Home / Inspiring Stories / చాక్లెట్ అసలు రుచి తీపి కాదు అని మీకు తెలుసా….?

చాక్లెట్ అసలు రుచి తీపి కాదు అని మీకు తెలుసా….?

Author:

real taste of chocolate

ఈస్ట్ ఆర్ వెస్ట్… చాక్లెట్స్ ఆర్ ది బెస్ట్ అనేది నేటి ట్రెండ్. ఈజీగా క్యారీ చేయగలగడంతో పాటు టేస్ట్‌కి టేస్ట్..ఎన్నో వెరైటీస్…తీపి, చేదు, వగరు, కారం ఇలా రకరకాల చాక్లెట్లు వినియోగదారులని విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే, అమెరికా నుంచి జపాన్ వరకూ.. రష్యా నుంచి ఆస్ట్రేలియా వరకూ నేడు ప్రపంచం అంతా చాక్లెట్లదే హవా. బహుశా శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే యశోదమ్మకు విశ్వం కనిపిస్తుందో లేదోగానీ విశ్వమానవులందరి నోటా ఇప్పుడు చాక్లెటే! ఇంతకీ అది దేవతల ఆహారం అంటారు! ఆ సంగతి తెలుసా మీకు..

                చాక్లెట్ అంటే ఏమిటి? దాన్నెలా తయారు చేస్తారు? అది ఇంతలా పాపులర్ అవడానికి కారణాలు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే చాలా ప్రశ్నలు చేదుగానే మిగులుతాయి.. ఎందుకంటే, మనలో చాలామందికి చాక్లెట్ తినడమే తెలుసు. కానీ, దాని ముందూ వెనుకా కహానీ గురించి అంత‌గా తెలియ‌దు. అతి మామూలుగా కన్పించి అమూల్యమైన మధురానుభూతిని పంచే చాక్లెట్ల అస్సలు సంగతి చాలానే ఉంది. అది దేవతల ఆహారం అంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది.

ఎప్పుడో 4 వేల సంవత్సరాల నాడే చాక్లెట్ల వినియోగం మొదలైందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. చాక్లెట్ అనే పదం వినగానే మన నోరూరుతుంది. ఓ తియ్యందనం నాలుక మీంచి జ్ఞాపకాల్లోకి జారి పదిలమౌతుందా అన్నంత తీపి అనుభవంగా మిగులుతుంది. కానీ, మొదట్లో చాక్లెట్ల రూపం, రుచి ఎలా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. చాక్లెట్ చరిత్రలోకి వెళితే అందులో 90 శాతం తాగే పదార్థంగానే ఉంది. అలాగే అది ఎప్పుడూ వగరుగానే ఉండేది. కానీ, ఇటీవలి 200 సంవత్సరాల నుంచి మాత్రమే తియ్యనైన ఘనపదార్థంలా రూపాంతరం చెందింది.

              అసలు చాక్లెట్ల ప్రస్థానం ప్రారంభ‌మైంది కొకో చెట్ల దగ్గర. కొకో గింజల నుంచి ద్రవాన్ని తయారుచేసుకుని దానిని తాగితే ఉత్తేజం కలుగుతుందని మొట్టమొదటగా తెలుసుకుంది లాటిన్ అమెరికా ప్రజలు. ఆజ్‌టెక్ నాగరికతకు చెందిన జాకోటల్ అనే పదం నుంచి చాక్లెట్ అనే పదం ఏర్పడింది. కొకో చెట్టును లాటిన్ భాషలో థియోబ్రోమా కొకో అని అంటారు. థియోబ్రోమా అంటే అర్థం దేవతల ఆహారం. ఆ దేవతల ఆహారం నేడు మనందరి భాగ్యంగా మారడానికి చాలా సమయమే పట్టింది.

 ఆజ్‌టెక్, మయన్ నాగరికతలకు సంబంధించిన రాజులు పూర్వం కొకో గింజలను ద్రవ్యంగా వినియోగించేవారు. రాజులు, సైన్యాధికారులు, పురోహితులు, వైద్యులు మాత్రమే కొకో గింజలతో చేసిన రసాన్ని తాగేవారు. సామాన్య ప్రజలకు అటువంటి భాగ్యం ఉండేది కాదు. చిత్రమేమిటంటే, 16 వ శ‌తాబ్దంలో మెక్సికోపై దండెత్తి వచ్చిన స్పానిష్ సామ్రాజ్యవాదులు బంగారం, వెండినీ కాదనీ తమ వెంట కొకో విత్తనాలను తీసుకువెళ్లారట. కొకో ద్రవానికి చక్కెరను చేర్చి వగరుదనాన్ని కాస్తా తియ్యగా మార్చింది తొలుత వాళ్లే అంటారు. కానీ, అది శ్రీమంతుల బేవరేజ్‌గానే ఉండిపోయింది.

              ఈ తియ్యధనం వల్ల అప్పట్లో యూరపులోని మిగతా దేశాలన్నీ స్పెయిన్ వైపు ఈర్ష్యగా చూసేవి. ఆ ఈర్ష్యా, అసూయలను భరిస్తూనే స్పెయిన్ కొకో రహస్యాన్ని ఓ వందేళ్ల పాటు దాచి పెట్టింది. కానీ, స్పానిష్ రాజు మూడో ఫిలిప్ కూతురు ఫ్రాన్స్‌కు చెందిన ఎనిమిదో లూయిస్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ రహస్యం ప్రపంచం అంతా తెలిసింది. ఎలా అంటే? స్పానిష్ రాకుమార్తె తనతో పాటు చాక్లెట్లను అత్తారింటికి తీసుకువచ్చింది. అలా చాక్లెట్ల సంగతి ఇతర యూరోపియన్ రాజ్యాలకూ పాకిపోయింది.

 త‌ర్వాత్త‌ర్వాత కొకోను పెంచడం వైపు అందరి దృష్టి మళ్లింది. భూమధ్యరేఖ ప్రాంతాల్లోని వలసరాజ్యాల్లో పెద్దఎత్తున కొకో, చెరుకు తోట‌లు పెంచ‌డం మొదలైంది. కానీ, అప్పటిదాకా శ్రీమంతుల ఆహారపదార్థంగానే ఉన్న చాక్లెట్ 19 వ శతాబ్దంలోగానీ సామాన్య జనులకి దరికి చేరలేదు. దీనికి ముఖ్యకారణం కొకో ప్రెస్‌ను కనుగొనడం. ఈ యంత్రం ద్వారా కొకో గింజల శుద్ధి సులభమైంది. ఈ చాక్లెట్లను ఆ తరువాతి కాలంలో క్యాడ్బరీ, మార్స్, హర్షీస్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేయడం ఇదంతా మన‌కు తెలిసిందే.. మొత్తానికి నేడు ఓ సగటు అమెరికా పౌరుడు ఏడాదిలో 5 కిలోల చాక్లెట్లు తింటున్నాడని, మన దగ్గరైతే కనీసం కిలో అయినా లాగించేస్తున్నామ‌ని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 75 బిలియన్ డాలర్లను ప్రతి సంవత్సరం చాక్లెట్లపై వెచ్చిస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి..

(Visited 719 times, 1 visits today)