Home / Inspiring Stories / ఇక హైదరాబాద్ లో బహిరంగంగా మూత్రం పోస్తే సన్మానమే

ఇక హైదరాబాద్ లో బహిరంగంగా మూత్రం పోస్తే సన్మానమే

Author:

మనలో ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బహిరంగ మూత్ర విసర్జన చేసే ఉంటాం. ఏ ట్రాన్స్ ఫార్మర్ చాటునో,చెత్తకుండీ పక్కనో లేదంటే మనకు అడ్డేంటి చెప్పండీ అదీ మన జన్మహక్కు అన్నట్టు రోడ్డు పక్కన గోడ కనిపిస్తే చాలు పక్కనే వంద మంది ఉన్నా మనకేం పట్టిందీ “పని” కానిచ్చేయటమే….

అయితే ఈసారి అదే పని చేసేవారి ని కాస్త అదిలించటం కోసం మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక కొత్త పద్దతి కనిపెట్టారు. ఫైన్ వేయటమో, లేదంటే ఇంకేదో పనిష్మెంట్ ఇవ్వటమో అనుకునేరు అదేం కాదు… ఎక్కడ బహిరంగంగా పోస్తున్నారో అక్కడే వారిని ఆపి దండేసి దన్నం పెడుతున్నారు…. మామూలుగా కాదు ఆ తతంగాన్ని వీడియో తీస్తున్నారు కూడా… అసలింతకీ విషయం ఏమిటంటే…

Hyderabad Traffic Police

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంటుంది. రద్దీని పట్టించుకోకుండా కొంతమంది స్టేషన్ చుట్టు పక్కల బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. దీంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. బహిరంగంగా పబ్లిక్ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేసిన కొందరు వ్యక్తులకు పది మంది ముందు… నడి రోడ్డు మీదే పూలదండ వేశారు పోలీసులు. అంతేనా, మీరు గ్రేట్ అంటూ చేతికి గులాబీ పువ్వు కూడా అందించారు. మహాంకాళి మందిర్ పోలీసులు కూడా ఇదే పని చేశారు. రోడ్డు మీద మూత్రం పోసిన ఓ వ్యక్తికి పూలదండ వేసి.. పోలీసుల చప్పట్ల మధ్య చేతిలో ఓ గులాబీ పెట్టారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నా… మళ్లీ మళ్లీ అవే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో.. బహిరంగ ప్రదేశాల్లో ఇలా మూత్ర విసర్జన చేసేవారికి వెరైటీగా వారు చేస్తున్న తప్పును వివరించేందుకే ఇలా సన్మానం చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఆ మద్య మహారాష్ట్ర లో ఒక స్వచ్చంద సంస్థ కూడా ఇలా రోడ్డుపక్క న పోసే వారి మీద నీళ్ళు పోసి మరీ పరిశుభ్రత అవసరాన్ని తెలియ జెప్పే ప్రయత్నం బాగానే చేసింది…

అయితే ఇక్కడొక ప్రశ్న కూడా ఉంది పోలీసులు చేసిన పని సబబే కానీ ఎక్కడా టాయిలెట్లు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? వచ్చే మూత్రాన్ని ఎవరైనా ఎంత సేపు ఆపుకుంటారు. నగరం లో పలు చోట్ల ఏర్పాటు చేసిన టాయిలెట్లలో సరైన మెయింటనెన్స్ లేదు. కొన్నిటిలో నీళ్ళ సౌకర్యమూ లేదు. కొన్ని చొట్ల కనీసం రెండు మూడు కిలోమీటర్ల పరిథిలో అసలు టాయిలెట్లే లేవు. సికింద్రాబాద్ స్టేషన్ పక్కనే ఉన్న శౌచాలయం దగ్గరికే వస్తే అక్కడ మూత్ర విసర్జన అటుంచి ఒక రెండు నిమిషాలు అందులో నిలబడితే చాలు మనిషి మూర్చపొయేంత కంపు వస్తుంది. సరైన శుభ్రత లేని టాయిలెట్లో కంటే బయట వెళ్ళటమే సరైంది గా అనిపించేలా ఉంటాయా టాయిలెట్లు. ఇక సామాన్య నగర పౌరును పరిస్థితేంటి? బయట పోస్తే సన్మానం, ఫైనూ అనటానికి ముందు గా పరిశుభ్రమైన టాయిలెట్లు ఏర్పాటు చేస్తే బావుంటుందనేది చాలా మంది అభిప్రాయం….

(Visited 1,246 times, 1 visits today)