Home / Entertainment / ఈడోరకం ఆడోరకం సినిమా రివ్యూ & రేటింగ్.

ఈడోరకం ఆడోరకం సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Edorakam Adorakam Movie Perfect review and rating

మంచు ఫ్యామిలీ కథానాయకుడు విష్ణుకు రీమేకుల మీద మహా గురి. గత కొన్నేళ్లలో విష్ణు చేసిన మెజారిటీ సినిమాలు మరో భాష నుంచి అరువు తెచ్చుకున్నవే. గత రెండేళ్లలో ఎర్రబస్సు.. డైనమైట్.. లాంటి రీమేకులతో ట్రై చేశారు. ఈ ఏడాది కూడా మరో  రీమేక్ తో రెడీ అయిపోయాడు విష్ణు. ఈసారి అతడికి రాజ్ తరుణ్ కూడా తోడయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా.. ఈడోరకం ఆడోరకం. ఓ పంజాబీ సినిమా ఆధారంగా నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి విష్ణుకు ఈ కొత్త రీమేక్ ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ :

పెద్ద లాయర్ కొడుకైన అర్జున్ (మంచు విష్ణు).. ఎస్సై కొడుకైన అశ్విన్ (రాజ్ తరుణ్) మంచి స్నేహితులు. మహా అల్లరోళ్లయిన వీళ్లిద్దరూ కలిసి తమ ఫ్రెండు పెళ్లికి (వెన్నెల కిషోర్) వెళ్తారు,  ఫ్రెండ్ పెళ్లిలో నీలవేణి(సొనారిక) అర్జున్ కి, సుస్మిత(హేభ పటేల్) అశ్విన్ కి పరిచయమవుతుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ఓ అనాధనే పెళ్లి చేసుకోవాలని నీలవేణి భావిస్తున్నట్టు తెలుసుకున్న అర్జున్.. తనని తాను ఓ అనాధగానే పరిచయం చేసుకుంటాడు. నీలవేణి అన్నయ్య రౌడీ కావడంతో అతడి ఒత్తిడి మేరకు ఇంట్లో చెప్పకుండా అనాథగానే నీలవేణిని పెళ్లి చేసుకున్న అర్జున్.. అనుకోకుండా తన సొంత ఇంట్లోనే… నాన్న, అన్నయ్య, వదినల మధ్య కాపురం పెట్టాల్సి వస్తుంది. ఆ విషయాన్ని దాచిపెట్టడానికి ఒక అబద్ధం తర్వాత మరొక అబద్ధం ఆడుతూ అనేక కష్టాలు కొనితెచ్చుకున్న అర్జున్, అతడి స్నేహితుడు అశ్విన్, చివరకి ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఏం చేశారనేదే మిగితా కథనం.

అలజడి విశ్లేషణ:

కథలో కన్ఫ్యూజన్‌కి, దాన్నుంచి పుట్టుకొచ్చే కామెడీతో పాటు ఎమోషన్‌కి కూడా చాలా స్కోప్ ఉన్నా ఎక్కడా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. బాగా నవ్వించిన ఫస్టాఫ్‌ తర్వాత వచ్చే సెకండాఫ్‌లో అక్కడక్కడా సినిమా కాస్త పక్కదారి పట్టి బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. క్లైమాక్స్ ఫైట్‌కు సినిమా అసలు కథకు సంబంధమే లేదు. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళాం ఊరెళితే’, ‘హంగామా’ లాంటి సినిమాలు ఇదే అంశం ప్రధానంగా వచ్చాయి. ఆ సినిమాలను చూసిన వారికి ఈ సినిమాలో కట్టిపడేసేంత కామెడీ లేదనిపిస్తుంది. ఇక కొన్ని పూర్తిగా అక్రమ సంబంధం అన్న ఆలోచన కల్పించేలా వచ్చే సన్నివేశాలు కథ పరంగానే కాకుండా, ఫక్తు కామెడీ అంశంగా చూసినా చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి సన్నివేశాలకు పూర్తిగా అవకాశమే ఇవ్వకుండా ఉండాల్సింది.

మంచు విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోలా కనిపిస్తూనే నవ్వులు పూయించాడు. అశ్విన్ పాత్రలో రాజ్ తరుణ్ ఎప్పట్లానే తన ఎనర్జీని చూపిస్తూ చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీలో రాజ్ తరుణ్ ప్రతిభ స్థాయి ఏంటన్నది ఈ సినిమా మరోసారి ఋజువు చేసింది. ముఖ్యంగా ఇద్దరి హీరోల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్లుగా నటించిన సోనారికా, హేబా పటేల్ ఇద్దరూ నటనపరంగా పర్వాలేదనిపించినా అందాల ప్రదర్శనతో మాత్రం సినిమాకు గ్లామర్ తీసుకువచ్చారు. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో మరోసారి తన మార్క్ చూపించాడు. ఇప్పటికీ తనలో కామెడీ టైమింగ్ అలాగే ఉందని ప్రూవ్ చేసిన రాజేంద్ర ప్రసాద్ సినిమాకు సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు ఈ సినిమా స్టాండర్డ్స్ గురించి ఒకసారి చెప్పుకోవాలేమో. అడల్ట్ కామెడీ, అబద్ధాల చుట్టూ తిరిగే కథ. కథనం కూడా దానికి తగ్గట్టుగానే అడల్ట్ కామెడీకి బాగా స్కోప్ ఉండేలా రాసుకున్నారు. ఫొటోగ్రఫీ బాగుంది. రెండు గంటల సినిమా కంటే బోర్ కొట్టేస్తదేమో అని భయపడి కత్తెరలు బాగా వేసినట్టున్నారు. ఆ ఎఫెక్ట్ వల్ల సగం సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ సినిమాకు తగ్గ స్టాండర్డ్స్‌లో ఉంది. నాగేశ్వరరెడ్డికి నటుల నుంచి నటన రాబట్టుకోవడం, మేకింగ్ విషయంలోనూ ఉన్న కమాండ్ సినిమాలో కనిపిస్తుంది. కానీ రైటింగ్ సైడ్ గ్రిప్‌ లేదేమో అనిపిస్తుంది. ఈయన కథల సెలక్షన్ కూడా బాగాలేదు. ఈ విషయంలో జాగ్రత్తపడితే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్ళే ఛాన్స్ ఉంది. డైలాగ్స్ ఒకే.

ప్లస్ పాయింట్స్ :

  • మంచు విష్ణు, రాజ్ తరుణ్
  • రాజేంద్ర ప్రసాద్
  • క్లైమాక్స్
  • ఫస్టాఫ్‌ కామెడీ

మైనస్ పాయింట్స్ :

  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం.
  • సెకండాఫ్
  •  ఎడిటింగ్

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్ : ఈడోరకం ఆడోరకం కామెడీ ఇంకోరకం

(Visited 4,454 times, 1 visits today)