Home / Inspiring Stories / జికా ను అంతమొందించే వ్యాక్సీన్ తయారు చేసింది హైదరాబాదే.

జికా ను అంతమొందించే వ్యాక్సీన్ తయారు చేసింది హైదరాబాదే.

Author:

ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ ని అడ్డుకోవటానికి వాక్సిన్‌ సిద్ధమవుతోంది.ఐతే ఈసారి ఈ వ్యాక్సీన్ ని కనుగొన్నది ఏ అమెరికన్ శాస్త్రవేత్తలో,కెనడా వైధ్య విభాగమే కాదు. భారతీయ శాస్త్రవేత్తలు అందునా మన హైదరాబాద్‌కు చెందిన వాక్సిన్లు, బయోటెక్‌ ఔషధాల తయారీ కంపెనీ భారత బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌. ‘జికా వాక్‌’ పేరుతో ప్రపంచాన్ని వణికించే వైరస్ ని అంతమొందించే వాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన మూల ఔషధ వాక్సిన్‌ నెల రోజుల్లో ప్రీ క్లీనికల్‌ ట్రయల్స్‌కు వెళ్లనుంది. ఇనాక్టివేటెడ్ వాక్సిన్‌తో పాటు రికాంబినెంట్‌ వాక్సిన్‌ కేండిడేట్స్‌ (మూల ఔషధాలు)ను అభివృద్ధి చేసినట్లు భారత బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ బుధవారం మీడియా కు వెల్లడించారు.

ఈ వైరస్ వున్న దోమ గర్బంతో వున్న తల్లిని కుడితే, ‘మైక్రోసెఫాలీ’ వ్యాధి సోకి ఆ ప్రభావంతో చిన్నారుల పుర్రెలు కుంచించుకుపోతాయి. నరాల బలహీనత కుడా సంభవిస్తుంది. ఒక్కోసారి పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది.

Hyderabad Lab Claims It Has Made World’s First Zika Virus Vaccine 1

భారత బయోటెక్‌ రీసెర్చి అండ్‌ డెవల్‌పమెంట్‌ విభాగం డైరక్టర్‌ డాక్టర్‌ సుమతితో కలిసి మాట్లడిన ఆయన. “ప్రపంచ తాజా శత్రువు జికా వైరస్ ని ఎదుర్కునేందుకు ప్రపంచంలోనే తొలి వాక్సిన్‌ను మన దేశంలోనే అభివృద్ధి చేశాం. ఈ వాక్సిన్‌పై ఐదారునెలల పాటు ప్రీ క్లీనికల్‌ ట్రయల్స్‌ జరుగుతాయి. ప్రీ క్లీనికల్‌ ట్రయల్స్‌ వచ్చిన తర్వాత క్లీనికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తాం” అని చెప్పారు. ఐతే ఈ వ్యాక్సీన్ అన్ని పరీక్షలలో నెగ్గి అందుబాటులోకి రావటానికి ఇంకో రెండేళ్ళూ పడుతుందట. జికా వైరస్ పై ప్రపంచం అంతా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సమయంలో రాబోయే ఉత్పాతాన్ని ఊహించి ఏడాది క్రితమే జికాకు వ్యాక్సిన్‌ కనుగొనే పనిలో భారత బయోటెక్‌ బృందం నిగమగ్నమైంది. చికెన్‌ గున్యా వాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల క్రమంలోనే తాము జికా వాక్సిన్‌ పై కూడా దృష్టి పెట్టి ఆ దిశగా కూడా ప్రయోగాలు చేసారట. సుమారు ఏడాది క్రితం జికా వైరస్ ను పరిశోదనల నిమిత్తం భారత్ అధికారికంగా దిగుమతి చేసుకొని దానిని ఎదుర్కోవటానికి వాక్సీన్ కనుగొనే దిశగా పరిశోదనలు సాగించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే వీలైనంత త్వరలో 10 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి భారత బయోటెక్‌ బృందం సిద్దంగా ఉందట.

జికా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న ‘బ్రిక్స్‌’ దేశం బ్రెజిల్‌కు తమ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయడం ద్వారా ‘వ్యాక్సిన్‌ దౌత్యం’ చేయవచ్చనీ,ప్రపంచం లోని అన్ని దేశాలతోనూ సత్సంబందాలను నెలకొల్పటానికి కూడా ఇదొక మార్గం అవుతుందనీ డాక్టర్ కృష్ణ అభిప్రాయ పడుతున్నారు. భారత బయోటెక్‌ రూపొందించిన జికా వైర్‌సను శాస్రీయంగా అధ్యయనం చేసి, దాన్ని అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ప్రకటించారు. మేకిన్‌ ఇండియాకు జికా వ్యాక్సిన్‌ అభివృద్ధి ఊతమిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

జికా వైరస్‌ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని అమెరికా వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెప్పటంతో ఈ వైరస్ మీద మరింతగా భయాందోళనలు నెలకొన్నాయి.. ఇప్పటి వరకు ఎడీస్‌ ఈజిప్టై దోమ ద్వారా మాత్రమే జికా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని భావించే వారు. తాజాగా టెక్సాస్ లో జికా వైరస్‌ ఉన్న వ్యక్తితో లైంగికంగా కలిసిన ఓ మహిళకు జికా వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.

zika Virus 2

ఐతే మరిన్ని పరిశోదనలు కూడా జరుగుతున్నాయి కానీ అవి నేరుగా వైరస్ మీద కాకుండా జికా వైరస్‌ ను వ్యాప్తి చేసే ఎడీస్‌ ఈజిప్టై దోమను మనుషులకు దూరంగా ఉంచేందుకు మాత్రమే.. ఇలా దోమలను దూరంగా ఉంచే ఓ పరికరాన్ని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అనస్టేషియా మస్కిటో కంట్రోల్‌ డిస్ట్రిచ్ట్ అభివ్ధృద్ధి చేసింది.శరీరానికి ఫ్యాన్‌ లాంటి పరికరం ధరించడం ద్వారా దోమకాటును నివారించవచ్చని పరిశోధకులు అంటున్నారు. దోమకాటుతో జికా వైరస్ వేగంగా వ్యాప్తం చెందుతున్న నేపథ్యంలో ఈ పరికారానికి కూడా ప్రాధాన్యం ఏర్పడింది. జికా, చికెన్‌గున్యా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌కు కారణమవుతున్న ఏడెస్ జినస్ అనే దోమను తరిమికొట్టడానికి ఆఫ్!..క్లిప్ ఆన్ మస్కి టో రిపెల్లెంట్ అనే పరికరాన్ని ఫ్లోరిడా కు చెందిన పరిశోధకులు క్రిస్టఫర్ బిబ్స్, ర్యూడెక్స్ రూపొందించారు. బ్యాటరీతో నడిచే ఫ్యాన్ తో పురుగుల మందును ఆవిరి రూపంలో విడుదల చేయడం ద్వారా ఈ పరికరం దోమలను మనుషులకు దూరంగా తరిమికొడుతుందని, వ్యాధి నివారణకు ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇదే పరికరాన్ని ఏడిస్ దోమల నుంచి రక్షణగా వాడొచ్చు. పొగ మంచు మాదిరిగా ఆవిరి వెదజల్లే ఈ పరికరాన్ని ఎస్సీ జాన్సన్ అండ్ సన్స్ తయారు చేసింది. ఈ పరికరం కూడా ఇంకా పరీక్షల దశలోనే ఉంది.

(Visited 1,495 times, 1 visits today)