Home / Inspiring Stories / ఆలూ లేదు చూలూ లేదు ఊరి పేరు పవన్ కళ్యాణ్ నగర్…!

ఆలూ లేదు చూలూ లేదు ఊరి పేరు పవన్ కళ్యాణ్ నగర్…!

Author:

ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధానికి ప్రస్తుతానికి బ్లూ ప్రింట్ మాత్రమే రెడీ అయ్యింది. అందులోని అనేక ఉప నగరాలకు, భవనాలకు, వీధులకు ఏం పేర్లు పెట్టాలీ అనేది ఇంకా చర్చకు రావటానికే చాల సమయం పట్టొచ్చు. నందమూరి తారకరామారావు, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా పెద్ద పెద్ద రాష్ట్ర నాయకుల పేర్లతో ముందు ముందు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో ఉపనగరాలు, సర్కారీ కార్యాలయాలు, భవనాలు ఉండే అవకాశం పుష్కలంగా ఉంది.

ఐతే.. ఇదంతా ఎప్పుడు రాజధాని నిర్మాణం ఒక రూపాన్ని సంతరించుకున్నాక అది జరగటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఐతే ఇంకా నిర్మాణం మొదలు కాకుండానే ముందస్తు చర్చలూ, ప్రతిపాదనలూ ఏమీ ఏమీలేకుండానే రాజధానిలో మొట్టమొదట తన పేరుపై ఓ కాలనీ, నగర్ ఏర్పాటు చేయించుకున్న ఘనత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు దక్కింది. మీరు చదువుతున్నది నిజమే రాజధాని ప్రాంతంలోని బేతపూడి గ్రామ ప్రజలు తమ గ్రామానికి ” పవన్ కళ్యాణ్ నగర్ ” అని పేరు పెట్టేసుకున్నారు.

అలా రాజధానిలో మొదటి పేరు పవన్ కల్యాణ్ దే అయింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్న తమ భూములు కాపాడి, తమ ఇళ్లల్లో సంతోషాలు నింపిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరునే గ్రామానికి పెట్టుకుంటామంటున్నారు అక్కడి అభిమానులు,గ్రామ ప్రజలు. అంతేకాదు తమ ఊరిలో పవన్ తనకు ఇస్టమైన వ్యక్తి అని చెప్పే మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మంగళగిరి మండలంలోని ఈ “బేతపూడి” గ్రామం ఎక్కువగా పూల తోటల పెంపకంపైనే ఆధారపడి ఉంది. గ్రామం చుట్టూతా బంతి,మల్లి, చామంతి, గులాబీల పూలతోటలు ఉన్నాయి.

బేతపూడి గ్రామానికి చెందిన 300 ఎకరాల్లో 128 ఏకరాలు భూమిని ఇప్పటికే రైతులు ప్రభుత్వానికి ముందే అప్పగించారు మిగిలిన 180 ఎకరాల భూమిని ఇవ్వడానికి రైతులు నిరాకరించారు. బలవంతంగా భూములను లాక్కోవడానికి ప్రభుత్వం భూ సేకరణ జీవో విడుదల చేయడంతో దిక్కుతోచని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతుల ఇబ్బందులపై తాడేపల్లి మండలంలోని చుట్తుపక్క గ్రామాల్లో జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది మార్చి 5న పర్యటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇష్టపూర్వకంగా ఇస్తేనే భూములు తీసుకోవాలని ,బలవంతంగా తీసుకుంటే రైతుల తరపున పోరాటం చేస్తానని పవన్ తెలిపారు. అయినా గత నెల 20న ప్రభుత్వం భూసేకరణకు జీవో విడుదల చేయడంతో పవన్ మరోసారి ఆ గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా భూములు లాక్కుంటే తాను ధర్నా చేస్తాననీ హెచ్చరించారు.

పవన్ వచ్చి వెళ్లాకే సర్కార్ భూసేకరణపై పునరాలోచన చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణపై ప్రభుత్వం వెనకడుగు వేయడంతో. బేతపూడి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ భూములు తమకు దక్కడానికి కారణం పవర్ స్టారే అంటూ ఆనందం తో ఊగిపోయారు. తమ భూములని కాపాడినందుకు కృతజ్ఞతగా బేతపూడి గ్రామానికి “పవన్ కళ్యాణ్ నగర్” అని నామకరణం చేశారు. ఇప్పటికే బైపాస్ రోడ్లు కోసం, అమరావతి టౌన్ షిప్ కోసం తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుందని మళ్ళీ మూడో సారి కూడా తమ భూములు ప్రభుత్వ పరం కాకుండా పవన్ అడ్డుకున్నారని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తమ గ్రామానికి పవన్ కళ్యాణ్ నగర్ గా చట్టప్రకారం పేరు మార్పు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

(Visited 67 times, 1 visits today)