Home / Political / హైదరాబాద్ పై పంజా విసురుతున్న “సైలెంట్ కిల్లర్”

హైదరాబాద్ పై పంజా విసురుతున్న “సైలెంట్ కిల్లర్”

Author:

hyderabad traffic co

కాలుష్య ఉద్గారాల్లో కార్బన్‌ మోనాక్సైడ్‌ (CO) అత్యంత ప్రమాదకరమైనది. నేరుగా రక్తంలోకి వెళ్లి మెదడుకు ప్రాణవాయువు అందకుండా చేస్తుంది. ఆ మహమ్మారి. రంగు, రుచి, వాసన ఉండని విషవాయువు కార్బన్ మోనాక్సైడ్‌ను సైలెంట్ కిల్లర్‌గా అభివర్ణిస్తారు. ఈ వాయువు నిమిషాల వ్యవధిలో మనుషులను స్పృహ కోల్పోయేలా చేసి ప్రాణాలు తీస్తుంది. 1999 నుంచి 2010 మధ్య కాలంలో అమెరికాలో కార్బన్ మోనాక్సైడ్ కారణంగా  5,100 మంది మరణించినట్టు వ్యాధి నియంత్రణ కేంద్రాల గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ వాయువు స్థాయి మన గ్రేటర్‌లో అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాల్లోనే దీని తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి తరుణంలో వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు నగర రహదారులపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజలను బాగా చూసుకోవాల్సిన అధికారులే భాగ్యనగరపు వాసుల ప్రాణాలతో చెలగాటమాటుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా నగరవాసులను కార్బన్‌ మోనాక్సైడ్‌ కాటేస్తోంది. కొన్నేళ్లుగా దీని తీవ్రత నగరంలో పెరుగుతూ వస్తోంది. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఒక్కోసారి ప్రమాదకర స్థాయికి రెట్టింపు నమోదవుతోంది. వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల రోజు తప్పి రోజు వాహనాలు రోడ్లపైకి రావాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్‌ నగరంలో అంతగా ఫలితమివ్వదని నిపుణులు చెబుతున్నారు. కారణం నగరంలో పౌరులు ఉపయోగించుకునే సొంత వాహనాలకంటే ప్రజారవాణాకు చెందిన బస్సులు, ఆటోల వల్లే కాలుష్యం తీవ్రంగా నమోదవుతోంది. ప్రమాదకరమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ కాలుష్యానికి ఇవే కారణం…

రెండు దశాబ్దాల వ్యవధిలోనే వాహనాల నుంచి వెలువడే CO పరిమాణం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 శాతం పెరిగినట్లుగా ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) చేపట్టిన అధ్యయనంలో తేలింది. విపరీతంగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే పంజాగుట్ట, లక్డీకాపూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బేగంపేట, ప్యారడైజ్‌, ఖైరతాబాద్‌, జేఎన్టీయూహెచ్‌ తదితర ప్రాంతాల్లో కార్బన్‌ మోనాక్సైడ్‌ తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. మూడు కొత్త వాహనాలు వదిలే కాలుష్య ఉద్గారాలకు సమనంగా ఒక పాత వాహనం విడుదల చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 1994లో 126.7 టన్నుల CO వెలువడగా.. నేడు ఆ సంఖ్య 212 టన్నులకు చేరుకుంది.

(Visited 360 times, 1 visits today)