Home / Reviews / మూవీ రివ్యూ : ‘జార్జి రెడ్డి’

మూవీ రివ్యూ : ‘జార్జి రెడ్డి’

Author:

ప్రస్తుతం టాలీవుడ్‌లో చరిత్ర మరిచిపోయిన వీరుల కథల ట్రెండ్‌ నడుస్తోంది. దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సినిమా ఆరంభం నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ‘జార్జిరెడ్డి’ జీవిత కథను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడా? అసలు జార్జిరెడ్డి కథేంటి? చూద్దాం.

కథ:

జార్జిరెడ్డి (శాండీ)ది చిన్న‌ప్ప‌టి నుంచీ అన్యాయాలను ఎదుర్కొనే స్వ‌భావం. అమ్మ చెప్పే క‌థ‌లు వింటూ… అందులో ఉన్న నీతిని బుర్ర‌కు ఎక్కించుకుంటుంటాడు. అనేక ప్ర‌శ్న‌లు వేస్తూ… కొత్త విష‌యాల్ని క‌నుక్కోవాల‌న్న తాప‌త్ర‌యంతో ఉంటాడు. యుద్ధ విద్య‌ల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తాడు. చ‌దువంటే పిచ్చి. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేరి, అక్క‌డి త‌ప్పుల్ని ప్ర‌శ్నిస్తాడు. విద్యార్థుల‌లో చైత‌న్యం ర‌గిలిస్తాడు. అక్క‌డ ఓ నాయ‌కుడిగా ఎదుగుతాడు. రైతుల స‌మ‌స్య‌పై స‌మ‌ర శంఖం మోగిస్తాడు. ఈ చైత‌న్యాన్ని దేశంలో ఉన్న అన్ని యూనివ‌ర్సిటీల‌కూ తెలిసేలా చేస్తాడు. అలా… జార్జిరెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఉస్మానియా క్యాంప‌స్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కూడా ఏర్పడుతుంది. ఈ నేప‌థ్యంలో జార్జిరెడ్డిని కొంత‌మంది ప‌థకం ప్ర‌కారం హ‌త్య చేస్తారు. ఇదంతా జ‌రిగిన క‌థే. దాన్నే తెర‌పై చూపించారు..

george-reddy-telugu-movie-review-rating

అలజడి విశ్లేషణ:

‘దళం’ సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి.. ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు చేసిన ధైర్యానికి సెల్యూట్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కథలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఎవరి మనోభావాలు కించపరచకుండా చక్కగా ప్రజెంట్‌ చేయాలి. అలాగే జార్జిరెడ్డి అసలు కథ డీవియేట్‌ కాకుండా కమర్షియల్‌ అంశాలను జోడించాలి. ఈ విషయంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. యూనివర్సిటీ రాజకీయాలు, నేతలు, పార్టీల పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా డైరెక్టర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

george-reddy-telugu-movie-review

కథేంటనే ఉత్సుకతో ప్రేక్షకులు సీట్లలో కూర్చోని సర్దుకునే లోపే నేరుగా కథ ప్రారంభమవుతుంది. ఆరంభం నుంచే నెక్ట్స్‌ ఏదో జరగబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూడటం.. క్యారెక్టర్ల పరిచయం.. రెండు మూడు చోట్ల హీరో సూపర్బ్‌ ఎలివేషన్‌తో తొలి అర్థభాగం ముగుస్తుంది.

‘ద్వితీయార్ధం ఇంకొంచెం ఇబ్బంది పెడుతుంది. క‌థంతా అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్న‌ట్టు అనిపిస్తుంది. జార్జిరెడ్డి జీవితంలో సినిమాల‌కు స‌రిప‌డే మ‌లుపులేం ఉండ‌వు. జార్జిరెడ్డి క‌థ‌ని పుస్త‌కాల‌లో చ‌దివిన వాళ్ల‌కైతే ఈ క‌థ కొట్టిన‌పిండే. వాళ్ల‌కు సైతం కొత్త‌గా క‌నిపించే అంశాలుండ‌వు. ప్ర‌తీసారీ విద్యార్థులు, వాళ్ల గొడ‌వ‌లే చూపించ‌డంతో కాస్త విసుగు పుడుతుంటుంది. పాట‌ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం, జార్జిరెడ్డి అనే పాత్ర‌ని దాటి మ‌రో కోణంలోకి వెళ్ల‌క‌పోవ‌డం ఈ చిత్రానికి ప్ల‌స్ అనుకోవాలి. ప‌తాక స‌న్నివేశాలు ఉద్వేగ భ‌రితంగా సాగుతాయి. జార్జిరెడ్డిని శ‌త్రువులు అంతమొందించిన స‌న్నివేశాలు కంట‌త‌డి పెట్టిస్తాయి. మొత్తానికి ఓ గొప్ప పోరాట యోధుడ్ని, స్ఫూర్తివంతుడినీ చూసిన అనుభూతి అయితే క‌లుగుతుంది.

నటీనటుల

జార్జిరెడ్డి పాత్ర‌లో శాండీ(సందీప్‌ మాధవ్‌) క‌నిపించారు. నటుడిగా త‌న‌కు పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా – ఈ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశార‌నే అనుకోవాలి. జార్జిరెడ్డి ఎలా ఉంటాడో చాలామందికి తెలీదు. ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలే అందుబాటులో ఉన్నాయి. అందుకే శాండీని తీసుకొచ్చి జార్జిరెడ్డి అని చెప్పినా జ‌నం న‌మ్మేస్తారు.కాబ‌ట్టి ఆ పాత్ర‌లో న‌టించ‌డం మ‌రింత సుల‌భం అయ్యింది. ద‌ర్శ‌కుడు చేసిన మ‌రో మంచి ప‌ని ఏమిటంటే… దాదాపుగా అంద‌రినీ కొత్త‌వాళ్ల‌నే ఎంచుకోవ‌డం. వాళ్ల‌కు ఎలాంటి ఇమేజ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఎలాంటి పాత్ర‌లో అయినా ఇమిడిపోగ‌లిగారు. స‌త్య‌దేవ్‌, మ‌నోజ్ నందం, చైత‌న్య కృష్ణ‌… ఇలా ఎవ‌రికి వాళ్లు త‌మ పాత్ర‌ల్లో రాణించారు. స‌త్య‌దేవ్ పాత్రే మ‌రీ అర్థాంత‌రంగా ముగిసిపోయింద‌నిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • సందీప్‌, అభయ్‌ నటన
  • ఎమోషన్స్‌, తల్లి సెంటిమెంట్‌
  • సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ‌

మైనస్ పాయింట్స్ :

  • సెకండాఫ్‌
  • భావోద్వేగాలు పూర్తిగా పండ‌క‌పోవ‌డం

పంచ్ లైన్: ఓ విద్యార్థి నాయ‌కుడి వీరుడి జీవిత కథ ‘జార్జిరెడ్డి’ 

రేటింగ్ :  రేటింగ్ ఇవ్వడం లేదు

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘జార్జిరెడ్డి’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)