Home / Political / కేరళ పుట్టింగళ్‌దేవి ఆలయం లో భారీ పేలుడు.

కేరళ పుట్టింగళ్‌దేవి ఆలయం లో భారీ పేలుడు.

Author:

kerala-temple

కేరళలో కొల్లాం జిల్లాలోని పరవూర్‌! అక్కడ వందేళ్ల చరిత్ర కలిగిన పుట్టింగళ్‌దేవి ఆలయం! ఏడు రోజులుగా అక్కడ వార్షిక మీనాభరణి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి రోజు అయిన శనివారం రాత్రి భారీ బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు! దానిని చూడడానికి జిల్లా నలుదిక్కుల నుంచీ వేలాదిమంది తరలి వచ్చారు! అర్ధరాత్రి 12 గంటలకు బాణసంచా వేడుక మొదలు పెట్టారు! అప్పటి వరకూ జరిగిన తీర్థంతో సంబరాల్లో మునిగిన భక్తులు.. బాణసంచా విన్యాసాలతో కేరింతలు కొడుతున్నారు! మూడు గంటలపాటు ఏకధాటిగా సాగిన బాణసంచా ప్రదర్శన చివరిదశకు చేరుకుంది! అంతలోనే, ఘోర ప్రమాదం! ఆలయ పరిసరాల్లో మృత్యువు కరాళ నృత్యం చేసింది!

బాణసంచా కాలుస్తుండగా ఎగసిన నిప్పు రవ్వలు సమీపంలోని బాణసంచా గోడౌన్‌ మీద పడ్డాయి. అంతే.. ఒక్కసారిగా భారీ పేలుడు! గోడౌన్‌ తునాతునకలైంది! తెల్లవారు జామున 3.30 గంటలకు ఆ ప్రాంతమంతా మండే అగ్ని గోళమైంది! దశ దిక్కులకూ నాలుక చాపినట్లు అగ్ని కీలలు విరుచుకుపడ్డాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 106 మంది ఆహుతయ్యారు. ఏకంగా 383 మంది గాయపడ్డారు. గోడౌన్‌ తునాతునకలవడంతో దానినుంచి వచ్చిన ఇనుప చువ్వలు, గ్రిల్స్‌, కాంక్రీటు ముక్కలు బాణసంచా ప్రదర్శన చూడడానికి వచ్చిన భక్తులకు తగిలాయి. నిజానికి ఇనుప చువ్వలు, గ్రిల్స్‌, కాంక్రీటు ముక్కలు తగలడం కారణంగానే ఎక్కువమంది మరణించారని ఘటనా స్థలంలో సహాయ చర్యలు అందించిన రెడ్‌క్రాస్‌ ప్రకటించింది. ఇక గోడౌన్‌ తునాతునకలు కావడం, ఆ ప్రాంతం మండే అగ్నిగోళంలా మారడంతో అక్కడే ఉన్న ఎంతోమంది భక్తులు నిట్టనిలువునా కాలిపోయారు. వారి శరీరాలు కూడా గుర్తుపట్టకుండా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కాలిన శరీరాలు.. మృతదేహాలు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల బంగాళా పైకప్పులు కూడా పగిలిపోయాయి. కిటికీలు, గోడలు పగుళ్లు ఇచ్చాయి. దాదాపు కిలోమీటరు వరకూ పేలుడు తీవ్రత కనిపించింది. పేలుడు శబ్దం వినిపించింది. పెద్దఎత్తున బాణసంచాను నిల్వ చేయడంలో నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు తప్పుబడుతున్నారు.

క్షతగాత్రులను కొల్లాం, తిరువనంతపురంలలోని 12 ఆస్పత్రుల్లో చేర్పించారు. ఇప్పటికీ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో ఇప్పటి వరకూ 75 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించాలని భావిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు వైమానిక దళం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.12 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగా, కేరళ సీఎం ఊమెన్‌ చాందీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ప్రకటించారు. కాగా, ఘోర దుర్ఘటన అనంతరం ఆలయానికి చెందిన ఉన్నతాధికారులు పరారైనట్టు తెలిసింది.

(Visited 152 times, 1 visits today)