Home / Inspiring Stories / ప్రేమ కోసం సైకిల్ మీద ఖండాలు దాటాడు ….

ప్రేమ కోసం సైకిల్ మీద ఖండాలు దాటాడు ….

Author:

“ఎందుకొచ్చావిక్కడికి?” స్వీడన్ ఇమిగ్రేషన్ అధికారి ప్రశ్న.
“నా భార్యను కలుసుకోవటానికి” సమాధానం చెప్పాడా యువకుడు.
“ఏ ఫ్లైట్ లో వచ్చావ్?” మరో ప్రశ్న.
“నేను నా సైకిల్ మీద వచ్చాను ఫ్లైట్లో కాదు”
వాట్..!? ఇండియా నుంచీ స్వీడన్ వరకూ సైకిల్ మీదా… అదీ ఒక అమ్మాయి కోసమా..? ఆ ఇమిగ్రేషన్ అధికారికే కాదు మనకూ ఆశ్చర్యం కలిగించే మాట ఇది. ఈ సన్ని వేశం ఏ సినిమాలోదో?, కథ లొనిదో? కాదు.. 1977 లో నిజంగా జరిగిన ఘటన… ఒక భారతీయ చిత్ర కారుడి అందమైన,అద్బుత ప్రేమకథ… దేశంలోని అతి పేద రాష్ట్రాల్లో ఒకటైన ఒడిషాలో అంటరానితనం, వివక్షల మధ్య పుట్టి పెరిగిన ఒక యువకుడికీ, యూరోప్‌లో స్వీడన్‌ దేశానికి చెందిన ఒక సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతికీ మధ్య వికసించి న ప్రేమ గాథ!

ప్రద్యుమ్నకుమార్‌ (పీకే) మహానందియా 1949లో ఒరిస్సా లోని ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు. చిత్రకళపై చిన్ననాటి నుంచి అభిరుచి కలిగిన పీకే 1971లో ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరాడు. ఏ వ్యక్తినైనా ఎదురుగా నిల్చోబెట్టుకొని పది నిమిషాల్లో బొమ్మ గీయగలిగే వాడు. అప్పట్లో దినపత్రికల్లో ఇతని గురించిన కథనాలు ప్రచురితమయ్యాయి. 1975లో ఒకసారి రోడ్డుపై అతను బొమ్మ గీస్తుండగా ఒక అమ్మాయి దగ్గరగా వచ్చి.”నా బొమ్మ గీస్తారా..?” అంటూ అడిగింది. ఆమె పేరు షార్లొట్‌ వాన్‌. స్వీడన్‌ నుంచి భారత్‌కు పర్యటన కోసం వచ్చింది పీకే తో తన బొమ్మ గీయించుకోవాలని ఉబలాటపడింది.అయితే ఆరోజు పీకే వేసిన చిత్రం ఆమెకు నచ్చలేదు.”సరే రేపు మళ్ళీ నా బొమ్మ వేద్దువు గానీ లే” అంటూ వెళ్ళిపోయింది. పీకే ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.రెండో రోజు బొమ్మ వేసాడు బాగా వచ్చింది. అతన్ని పొగడ్తలతో ముంచెత్తిందామె…. మాటల్లోనే తనది స్వీడన్ అనీ లండన్‌లో చదువుకుంటున్న తాను యూరోప్‌ నుంచి ‘హిప్పీ ట్రెయిల్‌’గా పేరు గాంచిన రోడ్డు మార్గం గుండా ఇరాన్‌, అఫ్ఘానిస్తాన్‌, పాకిస్తాన్‌లను దాటేస్తూ, బస్సుల్లో ప్రయాణిస్తూ భారత్‌కు చేరుకున్నాననీ చెప్పింది.

indian reached sweden on cycle

మూడో రోజూ, నాలుగో రోజు కూడా ఆ ఇద్దరూ కలుసుకున్నారు.ఇద్దరికీ అర్థమైంది ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని. వారిద్దరూ ఢిల్లీ నుంచి ఒడిషా లోని పీకే సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడే స్థానిక ఆచారాల ప్రకారం పెండ్లి చేసుకున్నారు. ఆమె తన పేరును ‘చారులత’గా మార్చుకుంది. అక్కడి నుంచి షార్లొట్‌ వెళ్లిపోతూ తన వెంట రమ్మని పీకేను కోరింది. కానీ అప్పటికింకా చదువు పూర్తి కాకపోవడంతో తర్వాత వస్తానని ఇక్కడే ఉండిపోయాడు. ఆమె విమాన టికెట్ల కోసం డబ్బులిస్తానంది కానీ అతడికి అభిమానం అడ్డొచ్చింది. తన స్వంత డబ్బుతోనే యూరోప్‌ చేరుకుంటానని చెప్పాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమలేఖలు కొనసాగాయి. ఆ తర్వాత తన చదువు పూర్తి చేసుకున్న పీకే స్వీడన్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ అంత డబ్బు సమకూర్చుకోవడం అతని వల్ల కాలేదు.

కానీ వెళ్ళాలి అనే కోరిక తన ప్రేయసిని కలుసుకోవాలనే తపన ముందు ఏదీ నిలబడ లేకపోయింది. తన దగ్గరున్న డబ్బుతో ఒక సైకిల్ కొన్నాడు ప్రయాణానికి సిద్దమయాడు. సరిగ్గా షార్లోట్ ప్రయాణించిన ‘హిప్పీల’ మార్గంలోనే ఆయన సైకిల్‌పై బయలుదేరాడు. అది 1977 జనవరి 22. ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌, అటు నుంచి లాహౌర్‌…. అలా అలా ముందుకు సాగిందతని సైకిల్‌ యాత్ర. రోజుకు దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించేవాడు. దారిలో తన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలందుకుంటూ ముందుకు సాగాడు. ఎదురుపడ్డ మనుషులను నిలబెట్టి వారి బొమ్మలు గీసిచ్చేవాడు. ఆయన బొమ్మలకు మెచ్చి డబ్బులు, కొందరు భోజనం, వసతి కల్పించేవారు. 1970 నాటి ప్రపంచం నేటితో పోలిస్తే చాలా విభిన్నమైంది. చాలా దేశాల్లో ప్రవేశించడానికి ఆనాడు వీసాలు తప్పనిసరేమీ కాదు. తోవలో చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సైకిల్‌ కూడా అనేక సార్లు పాడైంది. అయినా ఎలాగైనా సరే షార్లొట్‌ను కలవాలన్న ఏకైక పట్టుదలే అతన్ని చివరకు స్వీడన్‌ చేర్చింది. దాదాపు ఐదు నెలల క్లిష్టమైన సైకిల్‌ యాత్ర తర్వాత అతడు స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ చేరుకున్నాడు.

అక్కడే అతన్ని ఆపి ప్రశ్నించిన ఇమిగ్రేషన్ అధికారులు. సైకిల్ మీద వచ్చానన్న అతని సమాధానానికి ఆశ్చర్య పోయారు.మరో విశయం ఏమిటంటే షార్లోట్ రాజకుటుంబానికి చెందిన యువతి. ఆమె ఒక నిరుపేద భారతీయుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందంటే వారు నమ్మలేకపోయారు. అయితే పీకే తన వద్దనున్న ఫోటోలను చూపించి ఎలాగైతేనేం, చివరకు షార్లోట్ ని కలుసుకున్నాడు. అక్కడి రాజవంశీకుల ఆచారాల ప్రకారం తెల్లవారు వేరే రంగు వారిని పెండ్లి చేసుకోవడం నిషిద్ధం. అయినా పీకే సాహస యాత్ర తెలిసిన ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను గౌరవించి, సాంప్రదాయాలను పక్కకు నెట్టి పీకేను తమ కుటుంబ సభ్యుడిగా ఆమోదించారు. అక్కడ మళ్లీ ఇద్దరికి వారి సాంప్రదాయ పద్దతిలో మళ్ళీ పెళ్ళి జరిగింది.

వారి ప్రేమ వివాహానికి 40 ఏళ్లు ఇప్పుడు డాక్టర్‌ పీకే మహానందియా భారతదేశం తరఫున ఒడిషా సాంస్కృతిక రాయబారి హౌదాలో ఉన్నారు. ఇప్పుడు పీకే స్వీడన్‌లో పేరు గాంచిన కళాకారుడు. స్వీడిష్‌ ప్రభుత్వానికి కళలు, సంస్కృతి విభాగంలో సలహాదారుగా ఉన్నాడు. ఆయన చిత్రాలను ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రదర్శించారు. 2012లో ఒడిషాలోని ఉత్కల్‌ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. దళితుడన్న కారణం తో ఒకప్పుడు తనను అవమానించి, వేధించిన గ్రామం ఆయన ఎప్పుడు వచ్చినా ఘనంగా స్వాగతం చెబుతోంది.

ఇదీ ఒక ప్రేమ కథ…. 1970 లలో అన్ని కిలోమీటర్లు ఒక సైకిల్ మీద వెళ్లటం మామూలు విశయం కాదు… కానీ ప్రేమ ఆ యాత్రకన్నా గొప్పది అందుకే దేశాలూ, ఖండాలూ దాటించింది, సాహసాలూ చేయించింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజల్‌లీలా భన్సాలీ వీరి ప్రేమకథ ఆధారంగా సినిమా తీయాలని ప్లాన్‌ చేస్తున్నాడట. అందమైన సాహస ప్రేమ గాథ వెండి తెర మీదే కనిపిస్తే ఆనందమే కదా…!

(Visited 1,738 times, 1 visits today)