Home / Inspiring Stories / 3 నెలల్లో 60 అడుగుల బావి తవ్వింది…అదీ ఒంటరిగా!!!

3 నెలల్లో 60 అడుగుల బావి తవ్వింది…అదీ ఒంటరిగా!!!

Author:

భగీరథుడి గురించి అంతా వినే ఉంటారు. తన పూర్వీకుల ఆత్మలు శాంతించాలని వారి అస్థికలు నదిలో కలపడం కోసం ఏకంగా గంగా నదిని దివి నుంచి భువికి రప్పించాడు. అలా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వల్లే ఎవరైనా బాగా కష్టపడితే భగీరథ ప్రయత్నం చేసాడు, అపర భగీరథుడు అని మనం పొగుడుతాం. తన కనుల ముందే తాను ఇష్టపడి, కష్టపడి పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతుంటే కడుపు తరుక్కుపోయింది కర్నాటకకు చెందిన ఈ గౌరీ నాయక్ కు. ఏం చేస్తాం వాటికి పోయడానికి సరిపడా నీరి లేదు . అంతే తాడోపేడో తేల్చుకోవడానికి కొంగు బిగించింది.. మూడు నెలలపాటు శ్రమించి ఒంటరిగా బావిని తవ్వి ఆడ భగీరథ.. అపర భగీరథ అనిపించుకుంది.

రోజు కూలీ అయిన గౌరీ తన ఇంటి ఆవరణలోనే దాదాపు 15 కొబ్బరి చెట్లు, 10 అరటి చెట్లు, 150 వరకు పోకచెట్లు పెంచుకుంటోంది. ఎండాకాలం కావడంతో నీటికొరత వచ్చింది. అవి కళ్లముందే ఎండిపోతుంటే ఎం చేయాలో అర్థం కాలేదు. బోరు వేసేందుకు ఆర్ధిక స్తోమత లేదు. కూలీలను పెట్టించి బావి తవ్వించే స్థాయి కూడా లేదు. కన్న బిడ్డల్లాంటి తన మొక్కలు ఎండిపోతుంటే చూస్తూ ఉండలేకపోయింది … ఏం చేసయినా తన చెట్లను మాత్రం చావనివ్వనని ఒక ధృడ నిశయానికొచ్చింది. ఎవరి ఆసరా లేకపోయినా తనే పలుగు పార పట్టుకుని కొంగు నడుముకి బిగించింది.

Karnataka Woman Digs A 60-Feet-Deep-1

రోజుకి ఆరు గంటల చొప్పున తవ్వడం ప్రారంభించింది. రోజూ నాలుగు అడుగు చొప్పున ,మొత్తం మూడు నెలలపాటు అలుపెరగకుండా తవ్వింది. 60 అడుగుల లోతులో నీటి ఊట కనబడింది. ఇప్పుడు దాదాపు 7 అడుగుల మేర నీరు ఊరింది. ఈ అపర భగీరథ కార్యక్రమానికి గౌరీ ఎవరి సాయమూ తీసుకోలేదు. ఎవరూ సాయానికి రాలేదు కూడా. తనే తవ్వుతూ, తనే మట్టి ఎత్తిపోస్తూ చెమట చుక్కల్ని జలధారలుగా మార్చింది. గౌరీ కష్టాన్ని చూసి చలించి ముగ్గురు మహిళలు మాత్రం చివర్లో సాయమందించారు. అంత లోతునుంచి గౌరి ఒక్కతే మట్టి తట్టని నెత్తిన పెట్టుకుని ఎక్కుతుంటే, చూడలేక పోయారు.. మట్టి ఎత్తిపోయడానికి ముందుకు వచ్చారు. అయినా చాలా రోజుల దాకా ఈ విషయం కూడా ఊరిలో ఎవరికీ తెలీదట . రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో దినసరి కూలీగా పనిచేస్తున్న గౌరీ, ఒకసారి మీటింగ్ కి వచ్చినప్పుడు విపరీతమైన ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే .. ఏంటా అని ఆరా తీస్తే ఈ విషయాలు తెలిసి ఆశ్చర్యపోయారు అధికారులు. వెంటనే గౌరి ఇంటిని సందర్శించిన అధికారులకు పచ్చని మొక్కలు, 60 అడుగుల బావి..దాదాపు 10 అడుగుల మేర జలధార కనపడడం తో ఆశ్చర్యపోయి.. గౌరిని అభినందించారు. మొక్కలు బతకాలన్న ఒకే ఒక కారణంతో చెమట ధారవోసి ఒంటరిగా బావి తవ్విన గౌరి తోటి స్త్రీలకు ఆదర్శంగా నిలిచారు.

భార్యపై ప్రేమతో కొండలనే పిండిచేసిన దశరథ్ మాంఝీ, భార్యకు జరిగిన అవమానం తట్టుకోలేక, కసితో 40 రోజుల్లో బావిని తవ్విన బాపూరావు తాంజే లాంటి సాహసికులు జాబితాలోకి గౌరీ నాయక్ కూడా చేరింది. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అపర భగీరథ అనిపించుకుంది. తోటి స్త్రీలకే కాదు ముందు తరాలకీ ఆదర్శనంగా నిలిచింది.

(Visited 565 times, 1 visits today)