Home / Inspiring Stories / ఈ రాముడు అడవులకు పోలేదు అడవిని మన మధ్యకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ రాముడు అడవులకు పోలేదు అడవిని మన మధ్యకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Author:

Daripalli Ramaiah Photos

అశోకుడు రోడ్డుకిరువైపులా చెట్లు నాటించెను మన చిన్నతనం నుంచీ ఇప్పటి వరకూ కొన్ని వందల సార్లు విన్న వాక్యం ఇది. ఔను…! అశోకుడు చెట్లు నాటించెను కానీ… ఆయనే నాటాడా? అవి నాటిందేవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చుకానీ.. ఇప్పుడు చెట్లు నాటుతున్నదెవరూ? అంటే తెలుగు రాష్ట్రాల్లో వినిపించే ఒకే ఒక పేరు దరిపల్లి రామయ్య… ఆయనని అభిమానించే వారి కైతే “వనజీవి ” రామయ్య. ఈ రాముడు అడవులకు పోలేదు అడవిని మనమధ్యకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొక్కలు నాటడమే తన జీవిత ధ్యేయం అన్నట్టు అదే పనిగా పచ్చదనం తో భూమిని నింపాలని చూస్తూనే ఉన్నాడు..

Daripalli Ramaiah photos

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధరిపల్లి రామయ్య మొక్కల పెంపకాన్నే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆరు పదుల వయసు దాటినా ముందు తరాల కోసం శ్రమిస్తున్నారు. పచ్చదనంతో పుడమి పులకించి పోవాలని తన భార్య జానమ్మతో కలసి విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. వేసవి వచ్చిందంటే వీరు అడవులు తిరుగుతూ రకరకాల విత్తనాలు సేకరిస్తుంటారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేస్తారు. తొలకరి చినుకులు పడగానే ఆ గింజలను నాటేపని ప్రారంభిస్తారు. ఈ మొక్కలను పది మందికీ పంచి హరితహారం ఏర్పాటు చేస్తున్నారు. రామయ్యకు కాసింత సమయం దొరికిందంటే చాలు వృక్షో రక్షతి… రక్షితః అని రాసి ఉండే అట్ట ముక్కలను తలకు తగిలించుకుని ప్రచారం చేస్తుంటారు. ఎక్కడ చిన్నబోర్డు కనిపించినా, పాత రేకులు కనిపించినా ఈ సూక్తి రాయందే రామయ్యకు మనసొప్పదు. రామయ్య ఇంటి నిండా ఇలాంటి రాతలే కనిపిస్తాయి. ఎవరైనా కబురు చేస్తే స్వయంగా వెళ్లి మొక్కలు నాటి వస్తాడు. హీరో చిరంజీవి, నాగబాబులు తమ ఇళ్లలో రామయ్యతో మొక్కలు నాటించుకొని ఈ అశోకుడిని గౌరవించారు. మొక్కలను నాటాలని రామయ్యకు ఉన్న అకుంఠిత కోరిక అతడి చేతిపైన ఉన్న “వృక్షో రక్షతి.. రక్షితః” పచ్చబొట్టును చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా శుభలేఖలలో బంధుమిత్రుల పేర్లు ప్రచురించు కుంటారు. కానీ రామయ్య మాత్రం.. తన కూతరు పెళ్లి శుభలేఖలో కూడా “చెట్ల పెంపకం, వన రక్షణ, పర్యావరణం” గురించిన సూక్తులు, నినాదాలు వేయించాడు.రామయ్య ప్రయత్నం లో ఆయన సతీమణి సహాకారం కూడా తక్కువేం కాదు. ఇంటి పనులను సరిదిద్దుకుంటూనే రామయ్యతో కలిసి కొన్ని వేల మొక్కలు నాటారు ఆయన జీవిత సహచరి. తన మనవరాళ్లకు హరిత, లావణ్య, చందన, పుష్ప అనే మొక్కల పేర్లు పెట్టడం మరో విశేషం. ఈ వనజీవి శ్రమను గుర్తిస్తూ ‘యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ ’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. మరెన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. 60 ఏళ్లలో కోటికిపైగా మొక్కలు నాటి పర్యావరణంపై తనకున్న నిజమైన ప్రేమను చాటుకున్నారు. ‘పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తేవాలి. కరెన్సీ నోట్లపై నినాదాలు ముద్రించాలి. రైళ్లకు, బస్సులకు పర్యావరణం స్ఫురించేలా పేర్లుపెట్టాలి’ అని చెప్పే రామయ్య 60 ఏళ్ళ వయసులోనూ మొక్కలు నాటటానికి జిల్లా అంతటా తిరుగుతూనే ఉంటారు.

Daripalli Ramaiah Photos

రామయ్యకు పచ్చదనం మీద ఉన్న అభిమానం చూసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు అనేకమంది ప్రముఖులు ఆయన్ను సన్మానించారు. రామయ్య సేవలను, కృషిని గౌరవిస్తూ ఖమ్మం జిల్లా అధికారులు ఇటీవల ఆయనకు ఒక ద్విచక్రవాహనాన్ని ఇచ్చారు. పెట్రోల్ ఖర్చులకు ప్రతినెలా రూ.1500 అందిస్తున్నారు. “ఉత్తమ వన సంరక్షుడు, వనజీవి, పర్యావరణ విశిష్ట” వంటి అరుదైన పురస్కారాలతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రామయ్యను సత్కరించాయి.పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి కర్నాటక ప్రభుత్వం.. గుల్బర్గా జాతలో జ్ఞాపిక తోపాటు పదివేల రూపాయలు నగదు బహుమతిని అందజేసింది.

Daripalli Ramaiah Photos

కొంత కాలం క్రితం రామయ్య తిరుపతి నుంచి ఎర్రచెందనం మొక్కలు తెచ్చి తన పొలంలో నాటారు. వాటి ఆలనాపాలనాపై ప్రత్యేక దృష్టిసారించాడు. అవే ఇప్పుడు ఆయకున్న అతిపెద్ద సంపద..”అయినా చూస్తూ చూస్తూ నేను పెంచిన చెట్టును ఎలా నరకగలను?” అని అడిగే రామయ్య ప్రభుత్వం ఇప్పటి యువతకు చెట్ల పెంపకం ద్వారా ఆదాయం తెచ్చుకునే విషయంలో మరింత అవగాహన కలిగిస్తే మొక్క ల పెంపకం అభివృద్ది చెందుతుందనీ, హరిత హారం కోసం లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో మొక్కలు తెచ్చుకునే బదులు ఇక్కడి యువకులకే ౠణాల ద్వారా నర్సరీల పెంపకాన్ని ప్రోత్సహిస్తే నిరుద్యోగ సమస్యనీ కొంతవరకు తీర్చవచ్చు అంటాడు… ఈ ఆలోచన ప్రభుత్వానికి కూడా వస్తే బాగుండు…

(Visited 796 times, 1 visits today)