Home / Reviews / మూవీ రివ్యూ : సాహో

మూవీ రివ్యూ : సాహో

Author:

బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ సీన్స్‌తో ఇండియాస్‌ బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సాహో అందుకుందా..? బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడా..? కేవలం ఒక సినిమా అనుభవంతో సుజీత్, సాహో లాంటి మెగా ప్రాజెక్ట్‌ను ఎలా డీల్ చేశాడు..?

కథ:

ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీలో ‘సాహో’ కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌)… రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ పగ పెంచుకుంటాడు. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. పోయిన ఆ రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్‌ రూ.రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్‌చక్రవర్తి – అమృతా నాయర్‌ ప్రేమ ఏమైంది, అసలు ఇందులో సాహో ఎవరు అనేదే కథ.

Sahoo-movie-review-rating

అలజడి విశ్లేషణ:

రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్‌ అనే చెప్పాలి. భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, జాతీయ స్థాయి సినిమా… ఇంత ప్రెజర్‌ను హ్యాండిల్ చేయటంలో సుజీత్ తడబడ్డాడు. ప్రభాస్‌ను స్టైలిష్‌గా, హాలీవుడ్ స్టార్‌లా చూపింటం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన దర్శకుడు కథా కథనాల విషయంలో ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఒక రొటీన్‌ క్రైమ్‌ ఫార్ములా కథను ఎంచుకున్న సుజీత్‌, ఆ కథను కూడా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు. లెక్కలేనని పాత్రలు, ప్రతీ పాత్రకు ఓ సబ్‌ ప్లాట్‌తో కథనం గజిబిజీగా తయారైంది. అయితే డార్లింగ్ అభిమానులను మాత్రం ఖుషీ చేశాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వెండితెర మీద కనిపించిన ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించాడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా మారినా ద్వితీయార్థం లోనూ తడబాటు కనిపించింది. లవ్‌ స్టోరి కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.

పాటలు విజువల్‌గా వావ్‌ అనిపించేలా ఉన్నా కథనంలో మాత్రం స్పీడు బ్రేకర్లలా మారాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు జిబ్రాన్‌. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ యాక్షన్ కొరియోగ్రఫి. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్‌లు డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ రెప్ప వేయకుండా చూసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్‌. గతంలో ఎప్పుడు చూడని లొకేషన్లను ఎంతో అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. సినిమాకు మేజర్‌ డ్రా బ్యాక్‌ ఎడిటింగ్‌. ప్రతీ సన్నివేశం దేనికి దానికి వచ్చిపోతున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఫ్లో ఉండదు. నిర్మాణ విలువ అద్భుతం. ప్రభాస్‌ మీద ఉన్న ప్రేమతో నిర్మాతలు అవసరానికి మించి ఖర్చు చేశారు.

Sahoo-movie-review

నటీనటుల

ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో ‘మిర్చి’ రోజులను గుర్తు చేశాడు. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. యాక్షన్‌ – ప్రేమను మిళితం చేయడంతో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్‌ లుక్‌లో తన స్టైల్‌ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • ప్రభాస్‌
  • యాక్షన్‌ సన్నివేశాలు
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

  • వినోదం
  • పాటలు

పంచ్ లైన్:  యాక్షన్‌ ప్రియులు ‘సాహో’ అంటారు! 

రేటింగ్ :  3.0/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘సాహో’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)