చేపలు పట్టడానికి వెళ్లిన నార్వేలోని మత్స్యకారులు ఓ తిమింగలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తెల్లని రంగులో ఉన్న ఆ తిమింగలం చుట్టూ బెల్టులతో కూడిన కవచం ఉంది. గుర్రానికి బెల్టులతో కూడిన కవచం కట్టడం వాటి ద్వారా సామగ్రిని దానిపై ఉంచి మరో ప్రాంతానికి తరలించడం మనం చూస్తుంటాం.
అయితే, ఇటువంటి బెల్టులు తిమింగలానికి కట్టడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తిమింగలానికి ఇరు వైపులా కెమెరా అమర్చడానికి కూడా ఎవరో ఏర్పాట్లు చేశారు. ఇది రష్యా భద్రతా దళాల పనేనని నార్వే సముద్ర నిపుణులు మీడియాకు తెలిపారు. ఆ తిమింగలానికి రష్యా నేవీ శిక్షణ ఇస్తున్న క్రమంలో అది వారి నుంచి తప్పించుకుని వచ్చి ఉంటుందని వివరించారు.
అనంతరం దానికి కట్టి ఉన్న కవచాన్ని తొలగించి దానిని ఆ బాధ నుంచి విముక్తి చేశారు. ఆ కవచాన్ని తిమింగలం కోసమే ప్రత్యేకంగా తయారు చేశారని, దానికి ఇరు వైపులా కెమెరాలు అమర్చడానికి కూడా మౌంట్స్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది రష్యాలోని మూరమామ్స్క్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు వారు గుర్తించారు.
ఆ తిమింగలం తమ పడవ వద్దకు వచ్చి వింతగా ప్రవర్తించిందని మత్స్యకారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చాయి.