ఒక రోజు స్నానం చేయకపోతేనే మనిషుల దగ్గర కంపు వాసన వస్తుంది. ఇక 60 ఏళ్లు అంటే మాటలా. అసలు అన్ని ఏళ్ల పాటు స్నానం చేయకుండా ఎవరైనా ఉంటారా..? నిజంగా అలాంటి వారు ఉంటే గనక వారి వద్దకు వెళ్లాలంటేనే ఎవరైనా సాహసం చేయాలి. ఎందుకంటే కోటానుకోట్ల బాక్టీరియాలు అలాంటి వ్యక్తి చుట్టూ ఉంటాయి.
దీంతో ఆ వాతావరణంలో ఉండే గాలిని పీల్చినా చాలు, వ్యాధులు వచ్చేస్తాయి. అయితే మరి.. అన్నేళ్ల పాటు స్నానం చేయని అలాంటి వ్యక్తి ఉన్నారా..? అంటే.. అవును.. ఉన్నారు.
అయితే అది మన దేశంలో కాదులెండి. ఇరాన్‌లో..!అతని పేరు అమౌ హజి. ఉంటున్నది ఇరాన్‌లో. చాలా నిర్మానుష్య ప్రాంతంలో ఒక్కడే చిన్న గదిలో ఉంటాడు. ఇతను 60 సంవత్సరాల నుంచి స్నానం చేయలేదట. దీంతో శరీరం అంతా కాల్చిన బొగ్గులా ఉంటుంది. దుమ్ము, ధూళి కమ్ముకుని ఉంటాయి. జుట్టు అట్టలు కట్టుకుని ఉంటుంది.
అయితే ఇతను ఏం తింటాడో, ఏం తినడో తెలియదు కానీ పొగ మాత్రం తాగుతాడు. అది కూడా జంతువుల మలాన్ని ఎండబెట్టి పొడి చేసి దాన్ని పైప్‌లో వేసుకుని పొగ తాగేస్తాడు.చుట్టూ నిర్మానుష్య వాతావరణం. ఒక్కడే ఉంటాడు. ఓ చిన్న గదిలోనే నివాసం. అందులో బోర్ కొడితే బయటకు వస్తాడు. అప్పుడప్పుడు దారిన జనాలు వెళ్తారు. అయినా అతను ఎవరు, అలా ఎందుకు ఉన్నాడు అని ఎవరూ పట్టించుకోరు.
ఇటీవలే ఇతన్ని ఎవరో ఫొటోలు తీయడంతో ఈ వ్యక్తి గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అసలు ఇతను ఎవరు..? అని ఇప్పుడు అక్కడి వారు ఆరా తీయడం మొదలు పెట్టారు. మరి వారికి సమాధానం దొరుకుతుందో, లేదో వేచి చూడాలి..!