Home / Inspiring Stories / పేద పిల్లల కోసం విమానం కొన్నాడు

పేద పిల్లల కోసం విమానం కొన్నాడు

Author:

bahadur chand gupta

మీరెప్పుడూ విమాన ప్రయాణం చేయలేదా.. చేయాలనుకుంటే టిక్కెట్ రేట్లు మీకందుబాటులో లేవని భావిస్తున్నారా? అయినప్పటికీ కనీసం విమానం ఎక్కాలనే కోరికైనా తీర్చుకోవాలని అనుకుంటున్నారా.. మీకు అలాంటి ఆలోచనే ఉంటే..తక్షణం ఢిల్లీ అవుట్ స్కర్ట్స్‌ను సందర్శించేయండి.. అక్కడ బహదుర్ చంద్ గుప్తా పేరు అడిగితే చాలు.. ఎవరైనా టక్కున అడ్రస్ చెప్పేస్తారు? ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారు? అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే అనుభూతిని కలిగించే ఓ ఎయిర్ బస్ యజమాని. ఈయన విమానం చూడడానికి అచ్చం అందరూ ఎక్కే విమానంలాగే ఉంటుంది. ఒక మామూలు విమానంలో ఉండే అన్ని సదుపాయాలూ ఈ విమానంలో ఉంటాయి. ఒకసారి ఈ విమానం ఎక్కితే చాలు.. అందులో వాడే ప్రత్యేకమైన టెక్నాలజీ మనకు గాలిలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. దిల్లీలో పేదపిల్లలకు విమానం ఎక్కే భాగ్యాన్ని కలిగించడం కోసం ఈ ఎయిర్‌‌బస్ ను నడుపుతున్నాను అని చెప్పే బహదూర్ చంద్.. మధ్యతరగతి ప్రజలకూ ఈ విమానాన్ని ఎక్కే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

అందుకు ప్రతిఫలంగా వారి దగ్గర నుంచి కేవలం 65 రూపాయలు మాత్రమే ఛార్జి చేస్తున్నారట. ఆ డబ్బుతో ఆ విమాన ప్రయాణం చేయడానికి వచ్చే పేదవాళ్లకు ఉచితంగా భోజనం కూడా పెడుతున్నారట బహదూర్ చంద్. ”నేను హర్యానాలోని కసాన్ అనే చిన్న గ్రామంలో పుట్టాను. విచిత్రమేంటంటే.. ఆ ఊరిలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ చేసిన తొలి వ్యక్తిని నేనే. కొన్నాళ్లు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో కూడా పనిచేశాను. మా వూరికి వచ్చేటప్పుడల్లా కొంతమంది స్నేహితులు విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించమని కోరేవారు. వారిని డబ్బుతో టిక్కెట్ కొని తీసుకెళ్లే స్థోమత నాకు లేదు. అలాగే సెక్యూరిటీ కారణాల వలన వారికి ఉచితంగా విమాన దర్శన భాగ్యం కలిగించే అవకాశమూ నాకు దొరకలేదు. అందుకే కొన్నాళ్ల తర్వాత సామాన్యుల కోసం ఒక డీకమిషన్డ్ విమానం కొన్నాను. దానితో ఈ ప్రయోగం చేశాను” అంటున్నారు బహదూర్ చంద్. ప్రస్తుతం ఈ విమానాన్ని చూడడానికి వచ్చే సందర్శకుల తాకిడి తక్కువగా ఉందని చెప్పే ఆయన విమానానికి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి స్కూలు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారట.

(Visited 1,246 times, 1 visits today)