మానవ శరీరమే నిజంగా ఓ చిత్రమైన నిర్మాణం. అది నిర్మాణమైన తీరును చూస్తే ఒక్కోసారి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఫలానా అవయవం అలాగే ఎందుకు నిర్మాణమైంది..? అనే సందేహం కలుగుతుంది.
అలాంటి అవయవాల్లో చెప్పుకోదగినవి పురుషుల్లో ఉండే వృషణాలు. అవి శరీరంతోపాటు కాకుండా బయటికి ఉంటాయి. నిజానికి అవి అలా ఎందుకు ఉంటాయో తెలుసా..? దానికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 98.6 ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది. అయితే వృషణాలకు మాత్రం ఇంత కన్నా 2 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ కావాల్సి ఉంటుంది. అప్పుడు వాటిల్లో వీర్యం తయారవుతుంది. దాని క్వాలిటీ బాగుంటుంది. అందులో ఉండే శుక్ర కణాలకు చక్కని కదలిక ఉంటుంది. ఎప్పుడైతే వృషణాలకు వేడి బాగా తగులుతుందో అప్పుడు వీర్యం నాశనమవుతుంది. ఉన్న కొద్దిపాటి వీర్యంలోనూ శుక్రకణాలు ఉండవు. ఉన్నా అవి చలించవు.
దీంతో అలాంటి పురుషులకు పిల్లలు పుట్టరు. సాధారణంగా వేడి ప్రదేశాల్లో పనిచేసే పురుషులకు, అలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి పిల్లలు త్వరగా పుట్టకపోవడానికి కారణం ఇదే.అయితే వేడి ప్రాంతాల్లో ఉండడమే కాదు పిల్లలు పుట్టకపోవడానికి మరొక కారణం కూడా ఉంటుంది. అదే… ల్యాప్‌టాప్, మొబైల్ రేడియేషన్, వేడి. ఈ రెండింటి నుంచి వచ్చే రేడియేషన్, హీట్ కారణంగా వృషణాల్లో ఉండే వీర్యం నశిస్తుంది.
అందుకే మొబైల్ ఫోన్స్‌ను జేబుల్లో పెట్టుకోరాదని వైద్యులు చెబుతారు. ఇక ల్యాప్‌టాప్‌లనైతే ఏదైనా డెస్క్‌పై పెట్టుకుని పనిచేయాలి. అంతేకానీ ఒడిలో పెట్టుకుని పనిచేయకూడదు. ఎందుకంటే దాన్నుంచి వచ్చే వేడికి వీర్యం నాశనమవుతుంది. అలాంటప్పుడు పిల్లలు పుట్టరు. కనుక ఈ విషయంలో కూడా పురుషులు జాగ్రత్త వహించాల్సిందే..!