పాకిస్తాన్ నుంచి బధిర-మూగ యువతి గీత తిరిగి స్వదేశానికి చేరుకున్న తరువాత అదేవిధంగా ప్రస్తుతం భారత్ లో నివసిస్తున్న పదిహేనేళ్ల మొహమ్మద్ రంజాన్ ను కరాచీలోని అతడి తల్లి వద్దకు చేర్చడానికి భారత్ అధికారులు కృషి ఆరంభించారు.రంజాన్ తండ్రి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు తన మకాం మార్చి అక్కడ మరొక వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి పోరు భరించలేక రంజాన్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ లోకి ప్రవేశించాడు. రంజాన్ ను పోలీసులు భోపాల్ లో పట్టుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన అతడి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో అతడికి అక్కడ ఆశ్రయం కల్పించారు. గీతను తిరిగి స్వదేశానికి పంపించడంలో ఎంతో కృషి చేసిన పాకిస్తానీ సామాజిక కార్యకర్త అన్సార్ బుర్నే ఇటీవలే రంజాన్ ను అతడి తల్లి వద్దకు చేర్చే ప్రయత్నం ఆరంభించారు. రంజాన్ కు చెందిన అన్ని డాక్యుమెంట్లతో సహా రాష్ట్రపతికి లేఖ పంపినట్లు ప్రధానమంతి కార్యాలయం (పిఎంఒ) కన్సల్టెంట్ అశుతోష్ శుక్లా పేర్కొన్నారు. పిఎంఒ లేఖ రాయడంతో ఎప్పుడో మూసేసిన రంజాన్ కు చెందిన ఫైలును తిరిగి తెరవడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు.
కాగా సోమవారం తిరిగి స్వదేశానికి వచ్చిన గీతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆత్మీయంగా పలకరించారు. యావత్ భారత దేశం ఆమెను సంరక్షిస్తుందని భరోసా ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. పాకిస్థాన్ లో ఆమెను సంరక్షించిన ఈధి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈధి ఫౌండేషన్ కు రూ.1 కోటి విరాళం ప్రకటించారు.