Home / Devotional / శివుడికి ఇష్టమైన కార్తీకమాసంలో వచ్చే కార్తీక సోమవారాల ప్రత్యేకత గురుంచి తెలుసుకోండి.

శివుడికి ఇష్టమైన కార్తీకమాసంలో వచ్చే కార్తీక సోమవారాల ప్రత్యేకత గురుంచి తెలుసుకోండి.

Author:

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం  నాడు భక్తులందరూ శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు,  ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి ముందే  స్నానమాచరించి “హరహరశంభో” అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

karthika-masam-pujalu1

కార్తీక మాసం ఈ సోమవారంతో ప్రారంభం అవుతుంది. అందులో కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలసి రావడం ఈసారి మరో ప్రత్యేకత…. మరో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం కార్తీకమాసంలో 5 సోమవారాలు వచ్చాయి. దానితో ఈ పండుగ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30 వరకు ఉంటుంది. మరి ఇంతటి విశిష్టమైన పండగ నెలలో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం .. వాటిని ఆచరించి ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మికతను పొందుదాం.

karthika-masam-pujalu2

1వ తేదీన సోదరి ఇంట భోజనం చేయాలి :

ఈ కార్తీక మాసంలో మొదటగా వచ్చేది యమ విదియ. దీనిని భగినీ హస్త భోజనం లేదా అన్నా చెల్లెళ్ళ పండుగ అంటారు. ఈ పండుగ నవంబర్ 1 న వస్తుంది. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా యముడు ఆ సమయంలో ఆమెకు ఒక వరం ఇస్తాడు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని చెబుతారు. అందుకే ఈ రోజు సోదరి ఇంట భోజనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి.

3వ తేదీన నాగుల చవితి :

ఈ పండుగ మన మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో చేస్తారు. ఈ రోజు పుట్టలో పాలుపోసి నాగరేంద్రుడికి పూజలు చేస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వలన యాగంలో అన్ని పాములు పడి చనిపోతుంటాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు దానితో ఇంద్రుడు ఆ యాగాన్ని ఆపించి సర్పాజాతికి విముక్తి కలిగిస్తాడు. అందుకే ఆ రోజు భక్తులు ఆనందంతో పుట్టలో పాలు సమర్పిస్తారు.

10వ తేదీన ఉపవాసాలు :

కార్తీకమాసంలో వచ్చే నెల 10 వ తేదీన ఏకాదశి వస్తుంది. ఈ రోజు ఉపవాసాలు ఉంటారు. మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేచిన కారణంగా ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రహ్మాణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.

11వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి :

11 వ తేదీన సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ఉసిరి( ధాత్రి) మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. 12,16,21 దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజు ప్రతి ఇంట ఈ దీపాలను వెలిగిస్తారు.

14 తేదీన కార్తీక పౌర్ణమి :

కృత్తిక నక్షత్రంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందట. ఈ నెల 14 వ తేదీన ఉదయం నుండి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరున్ని పూజించి 365 ఒత్తులను వెలిగించి చంద్రుడు కనిపించిన తర్వాత ఉపవాసం విరమణ చేస్తారు. అలాగే కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడికాయ, కంద, పసుపు మొక్క, స్వయం పాకం ఇప్పిస్తారు.

30వ తేదీన పోలి స్వర్గం కార్తీక మాసం :

ఈ మాసం ఆఖరి రోజు వచ్చే నెల 30న అమావాస్య వెళ్లిన మరుసటి రోజు పోలిస్వర్గం పూజలు చేస్తారు. దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వారా విని వారికి స్వయంపాకలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలోగాని, చెరువులోగాని వదులుతారు. దీనితో కార్తీక మాసం పరిసమాప్తం అవుతుంది.

(Visited 6,210 times, 1 visits today)