Home / Reviews / మూవీ రివ్యూ:వినయ విధేయ రామ

మూవీ రివ్యూ:వినయ విధేయ రామ

Author:

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో కొండంత హీరోయిజం కనిపిస్తుంటుంది. కథానాయకుడ్ని ప్రేమించి, అభిమానుల్లో ఓ అభిమానిగా మారిపోయి సినిమాలు తీస్తుంటారాయన. అందుకే అవన్నీ వాణిజ్యపరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. మరి బోయపాటి మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉంది? ప్రతి నాయకుడిగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏవిధంగా మెప్పించారు?

కథ:

రామ (రామ్‌చరణ్‌)కు తన అన్నలంటే ప్రాణం. పెద్దవాడు భువన్‌ కుమార్‌(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ. భువన్‌ కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్‌ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు.అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్‌ మున్నా (వివేక్‌ ఒబెరాయ్‌). రాజు భాయ్‌ తన ప్రాంతంలో ఎలక్షన్‌లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్‌ కుమార్‌ను అక్కడికి ఎలక్షన్‌ కమీషనర్‌గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్‌, భువన్‌ కుమార్‌ను ఏం చేశాడు.? అన్న కోసం రామ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

ఈ చిత్రం రెండు ఛాయాల్లో సాగుతుంది. ఓ వైపు పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగితే, మరోవైపు త‌న అన్న‌కు, కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాటం ఇందులో కనిపిస్తుంది. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అదే స‌మ‌యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల‌ను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అవి రెండూ ఇంకాస్త పెరిగాయి. ఒక కుటుంబంలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, రిచ్‌గా చూపించారు. ఆయా స‌న్నివేశాల‌న్నీ ఒక హిందీ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డ‌తారు.

ఇక యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు వ‌చ్చేస‌రికి మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తుంది. కియారా అడ్వాణీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌రిస్తుంది. అయితే, ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌ధ్య క‌థ‌ను పేర్చుకుంటూ వెళ్లాడేమో అనిపిస్తుంది. బోయ‌పాటి శైలిలోనే క‌థ ప్రారంభ‌మై చాలా మాసీగా సాగుతుంది. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు ప‌తాక స్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. విరామం వ‌ర‌కూ ఈ సినిమాలో క‌థే ఉండదు. కానీ, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాస్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి.

Vinaya_Vidheya_Rama_review_rating

ద్వితీయార్ధమంతా రామ్‌.. మున్నాభాయ్‌ల పోరు క‌న‌ప‌డుతుంది. దీంతో ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌రుస‌గా యాక్ష‌న్ ఎపిసోడ్లు వ‌చ్చేస్తాయి. వాటి మోతాదు కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అవి తెర‌పై చూడ‌టానికి బాగున్నా, అరే మ‌ళ్లీ ఫైట్ వ‌చ్చేసిందే అన్న ఫీలింగ్ ప్రేక్ష‌కుడిలో ఉంటుంది. హింస‌, ర‌క్త‌పాతం, హీరోయిజం మ‌రోస్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ కోస‌మే యాక్ష‌న్ అన్న‌ట్లు సెకండాఫ్ సాగుతుంది. ప్ర‌థ‌మార్ధంలో క‌నిపించే ఫ్యామిలీ డ్రామా, ఎమోష‌న్స్‌, ల‌వ్ సీన్లు, ఫ‌న్ ఇవేవీ క‌నిపించ‌వు. ఒక సీరియ‌స్ పంధాలో సాగుతుంది. బోయ‌పాటి గ‌త చిత్రాల‌న్నీ క‌లిపి క‌ట్టుగా చూసిన‌ట్లు అనిపిస్తుంది. అయితే, హీరోయిజం ఎలివేట్ చేయ‌డంలో బోయ‌పాటి త‌న మార్కును మ‌రోసారి చూపించాడు. రామ్‌చ‌ర‌ణ్‌లో ఫైట‌ర్‌ను చూడాలంటే ఈ సినిమా త‌ప్ప‌కుండా చూడాల్సిందే!

నటీనటుల

ఎధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్‌ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్‌ చరణ్‌, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. రామ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో చరణ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. విలన్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.

ప్లస్ పాయింట్స్ :

  • రామ్‌ చరణ్‌
  • మాస్ ఎలిమెంట్స్‌
  • యాక్ష‌న్ ఎపిసోడ్లు

మైనస్ పాయింట్స్ :

  • క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం
  • సంగీతం

పంచ్ లైన్:  విలయం.. విధ్వంసం… రామ!

రేటింగ్ :  2.75/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘వినయ విధేయ రామ’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)