంటి నిండా ఇలాంటి రాతలే కనిపిస్తాయి. ఎవరైనా కబురు చేస్తే స్వయంగా వెళ్లి మొక్కలు నాటి వస్తాడు.

Darapalli-Ramaih దరిపల్లి రామయ్య

ఈ విధంగా ఇప్పటివరకు ఈ వనజీవి కోటికి పైగానే మొక్కలను నాటాడు. ప్రతిక్షణం పచ్చదనం కోసం శ్రమిస్తున్న ఈ వనజీవిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పద్మ శ్రీ బిరుదుని ప్రకటించి గౌరవించింది, అందరి భవిష్యత్ పచ్చదనంతో నిండిపోవాలని అహర్నిశలు కష్టపడుతున్న దరిపల్లి రామయ్య మన తెలుగువాడే కావడం మనకి చాలా గర్వకారణం, అలజడి.కామ్ తరుపున రామయ్యకి గారికి సెల్యూట్..!

(Visited 195 times, 1 visits today)