Home / Inspiring Stories / చిన్న తనం లోనే రెండు కాళ్ళూ కోల్పోయింది అయినా జీవితాన్ని గెలిచింది

చిన్న తనం లోనే రెండు కాళ్ళూ కోల్పోయింది అయినా జీవితాన్ని గెలిచింది

Author:

కొంతమంది తమకోసమే కాదు, ప్రపంచానికి ధైర్యాన్ని నూరిపోయటానికే భూమ్మీదకొచ్చారా అన్నట్టుంటారు. శరీరం తెగిపడ్డా ఆత్మవిశ్వాసంతో పరుగెడుతూ మనలనీ ఉత్సాహ పరుస్తారు ఆకోవకే చెందిన వ్యక్తి కియాన్ హోంగ్యాన్. చైనా దేశంలోని యున్నన్ గ్రామానికి చెందిన కియాన్ తన 4వ ఏట అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రక్ ఢీకొట్టడంతో తన రెండు కాళ్లను కోల్పోయింది. అయితే ఆ సమయంలో ఆ చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. దీంతో ఆమెకు కృత్రిమ కాలును పెట్టించడం అసాధ్యమైంది. అయితే తన తాత ఓ ఆలోచన చేశాడు. ఓ బాస్కెట్‌బాల్‌ను సగానికి కత్తిరించి కియాన్ కింది భాగంలో అమర్చాడు. దీంతో ఆమె సులభంగా కదిలేందుకు వీలు కలిగింది.

Basketball Girl

అయితే బాస్కెట్‌బాల్‌తో కదిలే కియాన్ స్థానికంగా అందరి దృష్టిలో పడింది. ఇది ఇతరులకు చూడడానికి విభిన్నంగా అనిపించేది. ఈ క్రమంలో అలా.. అలా ఆమె గురించి చైనా వ్యాప్తంగా ప్రచారమైంది. దీంతో కియాన్ బాస్కెట్‌బాల్ గర్ల్‌గా 2005లో గుర్తింపు పొందింది. అయితే, ఇది ఆమెకు మేలే చేసింది. బాస్కెట్‌బాల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన ఆమెకు వైద్యం చేయించడం కోసం దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చారు. దీంతో ఎట్టకేలకు ఆమె బీజింగ్‌లోని ఓ ప్రముఖ వైద్యున్ని కలిసి కృత్రిమ కాళ్లను అమర్చుకుంది. కియాన్ అంతటితో ఆగలేదు. తాను కూడా సాధారణ పౌరుల్లాగే ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే 2007లో తన గ్రామంలో ఈత కొట్టడంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అయితే, అప్పటికే ఆమె కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో కియాన్ పాఠశాల మానేయాల్సి వచ్చింది. అయితే ఆమె అక్కడే ఉన్న వికలాంగుల స్కూల్‌లో ప్రవేశం పొందింది. దాని ద్వారా స్విమ్మింగ్ నేర్చుకోవడం మళ్ళీ మొదలుపెట్టింది.

కేవలం రెండేళ్ల కాలంలోనే కియాన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌గా అవతరించింది. 2009లో ఆమె స్విమ్మింగ్‌లో ఇతరులతో అద్భుతంగా పోటీ పడింది. ఈ క్రమంలో ఆమె చైనీస్ నేషనల్ పారాలంపిక్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో ఒక గోల్డ్ మెడల్‌ను, రెండు సిల్వర్ మెడల్స్‌ను సాధించింది. తరువాత ఏడాది జరిగిన మరో కాంపిటీషన్‌లో 3 సిల్వర్ మెడల్స్ సాధించి సత్తా చాటింది. అయితే 2011లో ఆమె తాత చనిపోగా, 2014లో యున్నన్ ప్రావిన్షియల్ పారాలంపిక్ గేమ్స్‌లో 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఫైనల్ పోటీల్లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి కియాన్ ఇక వెనుదిరిగి చూడలేదు. ఎన్నో పోటీల్లో విజేతగా నిలుస్తూ వచ్చింది.
కియాన్ ఇప్పుడు చైనా దేశం మొత్తానికీ ఒక ఆదర్షం. ప్రపంచంలో నిరాశతో కుంగిపోయే వాళ్ళకి అంతులేని స్పూర్థి. అవును, తనకి కాళ్ళు లేకుంటేనేం ఆమె ఆత్మవిశ్వాసంతో నడుస్తోంది… సలాం కియాన్.

(Visited 585 times, 1 visits today)