Home / Entertainment / బడీ ముష్కిల్ సే మగర్ దోస్త్ దునియా మే మిల్ తే హై !

బడీ ముష్కిల్ సే మగర్ దోస్త్ దునియా మే మిల్ తే హై !

Author:

ఆలిండియా రేడియో లో వాయిస్ ఓవర్ ఉద్యోగానికి వెళ్లినప్పుడు అతని వాయిస్ తిరస్కరణకు గురైంది. మృణాల్ సేన్ సినిమాలో వాయిస్ ఓవర్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ కు మూడు వందల రూపాయలు తొలి పారితోషికం..కోల్ కతాలో ఉద్యోగం వదిలేసి వచ్చిన అమితాబ్, ముంబై మెరైన్ డ్రైవ్ దగ్గర గడిపిన నిద్ర లేని రాత్రులన్నీ భవిష్యత్తు మీద ఆలోచనలతోనే…..ఓ ఎక్స్ ట్రా వేషం కోసం స్టూడియో లైన్లలో నుంచుని ఉంటే,..శశి కపూర్ దగ్గరి నుంచి అతనికి దొరికిన సమాధానం…..నువ్వు ఏదో ఒక పెద్ద విషయం సాధించడానికి వచ్చిన వాడివి. నీ ప్రయాణం ఇక్కడ మొదలు కాకూడదు అని…వరస వెంబడి ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరయిన అమితాబ్ కు ఊరటనిచ్చింది రిషికేశ్ ముఖర్జీ సినిమా..ఆనంద్. ఆ తర్వాత నమక్ హరామ్….రొమాంటిక్ రోల్స్ నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అమితాబ్ ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరు ఆయన టైమింగ్ సెన్స్ ని తెలియచేస్తుంది. రెండు పరస్పర విభిన్నమైన షేడ్స్ లో పరకాయ ప్రవేశం చేయడం అమితాబ్ కు కరతలా మలకమైపోయింది. యశ్ చోప్రా, ప్రకాష్ మెహ్రా….రమేశ్ సిప్పీ..ఇలాంటి దిగ్దర్శక నిర్మాతల కు అమితాబ్ ఒక వరమైపోయాడు. కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడటం, కోలుకోవటం, తర్వాత ఎం.పి.గా ఎన్నైక కావడం..ఇలా మరి కొన్ని పార్శ్వాలు అమితాబ్ జీవితంలో….ఇంకాస్త ముందుకెళితే ….అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు…అది దివాళా తీయటం..ఇదో కొత్త పాఠం ఆయనకి..ఆయన నిత్య విద్యార్ధి కదా బరువు కాలేదు,ధైర్యంగా ఎదుర్కున్నాడు…కౌన్ బానేగా కరోడ్ పతి తో తిరిగి నిలబడ్డాడు. విజయ్ అనే పేరు ఆయనకి బాగా కలిసొచ్చింది…18 సినిమాల్లో ఆయన అదే పేరుతో రోల్స్  చేశారు.బుడ్డా హొ తేరే బాప్…లో కూడా ఆయన ధరించిన పాత్ర పేరు విజయ్….పురస్కారాలు తిరస్కారాలు ..అవమానాలు..అవహేళనలూ…..అన్నీ ఎదుర్కుని నిలిచాడు…భారతీయ సినిమాకి మేరు పర్వతమంత కీర్తిని తెచ్చి పెట్టిన అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు.

పురస్కారాలు అందుకోకపోయినా, కొన్ని పాటలు ఎంతో ఖ్యాతిని సంపాదించేసుకుని సంగీతప్రియుల పెదాలపై ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అటువంటి పాటల్లో ఒకటి “ముకద్దర్ కా సికందర్“(1978) సినిమాలోని “ఓ సాథీ రే...” పాట. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో “షోలే” తరువాత అత్యంత జనాదరణ పొందిన సినిమా ఇది. చిత్రంలో “సలామే ఇష్క్ మేరీ జా”, “దిల్ తో హై దిల్”, “రోతే హుయే ఆతే హై సబ్” మొదలైన మిగతా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. ప్రేమనీ, ఆవేదననీ, ఆర్ద్రతనీ కలగలుపుకున్న “ఓ సాథీ రే...” పాట మాత్రం ఆణిముత్యమనే చెప్పాలి. అమితాబ్ కి ఎన్నో హిట్ సాంగ్స్ ని రాసిన గీత రచయిత అంజాన్ ఈ పాటని రాసారు. నీవు లేని రాత్రుల నిండా వైరాగ్యమే ఉంది. నీవు లేని పగళ్లలో దిక్కుతోచని సంచారిని మాత్రమే. మండే కొలిమి లాంటి నా జీవితంలో పడి నా  కలలన్నీ ఒక్కొక్కటిగా నశించిపోతున్నాయి. మన ఇరువురం ఒకరికొకరం లేని మన జీవితాలు జీవితాలే కాదు. నీవు లేని జీవితాన్ని జీవించేదెలా అంటూ తన  విరహాన్నీ,ఒంటరితనాన్ని వ్యక్తపరుస్తాడు అమితాబ్ బచ్చన్ ఆ పాటలో…నిజ జీవితంలో ఆయన ఎవరి గురించి ఆ పాటపాడుకున్నారో ఆయన అంతరంగానికే తెలియాలి.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు కిశోర్ కుమార్ పాడిన ఉత్తమ చిత్రగీతాల్లో ఈ పాట ఒకటి. సంగీతదర్శకద్వయం “కల్యాణ్ జీ-ఆనంద్ జీ” సంగీతాన్ని అందించిన “ఓ సాథీ రే...” పాట ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తునే ఉంటుంది అనటం అతిశయోక్తి కాదు. కొన్నేళ్ళుగా ఇదే పాట కొందరి నోటి వెంట పాటగా, ఈల గా కొన్ని వందల సార్లు వినీ వినీ విసుగొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి . చిత్రంలో ఈ పాట పాడే ముందు సికందర్(అమితాబ్) చెప్పే ఉద్వేగభరితమైన మాటలు మనసుని తడి చేస్తాయి. అనాధగా పెరిగిన అతని చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతున్న సమయంలో ఒక తోడు దొరికిందనీ, ఆ ఆప్యాయతకి, ఆదరణకీ తను కరిగిపోయానని చెప్తాడు. ఆ నేస్తం చిన్ననాడు పాడిన ఓ పాట తన గాయాలకు మందుగా పనిచేసిందనీ, ఎప్పటికి మరువని ఆ గీతాన్నే తానిప్పుడు పాడుతున్నానని చెప్పి ఈ పాట పాడతాడు సికందర్. చిన్ననాటి చెలిమి తనతో పాటు పెరిగి పెద్దదై ఊహల్లో చెలిగా మారి తనకు జీవితమైందనీ, ఆ చెలి చెలిమి లేనిదే తను బ్రతకలేననీ, ఆమె తనకెంత ప్రియమైనదో ఈ పాట ద్వారా తెలియచెప్తాడతను. ఎన్నో చాలెంజింగ్ రోల్స్ తో అభిమానులను కట్టి పడేసిన అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. 1942 అక్టోబర్ 11 నా అలహాబాద్ లో జన్మించిన అమితాబ్ బచ్చన్ సినీ ప్రస్థానానికి ముందు, సినీ జీవన గమనంలోనూ, సినిమా లనుంచి అఫీషియల్ గా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఎన్నో వివాదాలను ఎదుర్కున్నారు. రాజకీయంగా సన్నిహితంగా ఉన్న ఇందిరా గాంధీ ఫ్యామిలీ కి కూడా ఆయన దూరం కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

పద్మ విభూషణ్ 2015, పద్మ భూషణ్ 2001, పద్మ శ్రీ 1984 లో పద్మశ్రీ, 2001 లో పద్మభూషణ్, 2015 లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న అమితాబ్ బచ్చన్ లండన్ లోని ప్రతిష్టాత్మక మాడమ్ తుస్సాండ్స్ వాక్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ గా కూడా చోటు సంపాదించుకున్నారు. నిజమే….చాలా కష్టం మీదే అమితాబ్ బచ్చన్ లాంటి మిత్రులు భారతీయ సినిమా కి దొరుకుతారు. ఇవాళ ఆ మిత్రుడి పుట్టినరోజు…..ఆయనకి మనసారా శుభాకాంక్షలు చెపుదాం రండి…

(Visited 99 times, 1 visits today)