Home / Reviews / మూవీ రివ్యూ : సూర్యకాంతం

మూవీ రివ్యూ : సూర్యకాంతం

Author:

‘ఒక మనసు’ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు మెగా వారసురాలు నిహారిక. ఒకవైపు వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తూనే వెండితెరపై నటిగా గుర్తింపు పొందాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఆమె కథానాయికగా వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ‘సూర్యకాంతం’ సినిమాతో హిట్‌ వస్తుందని నిహారిక అభిప్రాయపడ్డారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?ఆకట్టుకుందా?

కథ:

అభి(రాహుల్ విజ‌య్‌) ..సూర్య‌కాంతం(నిహారిక‌)ను చూసి ప్రేమిస్తాడు. స‌ర‌దాగా ఆడుతూ పాడుతూ ఉండే సూర్య‌కాంతంను పెళ్లి చేసుకోమ‌ని ఆమె త‌ల్లి(సుహాసిని) పోరు పెడుతుంటుంది. అయితే సూర్య‌కాంతం క‌మిట్‌మెంట్ ఫోబియో కార‌ణంగా పెళ్లి నుండి త‌ప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. ఓరోజు సూర్య‌కాంతం త‌ల్లికి హార్ట్ ఏటాక్ రావ‌డంతో చ‌నిపోతుంది. దాంతో సూర్య‌కాంతం ఇంకా ఒంటరిగా మిగులుతుంది. అభి ఆమెకు అండ‌గా నిల‌బడ‌తాడు. ఓ రోజు సూర్య‌కాంత‌ను ప్రేమించిన అభి ఆమెకు త‌న ప్రేమ‌ను చెబుతాడు. కానీ సూర్య కాంతం మ‌రుస‌టి రోజు నుండి క‌న‌ప‌డ‌దు. ఎక్క‌డికి వెళుతుందో తెలియ‌కుండా వెళ్లిపోతుంది. దాదాపు సూర్య కాంత ఏడాది వ‌ర‌కు క‌న‌ప‌డ‌దు. దాంతో ఇంట్లో చూసిన అమ్మాయి పూజ‌ (పెర్‌లెనే బెసానియా)ను పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. రెండు రోజుల్లో అభి, పూజ‌ల‌కు నిశ్చితార్థం ఉంద‌నే స‌మ‌యంలో సూర్య‌కాంతం మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తుంది. అస‌లు తాను పూజ‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు సూర్య‌కాంతంకు అభి చెప్ప‌లేదు. ఓరోజు సూర్య‌కాంతం .. అభికి ఐల‌వ్‌యూ చెబుతుంది. అప్పుడు అభి.. త‌నకు పూజ‌కు జ‌ర‌గ‌బోయే పెళ్లి గురించి చెబుతాడు. సూర్య‌కాంతం అప్పుడేం చేస్తుంది? సూర్య‌కాంతం గురించి పూజ‌కు ముందే తెలుసా? చివ‌ర‌కు అభి ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

suryakantam-movie-review-rating

అలజడి విశ్లేషణ:

కలిసుండ‌డ‌మే కాదు.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు విడిపోవ‌డం కూడా ప్రేమే అని చెప్పిన క‌థ ఇది. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి మ‌ధ్య ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా సాగుతుంది. కొత్త క‌థ కానప్పటికీ.. న‌వ‌త‌రం ఆలోచ‌న‌ల‌కి, వారి జీవ‌న శైలికి అద్దం ప‌డుతూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు ద‌ర్శకుడు. ఒక అబ్బాయి జీవితంలో ఇద్దరమ్మాయిలొస్తే? పైగా వాళ్లిద్దరిలో ఏ ఒక్కరినీ దూరం చేసుకోలేని ప‌రిస్థితులు తలెత్తితే ఎలా ఉంటుంద‌నే అంశాలే ఇందులో కీల‌కం. తొలి స‌గ‌భాగం సినిమాలో అక్కడ‌క్కడా సున్నిత‌మైన హాస్యం.. పాత్రల ప‌రిచ‌యానికే ప‌రిమిత‌మైంది త‌ప్ప పెద్దగా క‌థేమీ లేదు. నిహారిక పాత్ర చేసే హంగామా కొన్ని చోట్ల న‌వ్విస్తే, మరి కొన్ని చోట్ల చికాకు తెప్పిస్తుంది. ఆ పాత్ర డిజైన్ చేసిన విధాన‌మే అలా ఉంది. విరామం స‌న్నివేశాలు మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అక్కడ్నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

మూడు పాత్రల మ‌ధ్య సంఘ‌ర్షణని తెర‌పై చూపించిన విధానం బాగుంది. ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల సూర్యకాంతం పాత్ర వ్యతిరేక ఛాయ‌ల‌తో సాగుతుంది. కానీ ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది?ఎందుక‌లా వ్యవ‌హ‌రించిందనడానికి కార‌ణాల్ని మాత్రం బ‌లంగా చెప్పలేక‌పోయాడు ద‌ర్శకుడు. సూర్యకాంతం పాత్రకి ఉన్న కమిట్‌మెంట్ ఫోబియా గురించి బ‌లంగా చెప్పుంటే ఈ సినిమా క‌థ ప‌రిపూర్ణంగా అనిపించేదేమో. ప‌తాక స‌న్నివేశాల్ని కూడా కొత్తగా చూపించే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. సూర్యకాంతం త‌ల్లి అభితో చెప్పిన మాట‌ల‌కి లింక్ చేస్తూ ద‌ర్శకుడు క‌థ‌ని ముగించిన విధానం బాగుంది.

నటీనటుల

అభి, సూర్యకాంతం, పూజ‌.. ఈ మూడు పాత్రల్నీ ద‌ర్శకుడు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దాంతో రాహుల్ విజ‌య్‌, నిహారిక‌, పెర్లిన్‌ల‌కి చక్కటి న‌ట‌న ప్రదర్శించే అవకాశం ల‌భించింది. పూజ పాత్రలో చాలా స్పష్టత కనిపిస్తుంటుంది. ఇద్దర‌మ్మాయిల మ‌ధ్య న‌లిగిపోతూ భావోద్వేగాలు పండించే అభి పాత్రతో రాహుల్ మెప్పిస్తాడు. నిహారిక తొలి భాగంలో కొంటెపిల్లగా క‌నిపించిన విధానం.. ద్వితీయార్థంలో మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌ట పెట్టేందుకు ప్రయ‌త్నించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. సూర్యకాంతం త‌ల్లిగా ఆ పాత్ర ప‌రిధి మేర‌కు సుహాసిని చక్కగా న‌టించారు. క‌థానాయ‌కుడి త‌ల్లిదండ్రులుగా శివాజీరాజా, మ‌ధుమ‌ణి క‌నిపిస్తారు. స‌త్య అక్కడక్కడా న‌వ్వించారు. మిగిలిన పాత్రల‌కి అంత‌గా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్క్ కె రాబిన్ మంచి పాట‌ల‌తో పాటు.. నేప‌థ్య సంగీతం అందించారు. హ‌రి జాస్తి కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. వెబ్ సిరీస్ తీసి పేరు తెచ్చుకున్న ద‌ర్శకుడు ప్రణీత్ సినిమాని కూడా అదే త‌ర‌హాలో తీశారు. చాలా చోట్ల స‌న్నివేశాలు నిదానంగా సాగుతాయి. సినిమా స్థాయి వేగం కొన్నిచోట్ల మాత్రమే క‌నిపించింది. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నాయకానాయిక‌ల పాత్రలు
  • ద్వితీయార్ధం
  • సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • నిదానంగా సాగే స‌న్నివేశాలు

పంచ్ లైన్:  ‘సూర్యకాంతం’ ప‌ర్వాలేద‌నిపించే 

రేటింగ్ :  3.0/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘సూర్యకాంతం’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)