Home / Latest Alajadi / చైనా మాంజా వాడితే కఠిన శిక్ష తప్పదు: కేంద్ర ప్రభుత్వం

చైనా మాంజా వాడితే కఠిన శిక్ష తప్పదు: కేంద్ర ప్రభుత్వం

Author:

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పిల్లలూ, పెద్దలు ఎంతో సంతోషంగా పతంగులు(గాలిపటాలు) ఎగురవేయడం సంప్రదాయం. ఆకాశం వైపు చూస్తే రంగురంగుల గాలిపటాలు వింత వింత ఆకారాలలో దర్శనమిస్తాయి. గాలిపటం ఆకాశంలోకి ఎగరాలంటే మాంజా తప్పనిసరి. కానీ ఇక నుంచి పతంగులు ఎగురవేసే వారు చైనా మాంజా వినియోగించకూడదు. చైనా మాంజా వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో అటవీశాఖ దానిని నిషేధించింది. కేవలం పక్షులు, జంతువులకే కాదు పిల్లలు సైతం దాని వల్ల ప్రమాదాల బారినపడుతున్నారని తెలంగాణ అటవీ శాఖ అడిషనల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ మనోరంజన్‌ భాంజా తెలిపారు. కొన్నేళ్లుగా మార్కెట్‌లో చైనా మాంజా అమ్మకాలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. నైలాన దారంతో తయారు చేసే చైనా మాంజాలో గాజు పౌడర్‌ను వినియోగిస్తున్నారని అన్నారు. ఇది కాటన్ దారంతో తయారు చేసిన మాంజా కన్నా పటిష్ఠంగా ఉండడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

bf1616ca84c6fc1cda7fcb36437a004e2f7d7092b5ba7f6cc6pimgpsh_fullsize_distr

ఈ నేపథ్యంలో చైనా మాంజాను కేంద్రం నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మినా, వినియోగించినా శిక్షార్హులని హెచ్చరించారు. ఈ చట్టంలోని సెక్షన్ H- 5 , 15 ప్రకారం ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు, లక్ష రూపాయలు ఆపైన జరిమానా విధిస్తామన్నారు. ప్రజల్లో చైనా మాంజా వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా చైనా మాంజా వినియోగించినట్లు, అమ్ముతున్నట్లు తెలిస్తే అటవీశాఖ టోల్‌ ఫ్రీ నెం. 18004255364కు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంప్రదాయబద్ధంగా తయారు చేసే కాటన్ మాంజాను వినియోగించాలని సూచించారు.

(Visited 277 times, 1 visits today)