Home / Political / నగరం లో పోలీసులకు రక్షణ లేదు…!

నగరం లో పోలీసులకు రక్షణ లేదు…!

Author:

sad Hyderabad police

ఎన్నిరకాలుగా కట్టడి చేయాలని చూసినా నగరం లో చైన్ స్నాచర్లను ఎదుర్కోవటం లో పోలీసులు విఫలమౌతూనే ఉన్నరు. తాజాగా జరిగిన సంఘటన మన పోలీసుల సామర్థ్యం లోని డొల్లతనాన్ని నిరూపించింది. చైన్ స్నాచర్లను పట్టుకోవటానికి స్పెషల్ టీం లకు ప్రత్యేకంగా షూటింగ్ శిక్షణ ఇచ్చి మరీ రంగం లోకి దించాం అని చెప్పుకున్న పోలీస్ యంత్రాంగం…. ఈ రోజు ఉదయం ఎల్ బీ నగర్ లో జరిగిన సంఘటన తో పరువు పోగొట్టుకొని తలదించుకోవాల్సిన స్థితిలో పడింది.. నిజంగా మన పోలీస్ వ్యవస్థ సాధారణ పౌరుడికి ధైర్యం కలిగించే స్థితిలోనే ఉందా..? మన రక్షణ లో రక్షకభటులు సరైన సామర్థ్యం తోనే ఉన్నారా? అనే అనుమానాలు వస్తే మాత్రం… ఇప్పుడు మరోసారి ఆలోచించుకోవాల్సిందే…ఇంతకీ ఏం జరిగిందంటే…..

నగరంలోని ఎల్‌బి నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల వాహనంపైనే పరారయ్యారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు బైకుపై పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత చైన్ స్నాచర్ల వాహనం ఆగిపోయింది. బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో మొరాయించింది. ఈ క్రమంలో దొంగలను వెంబడిస్తూ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన స్నాచర్లు మారణాయుధాలతో బెదిరించి పోలీసుల బైక్ లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు గొలుసు దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులనే బెదిరించి చైన్ స్నాచర్లు పారిపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పరిస్థితి ఇలా ఉండే సామాన్య జనం పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటనతో పోలీస్ అధికారులు అవాక్కయ్యారు.

(Visited 480 times, 1 visits today)