Home / Latest Alajadi / మూవీ రివ్యూ : నాని గ్యాంగ్‌ లీడర్‌

మూవీ రివ్యూ : నాని గ్యాంగ్‌ లీడర్‌

Author:

కథా బలమున్న సినిమాలను, పాత్రలను ఎంచుకునే అతి కొద్ది మంది నటుల్లో నాని ఒకరు. ఒక పక్క కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే ‘జెర్సీ’ వంటి విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకుంటున్నారు. ఇక దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ది విభిన్న శైలి. ‘24’, ‘మనం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. అలనాటి చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’ పేరును గుర్తు తెచ్చేలా టైటిల్‌ను పెట్టినా, ఈ సినిమా కథ, నేపథ్యం పూర్తిగా వేరు. అందుకే నాని ‘గ్యాంగ్‌లీడర్‌’పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్‌తో ఆసక్తిని మరింత పెంచాయి. పైగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథానాయకుడు కార్తికేయ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఎలా ఉంది? అసలు ఈ గ్యాంగ్‌ వెనుక ఉన్న కథేంటి? వారి పగను పెన్సిల్‌ పార్థసారథి ఎలా తీర్చాడు? ప్రతినాయకుడిగా కార్తికేయ నటన ఎలా ఉంది? విక్రమ్‌ కె.కుమార్‌ వెండితెరపై తనదైన మేజిక్‌తో అలరించారా?

కథ:

ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు.అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్‌ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు.హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసే పెన్సిల్‌, ఈ రియల్‌ రివేంజ్‌ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ దేవ్‌ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

Nani-GangLeader-movie-review-rating

అలజడి విశ్లేషణ:

ప్రతీకార క‌థల్లో ఒక స‌రికొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. ఐదుగురు ఆడ‌వాళ్లు ప్రతీకారం తీర్చుకోవాల‌ని నిర్ణయించుకోవ‌డం.. ఒక‌రికొక‌రు సంబంధం లేని వాళ్లు ఒక జ‌ట్టుగా ఏర్పడి ప్రణాళిక ర‌చించ‌డం, అందుకు ఒక ర‌చ‌యిత స‌హ‌కారం తీసుకోవ‌డం క‌థకి కొత్తద‌నాన్ని తెచ్చిపెట్టింది. నేర ప‌రిశోధ‌న త‌ర‌హాలో సాగే ఈ క‌థ‌కి భావోద్వేగాలు, కామెడీని మేళ‌వించిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. మానవ సంబంధాల్ని స్పృశించిన తీరూ మెప్పిస్తుంది. క‌థా నేప‌థ్యానికి త‌గ్గట్టుగా సినిమాని కూడా ఆస‌క్తిక‌రంగా ఆరంభించారు దర్శకుడు. బ్యాంకు దోపిడిని చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్ది, ప్రేక్షకుడిని వేగంగా క‌థ‌లో లీనం చేశారు. పెన్సిల్ పార్థసార‌థి పాత్ర ప‌రిచ‌యం ద‌గ్గర్నుంచి క‌థ‌లో కామెడీ పెరుగుతుంది.

Nani-GangLeader-movie-review

కాపీ రైట‌ర్ అని తెలిసిపోయే క్రమం, రివేంజ్‌లో భాగంగానే సీసీ టీవీ ఫుటేజ్ కోసం చేసే ప్రయ‌త్నం, అక్కడ త‌న గ్యాంగ్‌తోపాటు, శన‌క్కాయ‌ల సంతూర్ పాత్రలో వెన్నెల కిషోర్‌తో క‌లిసి నాని చేసే హంగామా బాగా న‌వ్విస్తుంది.ప్రథ‌మార్ధంలో కామెడీనే హైలైట్ అయ్యింది. అయితే క‌థ ప్రేక్షకుల ఊహ‌కు తగ్గట్టుగా సాగుతున్న అనుభూతి క‌లుగుతుంది. ద్వితీయార్ధంలో స‌న్నివేశాలు మాత్రం ఉత్కంఠ‌ని రేకెత్తిస్తాయి. క‌థానాయ‌కుడు, ప్రతినాయ‌కుడి మ‌ధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగే స‌న్నివేశాలు చిత్రానికి ప్రధాన బ‌లంగా మారాయి. భావోద్వేగాలు కూడా హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. షెర్లాక్ హోమ్స్ త‌ర‌హాలో క‌థానాయ‌కుడిని చూపించాల‌నుకున్నారు ద‌ర్శకుడు. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో క‌థానాయ‌కుడు ఆ పేరును కూడా ప్రస్తావిస్తాడు. అయితే నేర ప‌రిశోధ‌న‌లో క్లూస్‌ని బ‌య‌ట‌పెట్టే విధానంలోనూ క‌థానాయ‌కుడు చేసే ప్రయ‌త్నాలు ప్రేక్షకుడిని పెద్దగా థ్రిల్ చేయ‌డక‌పోవ‌డం సినిమాకి కాస్త మైన‌స్‌. ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు మ‌రింత ఇంటెలిజెన్స్‌తో సాగుంటే సినిమా మ‌రింత బిగితో క‌నిపించేది. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయ‌కుడు త‌న కుటుంబాన్ని వెతికే విధానం, ప్రేమ‌క‌థ కూడా మెప్పిస్తాయి.

నటీనటుల

హీరో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెన్సిల్ పార్థసారథి పాత్రలో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు.హీరోయిన్ ప్రియాంక మోహన్ అందంగా ఉంది.నటనతో కూడా మెప్పించింది.విలన్ గా నటించిన కార్తికేయ రాణించాడు.సీనియర్ నటి లక్ష్మీ,శరణ్య లు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.ప్రియదర్శి,వెన్నెల కిషోర్ లు కామెడీ కోసం ట్రై చేశారు.

ప్లస్ పాయింట్స్ :

  • నాని నటన
  • క‌థ‌, క‌థా నేప‌థ్యం
  • కామెడీ

మైనస్ పాయింట్స్ :

  • విక్రమ్‌ కె కుమార్‌ మార్క్‌ లేకపోవటం

పంచ్ లైన్: 
నాని గ్యాంగ్‌ హంగామా మెప్పిస్తుంది 

రేటింగ్ :  3.5/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘నాని గ్యాంగ్‌ లీడర్‌’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)