Home / Latest Alajadi / స్మార్ట్ ఫోన్ కోసం డెలివరీ బాయ్ గొంతుకోసి చంపిన యువకుడు.

స్మార్ట్ ఫోన్ కోసం డెలివరీ బాయ్ గొంతుకోసి చంపిన యువకుడు.

Author:

ఆన్‌లైన్‌లో ఫోన్ ఆర్డర్ చేసి.. దానికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో డెలివరీ బోయ్‌ని చంపేశాడో వ్యక్తి. ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్న నంజుండస్వామి (29)ని కె. వరుణ్‌కుమార్ (22) అనే జిమ్ ట్రైనర్ గొంతు కోసి హతమార్చాడు. బెంగళూరులోని విజయనగర్ ప్రాంతంలో గల ఓ భవనం లిఫ్టు షాఫ్టులో అతడి మృతదేహం పడి ఉంది. పది రోజుల క్రితమే జిమ్‌లో చేరిన వరుణ్ వద్ద అప్పటి వరకు ఫోన్ లేదు. కానీ అతడి స్నేహితులు, క్లయింట్లు అందరివద్ద మంచి ఫోన్లున్నాయి. మెకానిక్‌గా పనిచేసే తన తండ్రిని అతడు డబ్బులు కావాలని అడిగినా, తనవద్ద అంత లేదని ఇవ్వలేదు. అప్పుడే ఉద్యోగంలో చేరడంతో వరుణ్ వద్ద కూడా డబ్బులు లేవు. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత తనను డబ్బులు అడగడం సరికాదని అతడి తండ్రి చెప్పారు.

flipkart delivery boy murdered by youngman.

                 చేతిలో డబ్బులు లేకపోయినా, రెడ్‌మి నోట్ 3 ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసి, తన జిమ్ ల్యాండ్‌లైన్ నంబరు ఇచ్చాడు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నంజుండ స్వామి డెలివరీ తీసుకుని రాగా, అతడిని సెకండ్ ఫ్లోర్‌లోకి వరుణ్ పిలిచాడు. అతడి వద్ద నుంచి ఫోన్ లాక్కోడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎలాగోలా తప్పించుకుని బయటకు పారిపోయాడు. దాంతో వరుణ్ వెనక నుంచి ఒక ఫ్లవర్ వాజ్‌తో అతడి తలమీద కొట్టగా, స్వామి స్పృహతప్పి పడిపోయాడు. దాంతో అతడి గొంతును ఓ కత్తితో కోసేశాడు. దాదాపు పదిగంటల పాటు శవాన్ని అలాగే వదిలేసి, తర్వాత లిప్టు షాఫ్ట్‌లో పారేశాడు. అతడి వద్ద ఉన్న రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు పదివేల రూపాయల నగదు, డెలివరీ కోసం తెచ్చిన ఇతర వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వాటిలో రెడ్‌మి ఫోన్‌ను తాను వాడుతూ, రూ. 24వేల విలువైన హెచ్‌టీసీ ఫోన్‌ను మరో స్నేహితుడికి ఇచ్చాడు.

                 రెండు రోజుల తర్వాత స్వామి తండ్రి తన కొడుకు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయానికి పోలీసులు స్వామి మృతదేహాన్ని కనుగొన్నా.. అది అతడిదని తొలుత తెలియలేదు. తర్వాత ఫ్లిప్‌కార్ట్ వారిని సంప్రదించగా, జిమ్‌లో డెలివరీకి వెళ్లిన తర్వాత నుంచి అతడి ఆచూకీ లేదని చెప్పారు. వరుణ్ జిమ్ తీయడం లేదని తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేసి విచారించగా మొత్తం విషయం బయటపడింది.

(Visited 662 times, 1 visits today)