Home / Inspiring Stories / ఇంటికి దీపం ఇల్లాలే అని నిరూపిస్తున్న కేరళ ( కుట్టీలు ) స్త్రీలు.

ఇంటికి దీపం ఇల్లాలే అని నిరూపిస్తున్న కేరళ ( కుట్టీలు ) స్త్రీలు.

Author:

అది కేరళ లోని పాలక్కాడ్ ప్రాంతం. ఒకప్పుడు సరైన జీవనాధారం లేక, తినడానికి తిండి, చేయడానికి పని లేక, పిల్లలకు స్కూల్ కు కూడా పంపలేని దుస్థితిలో ఉండేది. ఇప్పుడదే ప్రాంతం మూడు పువ్వులు ఆరు కాయల్లా విరాజిల్లుతోంది. ఆడ వాళ్ళంతా చిన్నదో, పెద్దదో వ్యాపారం చేస్కుంటూ పిల్లల్ని బడికి పంపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ మార్పు అంతటికీ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కారణమంటే నమ్ముతారా?

ఆయన పేరు డాక్టర్ ప్రభాకర్. అమెరికాలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా హాపిగా జీవిస్తుండేవాడు. ఆయన ఒకసారి కేరళకి తిరిగొచ్చినప్పుడు పాలక్కాడ్ చుట్టుపక్కల గ్రామాలు చూసాక, వారి పేదరికం,దీన స్థితులు చూసాక ఎలాగైనా సరే వీళ్ళకు తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్రం లభిస్తే కానీ సమస్యలు పరిష్కారం కావని అర్థమైంది. స్త్రీలకు సాంఘీక ఆర్థిక స్వాతంత్రం తీసుకురావడమే లక్షంగా, డాక్టర్ ప్రభాకర్ 1996 లో సొసైటీ ఫర్ రూరల్ ఎంపవర్మెంట్ (శ్రీ) అనే ఎన్జీవో ప్రారంభించాడు. కేరల మహిళలకు ఆర్థిక సహకారం అందించడానికి అప్పటికే తనకు తెలిసిన, ప్రజాదరణ పొందిన మైక్రోఫైనాన్స్ సిస్టమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. గ్రామీణ బ్యాంక్ మోడల్ గురించి తెలుసుకోవడానికి బంగ్లాదేశ్ వెళ్లి, తన స్నేహితుడు, అమెరికాలో తన రూమ్మేట్ అయిన అయిన మొహమ్మద్ యౌనిస్ సహాయం తీసుకున్నాడు. మైక్రోఫైనాన్స్ పనితీరును అర్ధం చేసుకుని కేరళ వచ్చేసాడు.

english professor helped kerala women

మొదట తన వద్ద ఉన్న 2 లక్షల రూపాయాలనే మైక్రో ఫైనాన్సు సిస్టం మాదిరి గ్రామాల్లోని స్త్రీలకూ, ఆధారం లేని ఆడ వారికి ఇవ్వడం మొదలెట్టాడు. ఐతే బ్యాంకుల మాదిరి ఫలానా వ్యాపారమే చేయాలని వారి మీద పెత్తనం చెలాయించకుండా వారికీ నచ్చిన్న పని, వ్యాపారమే చేస్కోమని సపోర్ట్ ఇచ్చేవాడు. తక్కువ వడ్డీతో ఆడ వాళ్లకు 5 వేల నుంచి 50 వేల వరకు అవసరాలని బట్టి అప్పు ఇవ్వడం చేసేవాడు. దాంతో ఒకావిడ టీ కొట్టు, ఇంకో ఆవిడ దీపపు ప్రమిదల వ్యాపారం, ఒకావిడ ఆవు పాల వ్యాపారం… ఇలా వారికి నచ్చిన, తెలిసిన వ్యాపారమే చేయడం ద్వారా వారు ఆదాయం పొందడం.. డబ్బులు వడ్డీతో సహా చెల్లించడం జరిగింది. కొందరైతే తీసుకున్న అప్పుతో వ్యాపారం మొదలెట్టి, ఆ అప్పు తిరిగిచ్చేసి వ్యాపారం మరింత విస్తరించేందుకు మళ్ళి కొత్తగా అప్పు తీసుకుని ఎదుగుతున్నారు. ఈ రకమైన స్త్రీ సాధికారత చూస్తుంటే నేను అనుకున్నది సాధించాననే తృప్తి లభిస్తుంది అంటున్నారు ప్రభాకర్.

ఇలా ఒక వ్యక్తి తో మొదలై ఇప్పుడు చాలా గ్రామాలకు విస్తరించి ఒక ఉద్యమంలా మారింది ఈ పధకం. ఈమధ్యే పూర్తిగా ఆడవాళ్లే నడిపే వనితా అని పిలవబడే క్యాంటీన్ కూడా స్టార్ట్ చేసారు డాక్టర్ ప్రభాకర్. ముందు ముందు పదో తరగతి చదివిన ఆడవాళ్ళతో కలిసి ఒక బీపీవో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఆ గ్రామాల్లోనే ఉండి వారి సమస్యలను అర్థం చేస్కొని వారికి జీవనోపాధి గురించిన సమస్యే లేకుండా అభివృద్ధి పథం లో నడుపుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆ గ్రామాల్ని దత్తత తీసుకున్న నిజమైన శ్రీమంతుడు ఈ ఇంగ్లీష్ మాష్టారు.

(Visited 133 times, 1 visits today)