Home / Devotional / పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు…

పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు…

Author:

పెళ్లి..ఇది తెలియని వారెవరూ ఉండరు..కానీ పెళ్లి జరిగే తంతు పట్ల కానీ..వివాహ వ్యవస్థ ఉద్దేశ్యాల పట్ల కానీ అందరికి సరైన అవగాహన లేదు. పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలని ఉందా ? అలజడి మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది వివాహపు తంతు కథా..కమామీషు..

వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యే కాదు రెండు కుటుంబాల మధ్య అని చెప్పే ఒక తంతు. అయిదు రోజుల పెళ్లయినా, మూడు రోజుల వివాహమైనా, ఒకే రోజు.. ఒకే పూట, ఒకే గంట పరిణయమైనా..ఎలా జరిగినా పెళ్లి అసలు లక్ష్యం వధూవరుల సుఖ సంతోషాలే. అందరి బంధువుల సమక్షంలో పెద్దల ఆశీర్వచనాలు, దీవెనలతో ఇద్దరూ ఒక్కరుగా మారిపోయారనే గుర్తింపు కోసమే. స్త్రీ, పురుషుల మధ్య శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘీక, సామాజిక సంబంధాలని ఏర్పరచే సామాజిక సాంప్రదాయ ఒప్పందం పేరే పెళ్లి అనొచ్చు.

Hindu wedding

ఋగ్వేదంలోనూ, అధర్వణ వేదంలోనూ వివాహ సంస్కార విధులు చెప్పబడ్డాయి. కాలం మారుతున్నకొద్దీ పెళ్లి తంతులో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి మనిషి చేయాల్సిన 18 సంస్కారాలని గృహ్యసూత్రాలు చెబుతున్నాయి. హిందూ ధర్మం ప్రకారం వివాహానికి రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి. 1. ధార్మిక ప్రాధాన్యత, 2. సామాజిక ప్రాధాన్యత . మంత్రబద్దంగా జరిపే వివాహానికి ఈ రెండు లక్షణాలే లక్ష్యమయి ఉంటుంది. దైవానుగ్రహం కోసం లయబద్దంగా జపించే శబ్దాలే మంత్రాలు. ప్రతి శబ్దానికి ఓ స్పష్టమైన, నిర్ధిష్టమైన, నిఘూడమైన శక్తి ఉంటుంది. మన వేదాల్లోనే కాక ఇతర మతాల గ్రంథాల్లోనూ శబ్దానికి ఉన్న శక్తిని, మహత్తుని తెలిపే ఆధారాలు ఉన్నాయి. అలా మంత్రయుక్తంగా జరిపే వివాహ తంతులో చేసే ప్రక్రియలన్నీ కేవలం వధూవరులకే కేటాయించినవి కావు. కొన్ని కుటుంబం కోసం, కొన్ని సుఖ సంతోషాల కోసం, కొన్ని వినోదం కోసం, కొన్ని దైవానుగ్రహం కోసం..ఇలా అన్నీ కలిస్తే ఈ తంతు అంతా కలిసితేనే ఒక పెళ్లి సందడి. తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు,సంబరాలు బందుమిత్రుల విందు వినోదాలు.. ఆ పెళ్లి తంతు గురించి సింపుల్ గా స్పష్టంగా తెలుసుకుందాం..

పరిణయ విధానం:

పెళ్లీడు వచ్చిన ఆడపిల్ల తండ్రి అమ్మాయికి తగిన వరుడి కోసం వెదకటం మొదలెడతాడు. తమకి నచ్చిన, తమ కుటుంబం, ఆచారం, సంప్రదాయాలకు సరితూగే లక్షణాలున్న అబ్బాయి దొరకగానే పెళ్లి సంబంధఒ మాట్లాడతారు. అమ్మాయి, అబ్బాయిలు, వారి కుటుంబ సభ్యులు, బంధుగణం అందరూ పెళ్ళిచూపులతో మొదలెట్టి .. జాతకాలు, గుణగణాలు సరిపోల్చుకోవడం తర్వాతే..ఇక పెళ్లి అనే అసలు వ్యవహారం మొదలౌతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వివాహ పద్ధతిని బ్రహ్మ రీతి వివాహ పద్ధతి అంటారు. దీన్నే అపస్తంబ పద్ధతి అని కూడా వ్వవహరిస్తారు. అయితే ఒక్కో ప్రాంతఒ బట్టి, అక్కడి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల వల్ల ఈ పెళ్లి పద్ధతుల్లో అనేక తేడాలు కనిపిస్తాయి. అయితే ఈ పెళ్లి లోని ప్రతి చర్య వెనకా స్పష్టమైన నిర్ధిష్టమైన ఉద్ధేశ్యాలు ఉన్నాయి.

పెళ్లి చూపులు: కాబోయే వధూవరులు ఒకరినొకరు చూసుకోవటానికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఒకరినొకరు చూసుకోవడం, అభిప్రాయాలు పంచుకోవడంతో పాటూ జీవిత భాగస్వామిని అంగీకరించేందుకు పెళ్లిచూపులు ఒక వేదికలా పనిచేస్తుంది.

నిశ్చయ తాంబూలాలు: అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చాక, ఇరుపక్షాల పెద్దలు మిగతా విషయాలు అన్నీ మాట్లాడుకుంటారు. కట్నకానుకల గురించి మాట్లాడుకున్నాక ఓ మంచిరోజు చూసి పురోహితుడి సమక్షంలో అందరికీ అనువుగా ఉండే వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ముహూర్తం ప్రకారం లగ్న పత్రికని రాయించుకుని పెళ్లి నిశ్చయం అయింది అన్నట్టుగా లగ్న పత్రికలతో పాటూ తాంబూలాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు. దీన్నే నిశ్చితార్థం అని, కొన్ని చోట్ల పూలు పళ్ళు అని అంటారు. ఒకరకంగా లగ్న పత్రిక అంటే, ఆ పెళ్లిని ఇరువైపు పెద్దలు ఆమోదిస్తూ కుదుర్చుకున్న ఒప్పందం లాంటిది.

స్నాతకం: పెళ్ళి కొడుకు ఇంట్లోగాని లేదా పెళ్ళికి మందు కళ్యాణ మండపంలో లేదా విడిదిలో గాని స్నాతకం చేస్తారు.ఇది ఒకరకంగా శారీరక మానసిక శుద్ధి ప్రక్రియ అనొచ్చు. విఘ్ననాయకుడు గణేశుడి పూజతో ఈ కార్యక్రమం మొదలౌతుంది. పురోహితుడు వరుడిచేత గోత్ర ప్రవరలు చెప్పిస్తాడు.

కాశీయాత్ర: వరుడు తలపై గొడుగు, చేత్తో కర్ర పట్టుకుని తాను సన్యసించి కాశీకి వెళ్తుంటాడు. అప్పుడు వధువు సోదరుడు వచ్చి వరుని చేయి పట్టుకుని నమస్కారం చేసి ‘ఓ బ్రహ్మచారి , మీరు కాశీ వెళ్లొద్దు. నా సోదరినిచ్చి మీకు వివాహం జరిపిస్తాము. గృహస్తుడుగా మారండి అని నుదుట బొట్టు పెట్టి తాంబూలం, నూతన వస్త్రాలు ఇచ్చి ఆహ్వానిస్తాడు. సన్యాసం తీసుకున్దాం అనుకున్న బ్రహ్మచారిని గృహస్తుగా మార్చే ప్రక్రియ అన్నమాట.

వరపూజ లేదా ఎదుర్కోళ్లు: కాశీ యాత్ర మానేసి వివాహానికి సిద్ధపడిన వరుడిని, మేళ తాళాలతో కన్యాదాత ఎదురెళ్లి పానకం బిందెలు, కొత్త బట్టలతో స్వాగతిస్తాడు. ఓ బిందెలో మంచి నీళ్లు మరో బిందెలో పానకం ఉంటాయి. వరుడి చేత ఆ పానకం రుచి చూపిస్తాడు. వరుని తల్లిదండ్రులు, బంధువులని పెళ్లికి ఆహ్వానిస్తారు. తీపి తిన్పించడం ద్వారా ఒక శుభ కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం అనే భావనని కలిగిస్తారు.

మంగళస్నానాలు: పెళ్ళికి ముందు వధువు పరిశుభ్రంగా స్నానం చేసి గౌరీపూజకు సిద్ధపడుతుంది. కన్యాదాత కూడా అభ్యంగన స్నానం చేస్తాడు. పవిత్ర భావనతో పూజకు రెడీ అవుతారు.

గౌరీపూజ: వధువుచేత కన్యాదాత ఇంట్లో గౌరీపూజ చేయిస్తారు. పదికాలాలు పసుపు కుంకుమలతో వర్థిల్లేలా ఆశిర్వదించమని గౌరీదేవిని వధువు పలురకాలుగా పూజిస్తుంది.

కన్యాపరణం: పెళ్ళికొడుకు తన వివాహర్థం కొందరు బంధుమిత్రులని వధువు దగ్గరికి పంపుతాడు. తనని పెళ్ళి చేసుకోవలసిందిగా వాళ్ల ద్వారా వధువుకి కబురు పెట్టి ఆహ్వానం పలుకుతాడు.

ఇక కల్యాణం..కమనీయం అంటూ ఆనంద పారవశ్యాల్లో మునిగి తేలడానికి రంగం సిద్దం అవుతుంది. సమాజం, సంఘం, కుటుంబం సాక్షిగా ఇద్దరు యువతీ యువకులు కలిసి ఒక సరికొత్త పెళ్లి పుస్తాకాన్ని మొదలెట్టడానికి అందరి అనుమతీ లభిస్తుంది. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

(Visited 987 times, 1 visits today)