Home / Inspiring Stories / చేయకూడని తప్పుడు పనులనే మళ్లీ మళ్లీ చేస్తారు..! ఎందుకు..?

చేయకూడని తప్పుడు పనులనే మళ్లీ మళ్లీ చేస్తారు..! ఎందుకు..?

Author:

ఏది వద్దంటున్నారో… తెగించి మరీ అదే పని చేస్తున్నారు. మంచిది కాదని మొత్త్తుకుంటున్నా… అవే పనులకు మళ్లీ మళ్లీ పాల్పడుతున్నారు. చట్ట విరుద్ధమని చెప్పినా..చట్టం మాకు చుట్టమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జీవితాలు నాశనమై ప్రాణాలు పోతాయని హెచ్చరించినా.. ఫర్వాలేదంటున్నారు. నిరక్షరాస్యులే కాదు… అక్షరాస్యులు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ చేపడుతున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. చట్టాలను ఉల్లంఘించినందుకు అపరాధ రుసుములు పదేపదే చెల్లించాల్సి వచ్చినా పద్దతి మార్చుకోని ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు.

బహిరంగ ప్రదేశమే ముద్దు:

public-urination beside road
బహిరంగ మల, మూత్ర విసర్జన అనారోగ్యం అంటూ నెత్తి, నోరు కొట్టుకున్నా.. చాలా మంది పట్టించుకోవటం లేదు. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. వీరి బాధలు పడలేక, గోడలపై ఇక్కడ మూత్రం పోయరాదు అని రాసుకోవాల్సిన పరిస్థితి. మరి కొంతమందైతే చెప్పుదెబ్బలు లేదా జరిమానా వేస్తామని రాస్తున్నారు. అయినా దారికి రాకపోవడంతో దేవుళ్ల చిత్రాలను గోడలపై చిత్రించాల్సిన దుస్థితి పట్టింది.

“ఇచ్చట చెత్త వేయరాదు”… అని రాసిన ప్రదేశంలోనే చెత్త వేస్తున్నారు:

garbage beside road
చెత్త వేయడానికి ప్రత్యేక ప్రదేశాలు ఉన్నా చాలామంది వీధుల్లోనే ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా వేస్తున్నారు. దీనివల్ల దుర్గంధం ప్రబలడంతో పాటు రోగాలు ప్రబలుతాయి. దోమల వ్యాప్తితో అనేక రోగాలొస్తాయి. ఇక చాలామంది కొనుగోలు చేసిన వస్తువులు, ఆహార పదార్థాల కవర్లను కూడా చెత్తబుట్టల్లో వేయరు. తమ పని ముగియగానే బజార్లో పడేస్తున్నారు. ఎక్కడైతే వేయకూడని ప్రదేశంలో చెత్త బాగా వేస్తున్నారో అక్కడ “ఇక్కడ చెత్త వేయరాదు” అని పెద్దగా రాసిన ఒక్కరు కూడా పట్టించుకోకుండా అక్కడే వేస్తున్నారు.

“నో పార్కింగ్”.. పట్టించుకోరు అక్కడే పార్క్ చేస్తారు:

parking in no parking area
‘నో పార్కింగ్’ ఏరియాల్లో వాహనాలు నిలపడం నగరవాసులకు మామూలైపోయింది. ఈ పనిచేస్తున్న వారందరూ అవగాహన లేని వారు, చదువులేని వారంటే.. అదీ కాదు. ఉన్నత విద్యావంతుల నుంచి మొదలుపెడితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లలో చాలా మంది ఇటువంటి పనికి పాల్పడుతున్నారు.

“మద్యపానం హానికరం”అని ఉంటుంది, అయినా వినరు:

alcohol drinking beside road
మద్యం సేవించి ఆర్థికంగా, అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక వైన్‌షాపుల పరిసరాల్లో మందుబాబుల సందడి ఎక్కువవుతోంది. బహిరంగంగా మద్యపానం నేరమని తెలిసినా పట్టించుకునే వారు, ఆచరించేవారు కరువవుతున్నారు. ఇక తాగి డ్రైవ్ చేసి తమ జీవితాలతోపాటు రోడ్డుపై వెళ్లే ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. తాగిన మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి దోషులుగా, నిందితులుగా మారుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయద్దని చెప్పినా లెక్క చేయరు:

gutka-pan-tobacco-spitting

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా భవనాలు ఎక్కుతూ మెట్ల పైన, గోడల పైన ఉమ్మి వేస్తూ తోటి వారికి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందమైన పార్కుల వంటి ప్రదేశాల్లో కూడా ఉమ్మివేస్తూ పరిసరాల్ని అపరిశుభ్రం చేస్తున్నారు. గుట్కాలు, పాన్‌లు తిని రోడ్డుపై వాహనంపై వెళుతూ కూడా ఉమ్మి మిగతావారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ఉమ్మడానికి ప్రత్యేకంగా తొట్టిలు ఏర్పాటు చేసిన వాటిని ఉపయోగించడం లేదు.

ఆరోగ్యానికి హానికరం.. కాని ఇదే ప్రియం వీరికి:

smoking in no smoking area
ప్రభుత్వం బహిరంగ ధూమపానం నేరమని ఎన్ని ప్రకటనల్లో వివరించినా కొనసాగుతూనే ఉంది. పొగ తాగేవారితో పాటు వారి పక్కన ఉన్నవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినా దీనిని పట్టించుకోవడం లేదు. “నో స్మోకింగ్” అని ఉన్న చోట కూడా స్మోకింగ్ చేస్తూ ఇతరులకి ఇబ్బంది కలిగిస్తున్నారు. బీడీ, సిగరెట్, చుట్ట ప్యాకెట్లపై ఉత్పత్తి దారులు పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు జారీ చేస్తున్నా… పొగతాగేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఎన్ని ప్రకటనలు చేసినా..పట్టించుకోకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
“నిబంధనలు” అస్సలు లెక్క చేయటం లేదు:

Helmet
హెల్మెట్ పెట్టుకోండి. సీటు బెల్టు బిగించుకోండి, లైసెన్సు లేకుండా వాహనం నడపవద్దు. అతి వేగం ప్రమాద కరం. రాంగ్‌రూట్‌లో ప్రయాణం చేయవద్దు. సిగ్నల్ జంపింగ్ వద్దు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు. ఉల్లంఘించినందుకు అపరాధ రుసుం కడుతున్నారే తప్ప తమ అలవాటు మార్చుకోవటం లేదు. ఇలా ఎన్ని నీతిసూత్రాలు చెప్పినా.. చట్టాలు విప్పి చెప్పినా వినేవారులేరు. నిత్యం వేలమంది ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. అవతలి వారి ప్రాణాలను తీస్తున్నారు.

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని పుట్టిన నాటి నుండి వింటున్నాం, ఇంకా చెందట్లేదు అనే వారు ఉన్నారు తప్ప, మనం మారి సమాజాన్ని మార్చుదాం అనే వారు కరువయ్యారు. ఇలాంటి వారు ఈ దేశంలో ఉన్నంత కాలం మన దేశం అభివృద్ధి చెందటం కష్టం. ప్రజల్లో మార్పు వస్తే.. కాని, దేశం ముందడుగు వేయటం కష్టం.

(Visited 792 times, 71 visits today)