Home / Latest Alajadi / కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు – డీజీపీ.

కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు – డీజీపీ.

Author:

సినీ విమర్శకుడిగా, సామాజికవాదిగా పేరొందిన కత్తి మహేష్ ని హైదరాబాద్ నగరం నుండి ఆర్నెల్ల నగర బహిష్కరణ విధిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కత్తి మహేశ్‌ నగర బహిష్కరణపై అధికారిక ప్రకటన చేశారు. కత్తి మహేశ్‌ ఈ ఆర్నెల్లలో పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేసి విచారిస్తామని.. అతడికి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని డీజీపీ తెలిపారు.

కత్తి మహేశ్ పై నగర బహిష్కరణ వేటు

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నాం అందువల్లే ఈ నాలుగేళ్లలో అవాంఛనీయ సంఘటనలేమీ జరగలేదు. ఈ కృషి వల్లే అత్యున్నత సురక్షిత ప్రమాణాలు గల నగరంగా హైదరాబాద్‌ అవార్డులు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో అలజడులు రేకెత్తించేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కత్తి మహేశ్‌ భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. అందువల్ల ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరిగితే కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. అందువల్ల కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరించాం. ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించాం. అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాం. కత్తి మహేశ్‌పై ప్రస్తుతం మూడు కేసులు నమోదయ్యాయి. బహిష్కరణ ప్రస్తుతానికి హైదరాబాద్‌ నగరానికే పరిమితం చేశాం. తెలంగాణ మొత్తానికి బహిష్కరించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని డీజీపీ తెలిపారు.

భారతదేశం నలుమూలల నుంచి ఎక్కడినుంచైనా వచ్చి ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. కానీ కత్తి మహేశ్‌ తరహాలో ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. శాంతి భద్రతలు బాగుండటం వల్లే తెలంగాణ పౌరులు, ఉద్యోగులు, అన్నివర్గాల వారు అభివృద్ది కోసం వాళ్ల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు కావాలని పని గట్టుకుని, ప్రసార మాధ్యమాలను వేదికగా చేసుకుని ఇతర వర్గాల మధ్య తగాదాలు పెట్టడం చేయకూడదు. పదే పదే తమకున్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్తితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని డీజీపీ తెలిపారు.

(Visited 1 times, 1 visits today)