Home / Political / సిరియాపై దండయాత్ర దిశగా గల్ఫ్‌ సైన్యాలు

సిరియాపై దండయాత్ర దిశగా గల్ఫ్‌ సైన్యాలు

Author:

Gulf forces to fight in Syria

కొన్నాళ్ళుగా ప్రత్యక్ష దాడులకు దూరంగా ఉన్న గల్ఫ్ దేశాలు కూడా ఇక తామూ యుద్ద భూమిలో పెడుతామంటున్నాయి. రష్యా అనుకూల ఇరాన్‌ ఒక పక్కా, అమెరికా సమర్థించే సౌదీ అరేబియా దేశాలు మరో పక్కా సిరియా యుద్ధభూమిలో ఎదురెదురుగా తలపడేందుకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా సౌదీ అరేబియా గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సౌదీ అరేబియా నేతృత్వంలో ‘ఆపరేషన్‌ నార్తర్న్‌ థండర్‌ ’ పేరిట గల్ఫ్‌ దేశాలు సైనిక చర్యకు ఉపక్రమించాయి. ఇక గల్ఫ్‌ దేశాలతో పాటుగా 20 సున్ని దేశాల సేనలు ఆపరేషన్‌ నార్తర్న్‌ థండర్‌ పాల్గొంటాయని సౌదీ అరేబియా సోమవారం సాయంత్రం ప్రకటించగా, ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు తమ బలగాలు బయలుదేరాయని మంగళవారం యూఏఈ ప్రకటించింది. సిరియా భూభాగంతో 880 కిలోమీటర్ల సరిహద్దు కల్గిన టర్కీ.. సౌదీ అరేబియాకు సైనిక మద్దతనిస్తోంది. అలాగే, ఇరాక్‌ మీదుగా సిరియాలోకి వెళ్లడానికి సౌదీలోని హాఫర్‌ అల్‌ బాతీన్‌ సైనిక స్థావరంలో పూర్తిస్థాయి సన్నాహాలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియాకు అమెరికా మద్దతునిస్తుండగా సిరియాకు రష్యా మద్దతునిస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కువైట్ ఇతర గల్ఫ్‌ దేశాల సైన్యాలన్ని సిరియా వైపు సరిహద్దు దాటడానికి సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. అమెరికా సాయంతో సైనిక దళాలు ఒక్కసారిగా సిరియా వైపు ప్రవేశించడం మొదలు పెడితే సిరియా ప్రభుత్వ బలగాలకు సహాయం అందిస్తున్న రష్యా వైమానిక దళాలు స్పందించే తీరుపై ఉత్కంఠ నెలకొంది.

అయితే ప్రస్తుతం టర్కీ, ఇరాక్‌ సరిహద్దులలో అసలు సిరియా ప్రభుత్వ ఉనికే లేదు. అక్కడ ఒకవైపు తిరుగుబాటుదారులు, మరోవైపు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులే ఉన్నారు. అధికారమూ వారి చేతుల్లోనే ఉంది. సౌదీ అరేబియా సరిహద్దు నగరాలైన హాఫర్‌ అల్‌ బాతీన్‌, ఆరార్‌ల వైపు నుంచి గల్ఫ్‌ దేశాల సైన్యాలు సిరియా వైపు వెళ్లాల్సి ఉండగా ఈ రెండు ప్రాంతాలలో భారీ సంఖ్యలో ఉన్న తెలుగు వారితో పాటు ప్రవాస భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బయల్దేరటం మాత్రం బాగానే ఉంది కానీ సిరియా యుద్ధ భూమికి చేరుకున్న తర్వాత ఈ సైన్యాల పరిస్ధితి ఏమిటనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సోవియట్‌ యూనియన్‌ ప్రచ్ఛన్న యుద్ధం పరిస్ధితి మళ్ళి పునరావృతం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యెమెన్‌లో యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాలు భారీ ఖర్చును భరిస్తున్నాయి దీనికి తోడుగా పడిపోతున్న చమురు ధరలతో ఆర్ధిక పరిస్థితి సంకటంగా మారుతోంది. తాజాగా సిరియాతో యుద్ధం వలన గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్తితితో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్తల మీద కూడా యుద్ద ప్రభావం పడే అవకాశం ఉంది.

(Visited 98 times, 1 visits today)