చెన్నైలోని నెసపాక్కం ప్రాంతంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.ఓ కార్పొరేషన్ పార్కులో వాచ్ మన్ గా పనిచేస్తున్న జాన్ పాల్ ఫ్రాంక్లిన్ (26), పుష్పలత (24) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కొంత కాలంగా పుష్పలత అనారోగ్యానికి గురైంది. ఆమెకు క్షయ ఉందని గ్రహించిన ఫ్రాంక్లిన్ క్రమేణా ఆమెకు దూరమవుతూ వచ్చాడు.
తన బాధను ఫ్రాంక్లిన్ స్నేహితుడొకరికి పుష్పలత చెప్పినపుడు అసలు విషయం బయటపడింది.. ఫ్రాంక్లిన్ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు ఆ స్నేహితుడు చెప్పాడు. పుష్పలత వెంటనే భర్తను నిలదీసింది. ఆ మహిళతో సంబంధం వదులుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఆ మాటలకు ఫ్రాంక్లిన్ పట్టించుకోలేదు.సుప్రీంకోర్టే వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వాళ్లేమీ చేయలేరు. పోలీసులు నా జోలికి వస్తే వాళ్లమీదే కోర్టు ధిక్కారం కింద కేసు వేస్తా. నా ఇష్టం.. నేను ఇలాగే ఉంటా. ఇష్టమైతే నాతో ఉండు, లేకుంటే వెళ్లిపో అంటూ.. ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. భర్త వైఖరితో పుష్పలత కుంగిపోయింది.
పోలీసులూ, చట్టమూ తనకు సాయం చేయవన్న భర్త మాటలతో దిగ్ర్భాంతికి లోనైంది. తమ ఆవేదననంతా సూసైడ్ నోట్ లో రాసి.. పుష్పలత ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణంతో అసలు విషయం బయటపడటంతో పోలీసులు ఫ్రాంక్లిన్ ను విచారిస్తున్నారు.